Fielding Setup: ఫీల్డింగ్‌ మేళవింపులు కొత్త కొత్తగా

టెస్టుల్లో కొత్త ఫీల్డింగ్‌ మేళవింపులు జరుగుతున్నాయి. బ్యాటింగ్‌లో బజ్‌బాల్‌ మాదిరి ఫీల్డింగ్‌లో ఇలాంటి కొత్త ప్రయోగాలు తోడైతే కచ్చితంగా టెస్టులు ఆసక్తికరంగా మారడం ఖాయం.  

Updated : 19 Feb 2024 15:03 IST

2023లో యాషెస్‌ టెస్టు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడికి పెట్టిన ఫీల్డింగ్‌ (Fielding Setup) చూస్తే ఎవరైనా టెయిలెండర్‌ ఆడుతున్నాడా అన్నట్లు ఉంది. నాన్‌ స్ట్రెకర్‌కు అటు ఇటు ముగ్గురేసి ఫీల్డర్లు కాపు కాశారు. ఈ ఫీల్డ్‌ సెటప్‌ చూసి షాట్‌కు పోయి బౌల్డయిపోయాడు ఖవాజా. అతడి ఏకాగ్రత చెదరడానికి కారణం ఆ కొత్త ఫీల్డింగ్‌ మేళవింపే! టెస్టుల్లో కొత్త ఫీల్డింగ్‌ మేళవింపులకు ఇదో మంచి ఉదాహరణ. 

సాధారణంగా టెస్టుల్లో ఫీల్డింగ్‌ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువగా బ్యాటింగ్, బౌలింగ్‌పైనే దృష్టి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో టెస్టుల్లో భిన్నమైన ఫీల్డింగ్‌ మేళవింపులు ఆసక్తిని రేపుతున్నాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న జట్లు అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా-పాకిస్థాన్, వెస్టిండీస్‌-పాకిస్థాన్‌ సిరీస్‌లు కూడా ఇలాంటి  కొత్త పంథాకు తెర తీశాయి. 

స్మిత్‌ అలా దొరికేశాడు

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కూడా ఓ ప్రయోగం చేసింది. ఆసీస్‌ టాప్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను బుట్టలో వేయడానికి భిన్నమైన ఫీల్డింగ్‌ సెటప్‌ని ప్రయత్నించి సఫలమైంది. సాధారణంగా స్మిత్‌కు ఆఫ్‌ సైడ్‌లో కవర్స్, పాయింట్‌ దిశగా ఆడడం అలవాటు. అతడి బ్యాట్‌ ఎప్పుడూ ఆ దిశగానే స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది. స్మిత్‌ ఎక్కువగా పాయింట్, కవర్స్‌ స్థానాల్లో ఆడే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పాక్‌ జట్టు ముగ్గురు ఫీల్డర్లను కవర్స్, పాయింట్‌ పొజిషన్స్‌లో పెట్టి స్మిత్‌ను బ్లాక్‌ చేసేసింది. దీంతో అతడు తనకు అలవాటైన రీతిలో ఓ డ్రైవ్‌కు వెళ్లి షార్ట్‌ కవర్స్‌లో ఫీల్డర్‌కి దొరికిపోయాడు. భిన్నమైన ఫీల్డింగ్‌కు ఇది మంచి ఉదాహరణ. 

వెస్టిండీస్‌ కూడా..

సాధారణంగా సంప్రదాయబద్దమైన ఫీల్డింగ్‌తోనే ముందుకెళ్లే వెస్టిండీస్‌ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భిన్నమైన ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్స్‌తో ఆశ్చర్చపరిచింది. ముఖ్యంగా షార్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ని పెట్టడం ఓ కొత్త ప్రయోగంగా కనిపించింది. సాధారణంగా ఫార్వర్డ్‌ షార్ట్‌ లెగ్, షార్ట్‌ లెగ్‌లో ఫీల్డర్లను బ్యాటర్లకు దగ్గరగా మొహరిస్తారు. కానీ విండీస్‌ మాత్రం హెల్మెట్‌ పెట్టుకున్న ఓ ఫీల్డర్‌ని థర్డ్‌ స్లిప్, గల్లీకి కాస్త ముందుగా పెట్టింది. ఇది షార్ట్‌ థర్డ్‌ స్లిప్‌ అనుకోవచ్చు. ఈసారి కూడా కొత్త ఫీల్డింగ్‌ సెటప్‌కు దొరికింది ఎవరో కాదు స్మితే. తన శైలిలో డ్రైవ్‌ ఆడే ప్రయత్నంలో స్మిత్‌.. ఈ షార్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. విండీస్‌ చేసిన ఈ ఫీల్డింగ్‌ ప్రయోగం మాత్రం ఎంతో ఆకట్టుకుంది. ఓ కొత్త క్రికెట్‌ను చూసిన అనుభూతిని ఇచ్చింది.

బెన్‌స్టోక్స్‌ అంబ్రెల్లా ఫీల్డింగ్‌తో

సాధారణంగా మ్యాచ్‌లో కొన్ని ఓవర్లలో ఫలితం తేలే అవకాశం ఉన్నప్పుడో.. లేక చివరి వరుస బ్యాటర్లను ఔట్‌ చేయడానికో టెస్టుల్లో అంబ్రెల్లా ఫీల్డింగ్‌ పెట్టడం పరిపాటే. కానీ గత యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పెట్టిన ఫీల్డింగ్‌ మాత్రం ఇంకా భిన్నమైంది. టాప్‌ బ్యాటర్‌కి వల వేసినట్లుగా షార్ట్‌ మిడాన్, షార్ట్‌ మిడాఫ్, షార్ట్‌ కవర్స్‌ ఇలా అన్ని సమీప ప్రదేశాలను కవర్‌ చేస్తూ ఫీల్డర్లను పెట్టి ఖవాజాను బుట్టలో వేశాడతను. సాధారణంగా ఖవాజా డ్రైవ్‌లతో పరుగులు చేస్తాడు. కానీ ఎదురుగా అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఫీల్డర్లు ఉండడంతో అతడిని కట్టేసినట్టయింది. దీంతో ఓ చెత్త షాట్‌కు పోయి బౌల్డ్‌ అయ్యాడు. అయిదురోజుల పాటు సాగే టెస్టులపై అభిమానులకు నెమ్మది నెమ్మదిగా ఆసక్తి తగ్గుతోంది. బ్యాటింగ్‌లో బజ్‌బాల్‌ మాదిరి ఫీల్డింగ్‌లో ఇలాంటి కొత్త ప్రయోగాలు తోడైతే కచ్చితంగా టెస్టులు ఆసక్తికరంగా మారడం ఖాయం.  

    - ఈనాడు క్రీడావిభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని