Pat Cummins: కెప్టెన్‌ మారాడు.. హైదరాబాద్‌ కథ మారేనా?

కెప్టెన్‌ మార్పు జట్టు రాతను మారుస్తుందా? ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ కథ సరికొత్తగా మొదలవుతుందా? నేడు కోల్‌కతాతో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Updated : 23 Mar 2024 12:43 IST

అగ్రశ్రేణి బ్యాటర్లకు కొదవలేదు.. స్టార్‌ బౌలర్లూ ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే పవర్‌ హిట్టర్లూ ఉన్నారు. కానీ 2016లో ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత హైదరాబాద్‌ ప్రదర్శన పడిపోతూ వచ్చింది. ఆటతో పాటు ఆటేతర విషయాల్లోనూ వివాదాలు చుట్టుముట్టాయి. సొంత జట్టుపై తెలుగు అభిమానులకు నమ్మకం పోయే పరిస్థితి. ఈ దశలో ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం హైదరాబాద్‌ ఓ కీలక మార్పు చేసింది. వేలంలో భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను.. సన్‌రైజర్స్‌ సారథిగా నియమిస్తూ ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఇవాళ కోల్‌కతాతో తొలిపోరుకు సిద్ధమైంది. మరి ఈ మార్పు.. జట్టు రాతను మారుస్తుందా? ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ కథ సరికొత్తగా మొదలవుతుందా

అప్పుడొకటి.. ఇప్పుడొకటి

ఐపీఎల్‌లో హైదరాబాద్‌ అంటే అప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌. 2008 ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌లో తలపడ్డ ఎనిమిది జట్లలో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒకటి. 2009లో గిల్‌క్రిస్ట్‌ కెప్టెన్సీలో ఆ జట్టు విజేతగా నిలిచింది. అయితే నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2012లో ఆ ఫ్రాంఛైజీని ఐపీఎల్‌ రద్దు చేసింది. అనంతరం హైదరాబాద్‌ జట్టు హక్కులను దక్కించుకున్న సన్‌ టీవీ నెట్‌వర్క్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా 2013లో లీగ్‌లో అడుగుపెట్టింది. ఆ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరింది. కానీ తర్వాతి రెండు సీజన్లలో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. 2016లో డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో కప్పు సొంతం చేసుకుంది. 2018లో రన్నరప్‌గా నిలిచింది. 2021 నుంచి ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. నిరుడు 10 జట్లు తలపడితే సన్‌రైజర్స్‌ పదో స్థానంలో నిలిచింది.

వార్నర్‌ను వద్దని.. కేన్‌ను కాదని 

సన్‌రైజర్స్‌కు ఆకర్షణ తెచ్చి.. జట్టును అభిమానులకు మరింత చేరువ చేసిన వార్నర్, కేన్‌ విలియమ్సన్‌ను ఫ్రాంఛైజీ వదులుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. డేవిడ్‌ భాయ్‌గా వార్నర్‌.. కేన్‌ మామగా విలియమ్సన్‌ తెలుగు అభిమానులకు ఎంతో దగ్గరయ్యారు. పైగా జట్టు కోసం వీళ్లు చాలా చేశారు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్న వార్నర్‌.. ఆ ఏడాది ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు) కూడా అందుకున్నాడు. 2016లో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 2017లో ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. బాల్‌ టాంపరింగ్‌ కారణంగా వార్నర్‌ 2018 సీజన్‌కు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టిన విలియమ్సన్‌ జట్టును ఫైనల్‌ చేర్చాడు. ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది అతనే. మళ్లీ జట్టులోకి వచ్చిన వార్నర్‌ 2019లో ఆరెంజ్‌ క్యాప్‌ తిరిగి దక్కించుకున్నాడు. 2020లో మళ్లీ కెప్టెన్‌గా జట్టును ప్లేఆఫ్స్‌ చేర్చాడు. కానీ 2021 సీజన్‌ మధ్యలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి విలియమ్సన్‌కు బాధ్యతలు అప్పజెప్పడం.. ఆ తర్వాత వార్నర్‌ను వదులుకోవడం వివాదాస్పదంగా మారింది. 2022 తర్వాత విలియమ్సన్‌కూ గుడ్‌బై చెప్పడంతో ఫ్రాంఛైజీపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిన్స్‌పై భారం

ఇప్పుడు సన్‌రైజర్స్‌ను అత్యుత్తమ ప్రదర్శన దిశగా నడిపించడంతో పాటు అభిమానుల ఆదరణను తిరిగి సంపాదించే భారం కమిన్స్‌పై ఉంది. గత కొద్దికాలంగా ఆస్ట్రేలియా సారథిగా కమిన్స్‌ అద్భుత ప్రదర్శనతో సాగుతున్నాడు. గత 9 నెలల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్, యాషెస్‌ను నిలబెట్టుకోవడం, వన్డే ప్రపంచకప్‌ గెలవడం.. ఇలా ఆసీస్‌ కెప్టెన్‌గా కమిన్స్‌ గొప్ప ఘనతలు దక్కించుకున్నాడు. అందుకే జట్టు రాతను మార్చే కెప్టెన్‌ వేటలో ఉన్న సన్‌రైజర్స్‌ నిరుడు వేలంలో కమిన్స్‌ కోసం ఏకంగా రూ.20.25 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు అతడే. ఇప్పుడు మార్‌క్రమ్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా కమిన్స్‌ ఎంపికయ్యాడు. బ్యాటింగ్, పేస్‌ బౌలింగ్‌తో అదరగొట్టడమే కాకుండా నాయకత్వ లక్షణాలతోనూ సత్తాచాటే అతను.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ కథ మారుస్తాడేమో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని