
T20 League : కొత్త కెప్టెన్ల సంగతేంటి.. ఎవరు అదుర్స్.. ఎవరు బెదుర్స్!
ఇంటర్నెట్ డెస్క్: జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్‌పైనే ఉంటుంది. తన ఆటతీరుతో జట్టుకు మార్గదర్శనం చేయాలి. లేకపోతే ఉన్న ఆటగాళ్లను సరైన సమయంలో ఉపయోగించుకోగలిగిన చాతుర్యమైనా ఉండాలి. ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో ఆరు జట్లకు కొత్త సారథులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారిలో ఎవరు బాగా ఆడుతున్నారు..? ఎవరు ఎలా తమ జట్లను నడిపిస్తున్నారనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం..
టీ20 టోర్నీ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయాయి. లీగ్ దశలో కీలక ఘట్టానికి తెర లేవనుంది. ఒక్కో జట్టు కనీసం తలా ఏడేసి మ్యాచ్‌లను ఆడేశాయి. మరికొన్ని ఎనిమిది పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌లోని నాలుగు స్థానాల కోసం పోరాటం ప్రారంభమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (14) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ (12), హైదరాబాద్ (10), లఖ్‌నవూ (10), బెంగళూరు (10), పంజాబ్ (8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక దిల్లీ (6), కోల్‌కతా (6), చెన్నై (4).. ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముంబయి అయితే ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ పరాజయం పాలై ఖాతానే ఓపెన్ చేయకుండా అట్టడుగున ఉంది.
కెప్టెన్సీ ఆటతో అగ్రస్థానం
కొత్త జట్టు గుజరాత్.. హార్దిక్ పాండ్యపై నమ్మకం ఉంచి తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా అగ్రస్థానంలో దూసుకుపోతోంది. అతడు కెప్టెన్‌గానే కాకుండా బ్యాటింగ్‌లోనూ ధాటిగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో 305 పరుగులు చేసి టాప్ బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తొలి మూడు మ్యాచుల్లో ఫర్వాలేదనిపించినా.. గత రెండు మ్యాచ్‌ల్లో అసలు బౌలింగే చేయలేదు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడిన పాండ్య ఇప్పుడు కుదురుకొని రాణిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపించడంలోనూ విజయవంతమవుతున్నాడు. దీంతో అభిమానుల మన్ననలూ అందుకుంటున్నాడు. ఇక హార్దిక్ బౌలింగ్‌లోనూ సఫలమైతే టీమ్‌ఇండియా జట్టులోకి మళ్లీ సులువుగా రావచ్చు. గతేడాది ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన పాండ్య నేరుగా ఈ టీ20 లీగ్‌లోనే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్‌ను టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ముందుకు తీసుకువెళ్తున్నాడు.
సెంచరీల వీరుడు
కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణిస్తాడు. గత సీజన్‌లోనూ పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే ఆ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈసారి కొత్త జట్టు లఖ్‌నవూ తరఫున బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ బాధ్యతలనూ చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచుల్లో రెండు శతకాలు, ఒక అర్ధశతకంతో 368 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 103*. తన జట్టులోని బౌలర్లు అవేశ్ ఖాన్, చమీర, హోల్డర్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్ వంటి వారిని చక్కగా వినియోగించుకుని ఫలితాలను రాబడుతున్నాడు. టీమ్‌ఇండియాకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కేఎల్ రాహుల్ ఇలాంటి ఫామ్‌నే కొనసాగిస్తే కెప్టెన్‌గా మారే అవకాశమూ లేకపోలేదు. రోహిత్ శర్మ ఫామ్ కూడా ఆందోళన కరంగా ఉన్న నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ఛాన్స్‌లు ఉన్నాయి.
అప్పుడప్పుడు మాత్రమే..
కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో కొత్త జట్టు లఖ్‌నవూ కెప్టెన్‌గా వెళ్లడంతో పంజాబ్ యాజమాన్యం సారథ్య బాధ్యతలను మయాంక్ అగర్వాల్‌కు అప్పగించింది. అయితే ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడిన ఆ జట్టు.. నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఒక మ్యాచ్‌కు దూరమైన మయాంక్ ఏడింట్లో ఆడాడు. బ్యాటర్‌గా కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన మయాంక్ 136 పరుగులు మాత్రమే చేశాడు. అయితే జట్టును నడిపించడంలో సక్సెస్ అయినట్టే ఉన్నా.. బ్యాటర్‌గానూ రాణిస్తేనే కెప్టెన్‌గా విజయవంతమైనట్లు. ఇకపై మిగిలిన మ్యాచుల్లో అతడు పరుగుల పరంగా ముందుండి నడిపించాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉందని ఆశగా ఎదురుచూస్తోంది.
కోల్ ‘కథ’ మార్చలేక..
గత సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన కోల్‌కతా ముందడుగు వేయలేక కప్‌ను చేజార్చుకుంది. ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తిక్‌లను కాదని శ్రేయస్ అయ్యర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసి మరీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయితే రెండు మ్యాచ్‌ల్లోనే అర్ధశతకాలు సాధించాడు. ఒక మ్యాచ్‌లో 85 పరుగులు చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. భవిష్యత్తులో టీమ్‌ఇండియా సారథిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్న క్రికెటర్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. అయితే 2020 సీజన్‌లో దిల్లీని ఫైనల్‌కు చేర్చిన ఘనత ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం తన వ్యూహాలను పక్కాగా అమలు చేయలేకపోతున్నాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. అతడు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా 248 పరుగులు చేశాడు.
అట్టర్ ఫ్లాప్..
ప్రస్తుత సీజన్‌లో ఘోరంగా విఫలమైన కెప్టెన్ ఎవరంటే మాత్రం ఠక్కున వచ్చే సమాధానం రవీంద్ర జడేజా. ఎంఎస్ ధోనీ స్థానంలో చెన్నై జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన జడేజా మిడిలార్డర్‌లో వెన్నెముకగా ఉండాలి. అయితే ఇప్పటి వరకు 8 మ్యాచులను ఆడిన జడేజా కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాచ్‌ను గెలిపించాల్సిన తరుణంలోనూ ధాటిగా ఆడలేక చతికిలపడ్డాడు. ఇటు బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపిందేమీ లేదు. కేవలం ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. లీగ్ ముందు వరకు ఆల్‌రౌండర్‌గా కీలకంగా మారిన రవీంద్ర జడేజా తన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచాడు. ఇటు చెన్నై జట్టును నడపడంలోనూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ధోనీ షాడో కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటమే దీనికి కారణమని జడేజా అభిమానులు పైకి చెబుతున్నా.. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ, వ్యక్తిగతంగా రాణించడంలోనూ జడేజా సక్సెస్ కాలేకపోయాడు.
మొదట్లో అదరగొట్టేశాడు..
గత ఆరేళ్లుగా టీ20 లీగ్ టోర్నీ మ్యాచ్‌లు ప్రారంభం నుంచే ఒకటే నినాదం.. ఈసాలా నమదే.. బెంగళూరు జట్టును కప్ వైపు నడిపిస్తాడని భారీ ధరకు అట్టిపెట్టుకున్న మ్యాక్స్‌వెల్‌ను కాదని డుప్లెసిస్‌ను కొనుగోలు చేసి మరీ బాధ్యతలు అప్పగించింది. మొదటి మ్యాచ్‌ను ఓడినా తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి రేసులోకి వచ్చింది. అయితే చెన్నైతో ఓటమిపాలైనప్పటికీ పుంజుకొని మరీ రెండు విజయాలను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో టాప్-4లోకి వెళ్లింది. అయితే హైదరాబాద్, రాజస్థాన్ జట్లపై ఘోరంగా ఓడి మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ప్రదర్శన బాగోలేనప్పటికీ వ్యక్తిగతంగా డుప్లెసిస్ రాణిస్తున్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 278 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. అత్యధిక స్కోరు 95 కాగా.. రెండు అర్ధశతకాలు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: రెండేళ్ల తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ.. భారత్‌కు అవకాశాలపై నీలినీడలు!
-
India News
NFSA Rankings: ‘ఆహార భద్రత’ అమలులో ఒడిశా నంబర్ వన్.. మరి తెలుగు రాష్ట్రాలు!
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Crime News
NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
-
General News
Kiren Rijiju: ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?
-
Movies News
Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: టీమ్‌ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- NTR Fan Janardhan: జూ.ఎన్టీఆర్ వీరాభిమాని జనార్దన్ కన్నుమూత
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు