NAM vs OMA: ఒమన్‌పై నమీబియా ‘సూపర్’ ఓవర్‌ విక్టరీ

ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తాజాగా నమీబియా తొలి విజయాన్ని ‘సూపర్‌’ ఓవర్‌లో నమోదు చేసింది.

Updated : 03 Jun 2024 16:58 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) పసికూన జట్లు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. తొలిరోజు విండీస్‌కు షాక్‌ ఇచ్చేలా కనిపించిన పపువా న్యూగినియా చివరివరకూ పోరాడి ఓడింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో తమకంటే కాస్త అనుభవం ఎక్కువ కలిగిన నమీబియాపై ఒమన్‌ (NAM vs OMA) గెలిచేంత పని చేసింది. కానీ, సూపర్ ఓవర్‌లో తడబడి ఓటమి పాలైంది. ఈసారి ప్రపంచ కప్‌లో తొలిసారి ‘సూపర్‌ ఓవర్‌’తో ఫలితం తేలిన మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఖలీద్ కైల్ (34) టాప్‌ స్కోరర్. నమీబియా బౌలర్లు ట్రంపెల్మాన్ (4/21), డేవిడ్ వీజ్‌ (3/28), ఎరాస్మస్ (2/20) దెబ్బకు ఒమన్‌ కుదేలైంది. అనంతరం లక్ష్య ఛేదనలో జాన్‌ ఫ్రైలింక్ (45), నికోలాస్‌ డేవిన్ (24) రాణించినప్పటికీ నమీబియా సరిగ్గా 20 ఓవర్లలో 109/6 స్కోరుతో నిలిచింది. ఒమన్‌ బౌలర్లు సమష్ఠిగా రాణించారు. మెహ్రాన్ ఖాన్ (3/7) కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. 

‘సూపర్‌’లో నమీబియా దూకుడు

సూపర్ ఓవర్‌లో తొలుత నమీబియా బ్యాటింగ్‌ చేసింది. డేవిడ్ వీజ్, ఎరాస్మస్ బరిలోకి దిగారు. బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో నమీబియా వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. మరోసారి ఒమన్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. సూపర్ ఓవర్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్‌ను కోల్పోయారు. నమీబియా బౌలర్‌ డేవిడ్‌ వీజ్‌ కట్టుదిట్టంగా బంతులేసి తన జట్టును గెలిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు అతడికే దక్కింది. గత 12 ఏళ్లలో తొలిసారి టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితం వచ్చింది. చివరగా 2012లో న్యూజిలాండ్‌ - శ్రీలంక, వెస్టిండీస్ - న్యూజిలాండ్ మ్యాచుల్లో సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. పొట్టి కప్‌ చరిత్రలో ఇది నాలుగోసారి. అంతకుముందు 2007లో బౌల్‌ అవుట్ (భారత్ - పాక్‌ మ్యాచ్‌) ద్వారా టీమ్‌ఇండియాను విజేతగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని