Mumbai vs Rajasthan: రాజస్థాన్‌తో మ్యాచ్‌.. హార్దిక్‌కు కఠిన పరీక్ష.. ముంబయి బోణీ కొట్టేనా?

హార్దిక్‌ నాయకత్వంలోని (Hardik Pandya) ముంబయి తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది. దూకుడుగా ఆడే బ్యాటర్లు.. పటిష్ఠమైన బౌలింగ్‌ విభాగం ఉన్నా గెలుపు మాత్రం ఇంకా అందుకోలేదు.

Updated : 01 Apr 2024 15:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోల్తా కొట్టింది.. రికార్డు స్కోర్లు నమోదైన మ్యాచ్‌లోనూ విజయం వరకూ వచ్చినా ఓటమి తప్పలేదు. ముచ్చటగా మూడో మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబయి. ఇవాళ రాజస్థాన్‌తో ముంబయిలో తలపడనుంది.

ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన రెండు టీముల్లో ఒకటైన ముంబయి .. ఈ సీజన్‌లో ఆడిన రెండింట్లోనూ ఓటమిపాలైంది. రోహిత్ శర్మ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్యకు ఒక్క విజయమూ దక్కలేదు. హైదరాబాద్‌తో రికార్డు స్కోరు మ్యాచ్‌ తర్వాత ముంబయికి నాలుగు రోజుల వ్యవధి లభించింది. ముమ్మరంగా సాధన చేసిన ఆ జట్టులో నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్లకు కొదవేం లేదు. నిలకడలేని ప్రదర్శనలు, వ్యూహాలను అమలు చేయడంలో కొరవడిన నాయకత్వ లోపం వల్లే ముంబయి ఓటమిపాలైందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే హార్దిక్‌ తన బౌలింగ్‌ వనరులను సమర్థంగా వినియోగించుకోలేకపోతున్నాడు.

ఈసారైనా బుమ్రా విషయంలో..

ముంబయి ఆడిన గత రెండు మ్యాచుల సమయంలో.. మాజీ క్రికెటర్ల నుంచి వచ్చిన ప్రశ్న. స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా ఎక్కడ? గత సీజన్‌ వరకూ అతడు పవర్‌ప్లేలో కనీసం రెండు ఓవర్లు వేసేవాడు. కానీ, ఇప్పుడు మాత్రం ఒక్క ఓవర్‌ను మాత్రమే హార్దిక్‌ ఇస్తున్నాడు. పొదుపుగా బంతులేస్తున్నా సరే అతడిని కొనసాగించకుండా ఇన్నింగ్స్‌లోని 12 ఓవర్ల తర్వాత బౌలింగ్‌ ఇస్తున్నాడు. దీంతో అతడు వచ్చేనాటికి మ్యాచ్‌పై పట్టు కోల్పోతోంది. దీనికి ఉదాహరణ హైదారబాద్‌తో మ్యాచ్‌.. ఒకవైపు భారీ స్కోరు చేస్తున్న క్రమంలో చక్కగా బౌలింగ్‌ వేస్తున్న అతడిని కాదని మరొకరికి హార్దిక్‌ బంతి ఇచ్చాడు. దీంతో హైదరాబాద్‌ బ్యాటర్లపై ఉన్న కాస్త ఒత్తిడి పోయింది. మరింత స్వేచ్ఛగా ఆడారు. ఇప్పుడు రాజస్థాన్‌ జట్టులోనూ హిట్టింగ్‌ చేసే బ్యాటర్లు ఉన్నారు. ఈసారైనా బుమ్రాతో కీలక ఓవర్లు వేయిస్తేనే ముంబయికి ఫలితం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.

సూర్య లేని లోటు..

ముంబయి బ్యాటింగ్‌ లైనప్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ, రోహిత్, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్ మాత్రమే రాణించారు. ఇషాన్‌, హార్దిక్‌ పాండ్య కీలకమైన సమయంలో పెవిలియన్‌ బాట పడుతూ నిరాశపరిచారు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ లేని లోటు కనిపిస్తోంది. టీ20ల్లో నంబర్‌ వన్‌ బ్యాటర్ అయిన అతడు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లను గెలిపించిన రికార్డు ఉంది. ఈసారి మాత్రం నమన్‌ ధిర్‌ వన్‌డౌన్‌లో ఆడుతున్నా ప్రభావం చూపించలేకపోయాడు. పాండ్య కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లతో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. 

తుది జట్లు (అంచనా)

ముంబయి: ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్‌ ధిర్, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, శామ్స్‌ ములాని, పీయూశ్‌ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, క్వెనా మపాకా

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్‌ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మయేర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేశ్‌ ఖాన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని