Netherlands: అరువు ఆటగాళ్లతో ప్రత్యర్థులకు షాక్‌.. నెదర్లాండ్స్ సక్సెస్ సీక్రెట్ ఇదే

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) నెదర్లాండ్స్‌ కూడా సంచలన విజయం నమోదు చేసింది. పటిష్ఠమైన దక్షిణాఫ్రికాను ఓడించి మరీ తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

Published : 18 Oct 2023 17:11 IST

నెదర్లాండ్స్.. క్రికెట్లో ఈ పేరు వినగానే అదొక ‘పసికూన’ అనే అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటి జట్లు ఎదురైతే ప్రత్యర్థులకు పండగే అన్నట్లుండేది. ఆ జట్టు మీద పరుగుల వరద పారిస్తూ.. వికెట్ల పంట పండించుకుంటూ రికార్డులు బూజు దులిపేవి పెద్ద జట్టు. కానీ ఇప్పుడు నెదర్లాండ్స్‌తో అంత తేలిక కాదని అందరికీ అర్థమైంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన ఆ జట్టు.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లోనూ ఆ పెద్ద జట్టును మట్టికరిపించింది అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొంది. మరి ఎన్నడూ లేనిది ఇప్పుడు నెదర్లాండ్స్ ఇంత ప్రమాదకరంగా ఎలా మారింది.. ఆ జట్టు సక్సెస్ సీక్రెట్ ఏంటి.. తెలుసుకుందాం పదండి.

అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్.. ఇలా చిన్న జట్లన్నీ ఒకప్పటితో పోలిస్తే బలంగా మారాయి, ప్రమాదకరంగా తయారయ్యాయి అంటే అందుకు ప్రధాన కారణం టీ20 క్రికెట్టే. ఈ ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని లీగ్స్ జరుగుతున్నాయి. వాటిలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడుతూ చిన్న జట్ల ఆటగాళ్లు కూడా రాటుదేలుతున్నారు. వారిలో పోరాట పటిమ పెరుగుతోంది. పెద్ద జట్లను చూసి భయపడి, ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. అవతల ఎంత పెద్ద జట్టు ఉన్నా.. తాడోపేడో తేల్చుకుందాం అన్నట్లు తయారవుతున్నారు ఆయా జట్ల ఆటగాళ్లు. నెదర్లాండ్స్‌ కూడా ఇలాగే దూసుకెళ్తోంది. ఒకప్పటితో పోలిస్తే క్రికెట్‌కు ఆ దేశం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆటగాళ్లకు జీతభత్యాలు పెంచి, అసోసియేట్ దేశాలతో తరచుగా సిరీస్‌లు ఆడిస్తోంది. ఓవైపు ఈ సిరీస్‌లు ఆడుతూ, మరోవైపు టీ20 లీగ్స్ ఆడుతూ ఆటగాళ్లు ఆర్థికంగా బలపడుతున్నారు. అలాగే ఆటలోనూ రాటుదేలుతున్నారు. ఐతే ఎంతైనా క్రికెట్ సంస్కృతి ఉన్న దేశం కాకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడే స్థాయి ఉన్న ఆటగాళ్లు నెదర్లాండ్స్‌లో తక్కువే. అందుకే వేరే దేశాల నుంచి ఆటగాళ్లను అరువు తెచ్చుకుంటోంది డచ్ జట్టు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌కు ఆడుతున్న వారిలో సగం మంది అరువు ఆటగాళ్లే.

మనవాళ్లు ముగ్గురు

నెదర్లాండ్స్ జట్టులో ఒక తెలుగువాడు ఉన్న సంగతి తెలిసిందే. అతనే.. తేజ నిడమానూరు. విజయవాడకు చెందిన ఈ కుర్రాడు చిన్న వయసులోనే తల్లితో వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. ఐతే అక్కడ జాతీయ జట్టు స్థాయికి ఎదగలేకపోయాడు. అలాంటి టైంలోనే నెదర్లాండ్స్‌లో ఒక టోర్నీ ఆడేందుకు వెళ్లి.. తర్వాత ఆ దేశ జట్టుకు ఆడే అవకాశం రావడంతో అక్కడే స్థిరపడ్డాడు. నెదర్లాండ్స్ జట్టు టెక్నికల్ టీంలోనూ తేజ సభ్యుడు కావడం విశేషం. ఇలా ఆర్థికంగానూ నెదర్లాండ్స్‌కు ఆడటం తేజకు లాభసాటిగా మారింది. అతను డచ్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్. నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో తేజది ముఖ్య పాత్ర. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలిచింది నెదర్లాండ్స్. ఆ మ్యాచ్‌లో అతను సంచలన శతకం (111) సాధించాడు. తేజతో పాటు ఆర్యన్ దత్, విక్రమ్ జీత్ సైతం భారత సంతతి ఆటగాళ్లే. ఆర్యన్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విక్రమ్‌జీత్ ఓపెనింగ్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. మరో ఓపెనర్ ఒడౌడ్.. న్యూజిలాండ్ దేశస్థుడు. వివిధ వయసు విభాగాల వరకు న్యూజిలాండ్‌లోనే ఉన్న అతను.. తర్వాత నెదర్లాండ్స్‌కు మారాడు.

దక్షిణాఫ్రికా ఓటమి వెనుక దక్షిణాఫ్రికన్లు

దక్షిణాఫ్రికా జట్టు.. నెదర్లాండ్స్ చేతిలో కంగుతినడంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లదే ముఖ్య పాత్ర కావడం గమనార్హం. ఆల్‌రౌండ్ మెరుపులతో సఫారీ జట్టును దెబ్బ తీసిన వాండర్‌మెర్వ్.. దక్షిణాఫ్రికా దేశస్థుడే. అతను దక్షిణాఫ్రికాకు అంతర్జాతీయ క్రికెట్లో కొన్నేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు కూడా. ఐతే అక్కడ కెరీర్ ముగిశాక, జాతీయ జట్టులో అవకాశాలు ఆగిపోయాక నెదర్లాండ్స్‌కు వెళ్లిపోయాడు. అక్కడే ఆడుతూ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కొన్నేళ్లుగా ఆ దేశానికే ఆడుతున్నాడు. మరో ఆల్‌రౌండర్ ఆకర్ మ్యాన్ సైతం దక్షిణాఫ్రికా దేశస్థుడే. అతను అండర్-19 స్థాయిలో దక్షిణాఫ్రికాకు ఆడాడు. దక్షిణాఫ్రికా జట్టులో అత్యంత ప్రమాదకరమైన డికాక్ వికెట్‌ను తీసింది ఆకర్‌మ్యానే. వాండర్‌మెర్వ్‌తో పాటు ఆకర్‌మ్యాన్ పలు టీ20 లీగ్స్‌లో ఆడుతూ ప్రపంచ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుత నెదర్లాండ్స్ కోచ్ ర్యాన్ కుక్ కూడా దక్షిణాఫ్రికా దేశస్థుడే. అతను ఇప్పటికే దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. డచ్ జట్టు సహాయ సిబ్బందిలో మరికొందరు దక్షిణాఫ్రికాన్లు ఉన్నారు. ఐతే వేరే దేశాల ఆటగాళ్లు, కోచ్‌ల అండతో నెదర్లాండ్స్ బలం పెంచుకున్న మాట వాస్తవమే కానీ.. మొత్తం క్రెడిట్ అంతా వారిదే అని,డచ్ జట్టు సాధిస్తున్న విజయాల్లో ఆ దేశ ఆటగాళ్ల పాత్ర లేదని అనలేం. బాస్ డి లీడ్, వాన్‌బీక్, మీకెరెన్, స్కాట్ ఎడ్వర్డ్స్ లాంటి ప్రతిభావంతులు ఆ జట్టు సొంతం. మంగళవారం వీళ్లందరూ ఉత్తమ ప్రదర్శన చేశారు. వీళ్లు ఎప్పట్నుంచో నిలకడగా రాణిస్తున్నారు. సొంత ప్రతిభకు తోడు.. అరువు ఆటగాళ్ల బలమూ తోడై నెదర్లాండ్స్ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేస్తోంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని