IPL: ఐపీఎల్‌లో ఒక్క రోజు కామెంట్రీకి రూ.25 లక్షలు

ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌తో భారత మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ వ్యాఖ్యాతగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Published : 20 Mar 2024 00:10 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ (Navjot Singh Sidhu) దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నాడు. ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌తో వ్యాఖ్యాతగా సిద్ధు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ వెల్లడించింది. సిద్ధు కామెంటరీ ప్రత్యేకంగా ఉంటుంది. కామెంటరీ బాక్స్‌లో తనదైన శైలిలో పంచ్‌లు, ప్రాసలు, ఛలోక్తులతో నవ్వులు పూయిస్తాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ వచ్చే టీ20 ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేయడానికి భారత్‌తోపాటు అన్ని దేశాలకు ఉపయోగపడుతుందని నవ్‌జ్యోత్ సింగ్ పేర్కొన్నాడు.‘‘ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా ఐపీఎల్‌పైనే ఉంది. భారత ఆటగాళ్లతోపాటు విదేశీ ప్లేయర్లకు ఐపీఎల్‌ రూపంలో మంచి అవకాశం దొరికింది. ఇక్కడ రాణించి వచ్చే టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు ఎంపిక కావొచ్చు’’ అని సిద్ధు వివరించాడు.

‘‘క్రికెట్ అనేది నా ఫస్ట్ లవ్‌. మీ అభిరుచి మీ వృత్తిగా మారితే దానికంటే గొప్పది మరొకటి ఉండదు. క్రికెట్‌లో 20 సార్లు పునరాగమనం చేశా. కామెంటేటర్‌గా మాత్రం ఇదే ఫస్ట్ కమ్ బ్యాక్‌. చేపకు ఈత నేర్పడం ఎలాంటిదో ఎవరైనా నాకు  కామెంట్రీ గురించి చెప్పడం కూడా అలాంటిదే. గ్యాప్‌ వచ్చినా నాలో మాటల పదును తగ్గలేదు. త్వరలోనే ఆ విషయం మీకర్థమవుతుంది. వ్యాఖ్యాతగా కెరీర్‌ను మొదలుపెట్టినప్పుడు నేను ఏ మాత్రం కాన్ఫిడెంట్‌గా లేను. కానీ, ప్రపంచ కప్‌లో అదరగొట్టడం అభిమానులతోపాటు నన్ను ఆశ్చర్చపరిచింది. గతంలో టోర్నీ మొత్తం కామెంట్రీ చేస్తే రూ.60-70 లక్షలు పారితోషికంగా ఇచ్చేవారు. నేను ఐపీఎల్‌లో రోజుకు రూ.25 లక్షలు తీసుకుంటున్నా. ఐపీఎల్‌లో కేవలం డబ్బుతో మాత్రమే సంతృప్తి దొరకదు. ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుంది’’ అని సిద్ధు పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో సీఎస్కే, ఆర్సీబీ తలపడనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు