IND vs ENG: నాలుగో టెస్టులో పేస్‌కు పెద్దన్న పాత్ర.. సిరాజ్‌ నెగ్గుకురాగలడా?

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు (IND vs ENG) కొన్ని మార్పులు చేస్తూ భారత్‌ స్క్వాడ్‌ను ప్రకటించింది. స్టార్‌ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ముకేశ్‌ కుమార్‌ను తీసుకుంది. అయితే, తుది జట్టులో మాత్రం కొత్త ఆటగాడికి అవకాశం వస్తుందనే చర్చ సాగుతోంది.

Updated : 22 Feb 2024 17:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల్లో అదరగొట్టిన బుమ్రాకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. నాలుగో టెస్టులో మరో కుర్రాడు ఆకాశ్‌ దీప్ అరంగేట్రం చేస్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉన్నా.. పేసర్ల పాత్రనూ తక్కువ చేయలేం. ఇప్పటికే మొదటి మూడింట్లో ఈ విషయం తేటతెల్లమైంది. బుమ్రా ఒంటి చేత్తో పేస్ భారాన్ని మోసి వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రాంచీ టెస్టులో సిరాజ్‌ ముందుండి నడిపించాలి. ఇప్పటిదాకా టెస్టుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే సిరాజ్‌ సీనియర్‌ పాత్ర పోషించాడు.. మరి ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 

గతేడాది ఆసియా కప్‌ నుంచి హైదరాబాదీ పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌కు పక్కాగా జట్టులో స్థానం లభిస్తోంది. ఆసియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్‌లోనూ నాణ్యమైన పేస్‌తో చెలరేగాడు. వరల్డ్‌ కప్‌లో బుమ్రా, షమీ తోడుగా ఉండేవారు. భారం మొత్తం వారి మీదే వేసుకునేవారు. దీంతో సిరాజ్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌలింగ్‌ వేసేవాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. బుమ్రా పోషించిన పాత్రను సిరాజ్‌ తన నెత్తిన మోయాల్సి ఉంది. ఎందుకంటే బుమ్రా ఇంగ్లాండ్‌పై మూడు టెస్టుల్లో 80.5 ఓవర్లు వేసి 17 వికెట్లు తీశాడు. అతడే టాప్‌ వికెట్‌ టేకర్. కానీ, సిరాజ్‌కు వైజాగ్‌ టెస్టులో మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. మిగతా రెండు టెస్టుల్లో సిరాజ్‌ 36 ఓవర్లు విసిరాడు. కేవలం 4 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి చూస్తే గొప్పగా ఏమీ లేవు. కానీ, ఇప్పటి వరకు సిరాజ్‌ తన కెరీర్‌లో 25 మ్యాచుల్లో 72 వికెట్లు పడగొట్టాడు. తన తొలి టెస్టులోనే (2020) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. లార్డ్స్‌లోనూ ఇంగ్లాండ్‌పైనే ఎనిమిది వికెట్లు తీశాడు. సీనియర్లు ఇషాంత్‌ శర్మ, బుమ్రా ఉన్నా అదరగొట్టేశాడు. మరీ ముఖ్యంగా ఆసీస్‌పై బ్రిస్బేన్‌లో యువ పేసర్లు నటరాజన్, నవ్‌దీప్‌ సైని, మరో మీడియం పేసర్ శార్దూల్‌తో కూడిన ఫాస్ట్‌ బౌలింగ్‌ దళాన్ని సిరాజ్‌ ముందుండి నడిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ (89) వీరోచిత ఇన్నింగ్స్‌తో సిరాజ్‌ ప్రదర్శన వెనుకబడిపోయింది.

అలా కాకుండా..

రాంచీలో ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేస్తేనే సిరాజ్‌ మరికొన్నాళ్లు గుర్తుండిపోతాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా సిరాజ్‌కు ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ, ఇటీవల ఎక్కువగా షార్ట్‌ పిచ్‌ బంతులను సంధిస్తూ ఫలితం రాబట్టాలని ప్రయత్నించడం బెడిసి కొడుతోంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఇలాంటి బాల్స్‌కు అస్సలు భయపడరు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్ల మీదకు బంతులేస్తేనే ప్రయోజనం ఉంటుంది. బుమ్రా చేసిందదే.. బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఆ సూత్రాన్నే సిరాజ్‌ కూడా తన బౌలింగ్‌లోనూ పాటించి బంతులు విసిరితే తిరుగుండదు. 25 టెస్టులు ఆడిన అనుభవం కలిగిన సిరాజ్‌.. ముకేశ్‌ కుమార్‌ లేదా ఆకాశ్‌ దీప్‌తో కూడిన పేస్‌ బౌలింగ్‌ను సరైన మార్గంలో నడిపించాలి. ముకేశ్‌ కుమార్‌ అనుభవం ఉన్నప్పటికీ.. రెండో టెస్టులో అతడూ భారీగానే పరుగులు సమర్పించాడు. ఇక ఆకాశ్‌ దీప్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త. రాంచీలోనూ భారత్‌ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు మెండు. 

ఇండియా A తరఫున అదరగొట్టిన ఆకాశ్‌..

బెంగాల్‌ తరఫున ఆకాశ్‌ దీప్‌ దేశవాళీలో అద్భుతంగా రాణించాడు. దీంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన ఆకాశ్‌ దీప్‌ 104 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో భారత్‌ A తరఫున రెండు మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. బిహార్‌లో పుట్టిన ఆకాశ్‌కు కుటుంబం నుంచి ఆరంభంలో పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. కానీ, ఆటపై ఇష్టంతో అన్ని కష్టాలను అధిగమించి ఇప్పుడు జాతీయ జట్టులోకి వచ్చాడు. ఒకవేళ నాలుగో టెస్టులో అతడు అరంగేట్రం చేస్తే.. ఇదే సిరీస్‌లో డెబ్యూ చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు. సర్ఫరాజ్‌, రజత్‌ పటీదార్‌, ధ్రువ్ జురెల్‌ ఈ వరుసలో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని