IPL 2024: చెన్నై జట్టులోకి వచ్చాకే కుర్రాళ్లు పదునెక్కుతారు.. కారణమిదే: నవ్‌జ్యోత్‌ సిద్ధూ

ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచినవి రెండే జట్లే. అందులో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌ చేరిన టీమ్‌ చెన్నై. ధోనీ సారథ్యంలో ఈ ఘనతలను సాధించింది.

Updated : 04 Apr 2024 14:08 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శించే జట్లలో చెన్నై (Chennai) టాప్‌. మొన్నటి వరకు ఆ జట్టును నడిపిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో కుర్రాళ్లు అదరగొట్టారు. షేన్ వాట్సన్, మొయిన్ అలీ, అజింక్య రహానె, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా వంటి సీనియర్లూ తమ సత్తా చాటారు. ఇప్పుడు శివమ్‌ దూబె, రుతురాజ్‌ గైక్వాడ్, పతిరన, రిజ్వీ.. ఇలా యువ క్రికెటర్లు తమ ప్రతిభతో వెలుగులోకి వచ్చారు. రుతురాజ్‌ ఏకంగా సారథ్యం అందుకొన్నాడు. ఈ క్రమంలో చెన్నై జట్టులోకి వచ్చిన చాలా మంది మెరుగ్గా ఆడటానికి కారణం ఏంటి? అనే ప్రశ్న తలెత్తడం సహజమే. దీనికి భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనా స్పందించాడు. 

‘‘ఆటగాళ్లలో టాలెంట్‌ ఉన్నంత మాత్రాన సరిపోదు. దానికి తగ్గట్టు అవకాశాలు రావాలి. కుర్రాళ్లకు ఛాన్స్‌లు ఇవ్వాలి. అవకాశం ఇవ్వడమే కాకుండా.. సవాళ్లను తట్టుకొనేలా వారిలో భరోసా నింపాలి. ఇప్పుడు చెన్నై జట్టులోని రిజ్వీని చూస్తే అర్థమవుతుంది. అతడి ఆత్మవిశ్వాసం తారస్థాయిలో ఉంది. ఇతడే వేరే జట్టులో ఉంటే ఇలానే ఆడతాడని చెప్పలేం. అదే ధోనీ వద్దకు వస్తే మాత్రం ఆటగాడిలోని సత్తా ఏంటో బయటకు వస్తుంది. మంచి నాయకుడు.. సదరు ప్లేయర్‌ వెనుక నిలబడి నడిపించడమే కాకుండా నమ్మకం కల్పించాలి. చెన్నై జట్టులోకి వచ్చిన ఆటగాళ్లపై ధోనీ ప్రభావం ఉంటుంది. 

ఈ సీజన్‌లో చెన్నై తరఫున ఒక్కసారి మాత్రమే ధోనీ బ్యాటింగ్‌ను చూశాం. టీమ్‌ ఓడిపోయినప్పటికీ అతడి ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. కానీ, ధోనీ తొలి రెండు మ్యాచుల్లో 8వ స్థానంలో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ, అవకాశం రాలేదు. దీనికి కూడా కారణం ఉంది. ఇక్కడో సామెత చెప్పాలి.. గ్యాలన్ వెనిగర్‌ కంటే ఒక్క తేనె చుక్క ఎక్కువ ఈగలను ఆకర్షిస్తుంది. ఏ ఆటగాడు ఎక్కడ సరిపోతాడనే విషయం ధోనీకి తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. అతడు బ్యాటింగ్‌ చేస్తూ ఫినిషర్‌గా వచ్చాడంటే జట్టుకు ఎంతో బలం. జడేజా, ధోనీ లోయర్‌ ఆర్డర్‌లో ఉంటే 1 + 1 = 11 అయినట్లుగా ఉంటుంది. కొత్తతరం నాయకత్వం, యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆగిపోతున్నాడనేది సుస్పష్టం’’ అని నవ్‌జ్యోత్‌ సిద్ధూ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని