Neeraj chopra: నాటి లడ్డూనే.. నేటి గోల్డ్‌ ఎహే: బల్లెం వీరుడి కథ తెలుసా..?

నీరజ్‌ చోప్రా.. చిన్నతనంలో జాగింగ్‌కు వెళ్లమంటే.. అమ్మో నేను చేయలేనని ముసుగు తన్ని పడుకునేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆటల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. పాతికేళ్లకే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు.

Updated : 28 Aug 2023 13:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 13 ఏళ్ల వయసులోనే 90 కిలోల బరువుతో ఊబకాయుడిగా మారిన ఆ కుర్రాడు..  కేవలం బరువు తగ్గడం కోసమే ఆటల్లోకి వచ్చాడు. ఆ తర్వాత అదే ఆటను వ్యసనంగా మార్చుకుని ప్రాణం పెట్టాడు. కాలం గిర్రున తిరిగింది. ఆనాడు అనుకోకుండా చేతబట్టిన ‘బల్లెం (Javelin)’తోనే.. ఇప్పుడా కుర్రాడు సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. అతడే మన ప్రపంచ ఛాంపియన్‌, గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra). పాతికేళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడిని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కుటుంబం ఒత్తిడితో జాగింగ్‌..

హరియాణా (Haryana)లోని పానిపట్‌ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు నీరజ్‌ చోప్రా (Neeraj Chopra). అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాళ్లే. 17 మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నీరజ్‌.. చిన్న తనంలో చాలా బద్ధకంగా ఉండేవాడట. దీంతో 13 ఏళ్లకే 90 కిలోల బరువు పెరిగాడు. ఇంట్లో వాళ్లు జాగింగ్‌, వ్యాయామం చేయమన్నా ససేమిరా అనేవాడు. ఫిట్‌నెస్‌ గురించి అసలు ఆలోచించేవాడు కాదు. ఇక, అల్లరి కూడా విపరీతంగా చేసేవాడు. దీంతో అతడిని ఎలాగైనా క్రమశిక్షణలో పెట్టాలని అతడి తండ్రి సతీశ్ కుమార్‌ చోప్రా నిర్ణయించుకున్నాడు. కుటుంబసభ్యులంతా ఒత్తిడి చేయడంతో చివరకు రోజూ జాగింగ్‌ చేసేందుకు అంగీకరించాడు.

అలా జావెలిన్‌తో ప్రేమలో పడి..

ఓసారి తన బంధువు ఒకరు నీరజ్‌ను స్థానిక శివాజీ స్టేడియానికి తీసుకెళ్లారు. అక్కడ జాగింగ్‌ చేస్తుండగా.. కొంతమంది జావెలిన్‌ త్రో (Javelin Throw) ఆటగాళ్లు అతడికి తారసపడ్డారు. అక్కడ జై చౌధరీ అనే ఆటగాడు.. జావెలిన్‌ను నీరజ్‌ చేతికిచ్చి విసరమని చెప్పాడు. భారీ కాయంతో ఉన్నప్పటికీ నీరజ్‌ ఎంతో చక్కగా దాన్ని విసిరాడు. ఆటపై ఏ మాత్రం అవగాహన లేకపోయినా తొలిసారే 35-40 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. ఏ క్షణాన నీరజ్‌ ఈటెను పట్టుకున్నాడో గానీ.. అప్పుడే దానితో ప్రేమలో పడిపోయాడు.

జావెలిన్‌ ఫైనల్‌ పోరును.. భారత్‌ vs పాక్‌లానే చూశారు: నీరజ్‌ చోప్రా

జావెలిన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇందుకోసం వ్యాయామమంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్‌ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. ఊహించని ఈ మార్పుతో అతడి కుటుంబసభ్యులు ఒకవైపు ఆశ్చర్యపోయినా.. అతడి ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్‌ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు.

కెరీర్‌ మొదలైందిలా..

ఒకవైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్‌ 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు. 2016 నుంచి నీరజ్‌ కెరీర్‌.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. ఆ ఏడాదిలో జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించి సైన్యంలో పని చేస్తూనే అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు.

ఒలింపిక్స్‌తో స్టార్‌డమ్‌..

రెండేళ్ల ముందు వరకు నీరజ్‌ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఒలింపిక్స్‌ (Olympics)లో స్వర్ణంతో మెరిశాడో.. ఆ తర్వాత అతడి స్టార్‌డమ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి సాధించిన నీరజ్‌ (Neeraj Chopra).. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతేగాక, లెజండరీ షూటర్‌ అభినవ్‌ బింద్రా తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు. అప్పటికి నీరజ్‌ వయసు 23 ఏళ్లే.

ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌..

ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ (World Championships)లో ఈ సూపర్ స్టార్‌ అథ్లెట్‌ మరోసారి చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 88.17 మీటర్ల ఈటెను విసిరి పురుషుల జావెలిన్‌ త్రోలో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేనా.. అభినవ్‌ బింద్రా తర్వాత ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ టైటిల్‌ రెండూ నెగ్గిన రెండో భారతీయుడు కూడా ఇతడే కావడం విశేషం. బింద్రా కూడా తన 23 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌, 25 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌ బంగారు పతకం గెలుచుకున్నాడు.

పాతికేళ్లకే విశ్వవిజేతగా ఆవిర్భవించిన నీరజ్‌ చోప్రా.. మున్ముందు మరింత విజయాలు అందుకునే అవకాశాలున్నాయి. మరో ఐదేళ్లలో అతడు రెండుసార్లు ఒలింపిక్స్‌, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీ పడొచ్చు. మన ‘గోల్డెన్‌ బాయ్‌’ భవిష్యత్తులో మరిన్ని స్వర్ణాలను ముద్దాడాలని కోరుకుందాం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని