Shreyas Iyer: గాయమని రంజీ మ్యాచ్‌కు శ్రేయస్‌ అయ్యర్ డుమ్మా.. ఫిట్‌గా ఉన్నాడంటున్న ఎన్‌సీఏ!

భారత క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) కూడా బీసీసీఐ తీసుకోబోయే చర్యలకు బాధితుడిగా మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 

Published : 22 Feb 2024 12:21 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో ఆడితేనే భారత జట్టులోకి ఎంట్రీ అని బీసీసీఐ (BCCI) కార్యదర్శి జైషా ఘాటుగా హెచ్చరించినా.. ఆటగాళ్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) కూడా చేరాడా? అనే చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకున్నాడు. ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, గాయం కారణంగా రంజీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడటం లేదని శ్రేయస్‌ అందుబాటులో లేకుండాపోయాడు. కానీ, జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం శ్రేయస్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని చెప్పడం గమనార్హం. దీంతో బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. 

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో బరోడాతో ముంబయి శుక్రవారం నుంచి పోటీ పడనుంది. అయితే, వెన్ను నొప్పి కారణంగా ఆ మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేనని ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు శ్రేయస్‌ సమాచారం ఇచ్చాడు. దీంతో ఎంసీఏ కూడా అయ్యర్‌ ఆడటం లేదని ప్రకటన వెలువరించింది. కానీ, జాతీయ క్రికెట్ అకాడమీ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ హెడ్ నితిన్‌ పటేల్‌ నుంచి సెలక్టర్లకు ఓ మెయిల్‌ వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. ‘‘శ్రేయస్‌ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. రెండో టెస్టు అనంతరమే అతడు సెలక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. జట్టు నుంచి వైదొలిగిన తర్వాత తాజాగా  ఎలాంటి గాయాలు లేవు’’ అని అందులో నితిన్‌ పటేల్ పేర్కొన్నారు. 

శ్రేయస్‌పై చర్యలు తప్పవా? 

బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ప్రతి ఆటగాడు ఫిట్‌గా ఉంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా బలమైన కారణంగా ఉంటే తప్ప ఆటగాడికి మినహాయింపు లభించదు. ఇప్పటికే ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. రంజీల్లో ఆడకుండా ఇషాన్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ప్రాక్టీస్‌ చేసుకుంటున్నాడనే వాదనా ఉంది. ఇప్పుడు శ్రేయస్‌ కూడా సహేతుకమైన కారణం లేకుండా దూరం కావడంపై బీసీసీఐ చర్యలు తీసుకొనే అవకాశం ఉందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని