Rohit Sharma: ఇతరుల కెప్టెన్సీలో ఆడినా.. ధోనీ - రోహిత్ స్థాయి ఎప్పటికీ తగ్గదు: సిద్ధూ

హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో ముంబయి తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో అతడి సారథ్యంపైనా విమర్శలు వస్తున్నాయి. 

Updated : 27 Mar 2024 10:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్యపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ జట్టు మాజీ సారథి రోహిత్‌ పట్ల అతడు వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్య జట్టును గెలిపించలేకపోయాడు. సర్కిల్‌ లోపలే ఫీల్డింగ్‌ చేసే రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఉంచడంతో పాండ్యపై కామెంట్లు పెరిగిపోయాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ పట్ల హార్దిక్‌ ఇలా ప్రవర్తించడం సరైంది కాదని.. రోహిత్ స్థాయి ఎలాంటిదో తెలుసుకోవాలని అభిమానులు హితవు పలికారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల కెప్టెన్సీలో ఆడినంత మాత్రాన ధోనీ, రోహిత్‌ స్థాయి ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేశాడు.

‘‘నేను దాదాపు ఐదుగురు కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, సునీల్ గావస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవి శాస్త్రి నాయకత్వంలో పనిచేశా. వారందరితో ఆడటం వల్ల నామీద ఎలాంటి ప్రభావం పడలేదు. ఎందుకంటే జాతీయ జట్టుకోసం ఆడామనే భావనతో ఉంటాం. ఇప్పుడు కూడా హార్దిక్ సారథ్యంలో రోహిత్ ఆడినంత మాత్రాన అతడి స్థాయి ఏమీ తగ్గదు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కేవలం ప్రదర్శనను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్‌లో చెన్నై తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్‌కు అప్పగించాడు. కనీసం మూడేళ్లు చూశాక పనితీరు బాగోలేకపోతే మరొకరిని ఎంపిక చేస్తారు. ధోనీ, రోహిత్‌ గొప్ప ఆటగాళ్లు. అందులో ఎవరికీ అనుమానం లేదు’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. 


విరాట్ ఇచ్చిన క్యాచ్‌ వదిలేయడమే కారణం: ధావన్‌

చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. అయితే, తమ ఓటమికి కారణం కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడమేనని ధావన్ వ్యాఖ్యానించాడు. ‘‘మ్యాచ్‌లో గెలిచే అవకాశాలను మేం వృథా చేసుకున్నాం. కనీసం మరో 15 పరుగులు చేస్తే బాగుండేది. నేను కూడా తొలి ఆరు ఓవర్లలో చాలా నెమ్మదిగా ఆడా. విరాట్ కోహ్లీ 70+ స్కోరు చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడిలాంటి క్లాస్‌ ప్లేయర్‌ క్యాచ్‌ను వదిలేయడమే మేం చేసిన అతిపెద్ద పొరపాటు. ఆ క్యాచ్‌ను అందుకొని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మా బౌలర్ల విషయంలో అసంతృప్తేమీ లేదు. బ్రార్ నాణ్యమైన బౌలింగ్‌తో మమ్మల్ని రేసులో నిలిపాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీయడం అభినందనీయం. ఫీల్డింగ్‌లో మేం ఇంకాస్త మెరుగుపడాలి’’ అని ధావన్‌ తెలిపాడు. 


ఆ సమయంలో నా స్ట్రైక్‌రేట్‌ దారుణం: సెహ్వాగ్

తొలి సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న మూడు ఫ్రాంచైజీలు మాత్రమే ఒక్కసారి కూడా టైటిల్‌ను నెగ్గలేదు. అందులో పంజాబ్ జట్టు కూడా ఒకటి. ఈ టీమ్‌కు భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ కూడా ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సెహ్వాగ్‌ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నేను పంజాబ్‌ జట్టుకు వెళ్లినప్పుడు నా స్ట్రైక్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. ఇక్కడో సామెత ఉంది. మనం పని చేస్తున్న సంస్థ మాదిరిగానే మన పనితీరు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే అప్పుడు మా జట్టు కూడా ఎక్కువగా విజయాలు సాధించలేదు. మా ఆటతీరు కూడా అదేస్థాయిలో ఉంది’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని