Abhishek Sharma: కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్‌: అభిషేక్ శర్మ

హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో ఓపెనర్‌గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్‌తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. 

Published : 20 May 2024 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న బ్యాటర్ అభిషేక్ శర్మ. ఓపెనర్‌గా వస్తూ ట్రావిస్‌ హెడ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడేస్తున్నాడు. తాజాగా పంజాబ్‌పై కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 41 సిక్స్‌లు కొట్టి.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. విరాట్ కోహ్లీని (2016లో 38 సిక్సర్లు) అధిగమించాడు. ఈసారి కూడా కోహ్లీ 37 సిక్స్‌లతో కొనసాగుతున్నాడు. ఇరు జట్లూ నాకౌట్‌కు చేరుకోవడంతో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్‌పై ఇన్నింగ్స్‌కు అభిషేక్ శర్మకే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో తన ఆటతీరుపై శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఇప్పుడీ ఎడిషన్‌లో బ్యాటర్లదే హవా. ప్రస్తుతం నాకు మంచి రోజులు నడుస్తున్నాయి. ఈ బ్యాటింగ్ ప్రదర్శనను జట్టు విజయాల కోసం ఉపయోగిస్తున్నా. పంజాబ్‌తో భారీ లక్ష్యం ఉండటంతో ఎలాగైనా నా కంట్రిబ్యూషన్‌ ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశా. ఎలాంటి షాట్లు కొట్టాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నా. లారా మా కోచ్‌గా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తీవ్రంగా శ్రమించా. ఇప్పటికీ ఏదైనా సందేహం ఉంటే లారా అందుబాటులోనే ఉంటాడు.  చెత్త బంతుల కోసం వెయిట్ చేసి మరీ ఆడుతున్నా. బౌలర్లను కాస్త ఒత్తిడికి గురి చేస్తే ఆ తర్వాత మనం అనుకున్న విధంగా బ్యాటింగ్‌ చేయొచ్చు. గతి తప్పిన బంతులను ఏమాత్రం ఉపేక్షించను. ఎప్పుడూ మద్దతుగా ఉండే అభిమానులకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఉప్పల్ మైదానం క్యురేటర్, గ్రౌండ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. మా శైలికి అనుకూలంగా ఉండేలా పిచ్‌ను తయారు చేసి ఇచ్చారు’’ అని అభిషేక్ వెల్లడించాడు. 

బ్యాక్‌ఫుట్‌పై సిక్స్‌లు ప్రాక్టీస్‌ చేశా: క్లాసెన్

‘‘ప్రాక్టీస్‌ సమయంలోనూ నేను సిక్స్‌లను కొట్టేందుకే శ్రమించా. బ్యాక్‌ఫుట్‌పై బంతిని ఎలా స్టాండ్స్‌లోకి పంపాలి అని సాధన చేశా. ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒకటి లేదా రెండు బౌండరీలను త్వరగా రాబడితే ఒత్తిడి తగ్గిపోతుందని తెలుసు. స్పిన్‌ బౌలింగ్‌లో మరింత దూకుడుగా ఆడటానికి కారణం నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడమే. లఖ్‌నవూ మ్యాచ్‌ తర్వాత మాకు దాదాపు వారం రోజుల వ్యవధి వచ్చింది. దానిని ఎంతో ఆస్వాదించా. పంజాబ్‌తో తాజాగా బరిలోకి దిగడానికి ఎంతో తోడ్పడింది. ఇప్పుడు హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌లో ఆడతా.  ఆ తర్వాత వరల్డ్‌ కప్‌ కోసం మా జట్టుతో చేరనున్నా’’ అని క్లాసెన్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని