Rafael Nadal: రాజు తలొంచాడు

రఫెల్‌ నాదల్‌... ఒకప్పుడు ఎర్ర మట్టిలో రంకెలేస్తూ బరిలో దిగే బుల్‌లా కనిపించేవాడు.. కోర్టులోకి రావడం ఫటాఫట్‌మంటూ ప్రత్యర్థులను ఓడించడం! ఇదే ఏళ్ల తరబడి అతడికి అలవాటైన ఆట.. ఏకంగా 14 టైటిళ్లు అలాగే కొట్టేశాడు!

Updated : 28 May 2024 07:44 IST

తొలి రౌండ్లోనేనాదల్‌ ఓటమి
జ్వెరెవ్‌ విజయం 
స్వైటెక్‌ ముందంజ

రఫెల్‌ నాదల్‌... ఒకప్పుడు ఎర్ర మట్టిలో రంకెలేస్తూ బరిలో దిగే బుల్‌లా కనిపించేవాడు.. కోర్టులోకి రావడం ఫటాఫట్‌మంటూ ప్రత్యర్థులను ఓడించడం! ఇదే ఏళ్ల తరబడి అతడికి అలవాటైన ఆట.. ఏకంగా 14 టైటిళ్లు అలాగే కొట్టేశాడు! అలాంటిది తన అడ్డా అయిన ఫ్రెంచ్‌ ఓపెన్లోనే ఆట తేలిపోయి బేలగా మారితే... మట్టికరిపించడమే అలవాటున్న అతడు తొలి రౌండ్లోనే మట్టికరిస్తే.. సోమవారం ఫ్రెంచ్‌ ఓపెన్లో ఈ దృశ్యమే ఆవిష్కృతమైంది. ఎర్ర మట్టి రారాజు నాదల్‌ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. గాయాలతో చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్న రఫా గ్రాండ్‌స్లామ్‌ పునరాగమనంలో జ్వెరెవ్‌కు తలొంచాడు. 

పారిస్‌

టైటిల్‌పై ఆశలు లేకపోయినా.. ఎంత దూరం వెళ్తాడో తెలియకపోయినా.. క్లే కింగ్‌ రఫెల్‌ నాదల్‌ వస్తున్నాడంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌కు కళొచ్చింది. కానీ అభిమానుల నిరాశపరుస్తూ ఈ స్పెయిన్‌ స్టార్‌ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. గతేడాది గాయం కారణంగా రొలాండ్‌ గారోస్‌కు రాలేకపోయిన 37 ఏళ్ల నాదల్‌.. ఈసారి కూడా దాదాపు తప్పుకుంటాడేమో అనిపించింది. కానీ కెరీర్‌లో బహుశా చివరిసారిగా ఎర్రమట్టి టైటిల్‌ కోసం పోరాడాలన్న ఆశతో పారిస్‌కు వచ్చిన నాదల్‌కు తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. సోమవారం అన్‌సీడెడ్‌ నాదల్‌ 3-6, 6-7 (5-7), 3-6తో నాలుగోసీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) చేతిలో ఓడాడు. మూడు గంటల పాటు సాగిన ఈ పోరులో ఒక్క రెండో సెట్లో మాత్రమే నాదల్‌ గట్టిగా పోరాడాడు. తొలి సెట్లో 15 విన్నర్లు కొట్టిన జ్వెరెవ్‌ రెండుసార్లు రఫా సర్వీస్‌ బ్రేక్‌ చేసి తేలిగ్గా సెట్‌ గెలిచాడు. సర్వీసుల్లో ఇబ్బందిపడ్డ రఫా.. ఎక్కువసార్లు బంతిని కోర్టు బయటకు లేదా నెట్‌కు కొట్టి పాయింట్లు సమర్పించుకున్నాడు.

రెండో సెట్లో నాదల్‌ పుంజుకున్నాడు. తనశైలిలో కొన్ని మెరుపు క్రాస్‌కోర్టు విన్నర్లు ఆడాడు. అయితే టైబ్రేకర్‌లో తడబడి సెట్‌ చేజార్చుకున్నాడు. మూడో సెట్లో మెరుగ్గా ఆడిన రఫా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండు సెట్లు చేజారినా గెలవడం నాదల్‌కు కొత్తేం కాదు కాబట్టి ఏమైనా అద్భుతం చేస్తాడా అనిపించిన తరుణమది. కానీ వెంటనే నాదల్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జ్వెరెవ్‌.. ఆ తర్వాత స్కోరు సమం చేశాడు. ఏడో గేమ్‌లో మరోసారి బ్రేక్‌ సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుని నాదల్‌కు ఓటమి రుచి చూపించాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ 8 ఏస్‌లతో పాటు 44 విన్నర్లు కొట్టాడు. ఆరుసార్లు సర్వీస్‌ కోల్పోవడమే కాక.. 30 అనవసర తప్పిదాలు చేసిన నాదల్‌ ఓటమి కొనితెచ్చుకున్నాడు. రొలాండ్‌గారోస్‌లో సోదర్లింగ్, జకోవిచ్‌ తర్వాత రఫాను ఓడించింది జ్వెరెవ్‌ మాత్రమే. చివరిగా 2022లో రఫా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గాడు.

నగాల్‌ ఓటమి: భారత స్టార్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో అతడు 2-6, 0-6, 6-7 (5-7)తో కరెన్‌ కచానోవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. మూడో సెట్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన నగాల్‌.. సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. కానీ సర్వీసుల్లో తడబడిన అతడు సెట్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. వెటరన్‌ ఆటగాళ్లు స్టాన్‌ వావ్రింకా (స్పెయిన్‌), ఆండీ ముర్రే (బ్రిటన్‌) మధ్య సమరంలో వావ్రింకా పైచేయి సాధించాడు. 39 ఏళ్ల వావ్రింకా 6-4, 6-4, 6-2తో 37 ఏళ్ల ముర్రేను వరుస సెట్లలో ఓడించాడు. సిట్సిపాస్‌ (గ్రీస్‌), సినర్‌ (ఇటలీ) కూడా ముందంజ వేశారు. తొమ్మిదోసీడ్‌ సిట్సిపాస్‌ 7-6 (9-7), 6-4, 6-1తో ఫ్యుకోవిస్‌ (హంగేరీ)పై.. రెండోసీడ్‌ సినర్‌ 6-3, 6-3, 6-4తో ఇబాంక్స్‌ (అమెరికా)ను ఓడించారు. హర్కాజ్‌ (పోలెండ్‌), ఆగర్‌ (కెనడా), షెల్టాన్‌ (అమెరికా), నోన్‌ (కొరియా), గాస్క్వెట్‌ (ఫ్రాన్స్‌), కొర్డా (అమెరికా),  నిషికొరి (జపాన్‌) కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు.

స్వైటెక్‌ జోరు: టైటిల్‌ ఫేవరెట్, టాప్‌ సీడ్‌ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ఘనంగా మొదలుపెట్టింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆమె 6-1, 6-2తో జీన్‌జీన్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తు చేసింది. 61 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో స్వైటెక్‌ ఎక్కడా తడబడలేదు. తొలి సెట్లో తన శైలిలో బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విజృంభించిన ఆమె.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఆడింది. ఈ సెట్లో ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయిన స్వైటెక్‌ రెండో సెట్లో జీన్‌జీన్‌ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో ఇగా సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఫ్రాన్స్‌ అమ్మాయి.. 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన స్వైటెక్‌ స్కోరు సమం చేసింది. ఇక అక్కడ నుంచి ఆమెదే జోరు. తేలిగ్గా సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో ఈ పోలెండ్‌ తార 26 విన్నర్లు కొట్టింది. మూడోసీడ్‌ కొకోగాఫ్‌ (అమెరికా) 6-1, 6-1తో ఆండ్రీవా (రష్యా)ను చిత్తు చేసింది. జాబెర్‌ (ట్యునీసియా), వోండ్రుసోవా (చెక్‌), గర్సియా (ఫ్రాన్స్‌) కూడా ముందంజ వేశారు. జాబెర్‌ 6-3, 6-2తో వికెరీ (అమెరికా)పై..వోండ్రుసోవా 6-1, 6-3తో మసరోవా (స్పెయిన్‌)పై.. గర్సియా 4-6, 7-5, 6-2తో లీస్‌ (జర్మనీ)పై నెగ్గారు. పాలిని (ఇటలీ), పొటపోవా (రష్యా), సంసోనోవా (రష్యా), బాప్టిస్టె (అమెరికా), కొలిన్స్‌ (అమెరికా) కూడా తొలి రౌండ్‌ను అధిగమించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు