Mumbai Indians: భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్‌ ది బెస్ట్‌: నీతా అంబానీ

ఐపీఎల్ ముగిసిన తర్వాత.. దాదాపు వారం రోజుల్లో భారత ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published : 20 May 2024 14:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. కెప్టెన్సీ మార్పు చేపట్టినా ఆ జట్టుకు కలిసిరాలేదు. ఇప్పటికే దానిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించే నలుగురు ఆటగాళ్లు  టీ20 ప్రపంచ కప్‌ కోసం ఎంపికయ్యారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్, బుమ్రా సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలోనే టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో తమ జట్టు సభ్యులకు ముంబయి ఇండియన్స్‌ యజమాని నీతా అంబానీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. 

‘‘మనకు ఇది చాలా నిరుత్సాహకరమైన సీజన్. మనం అనుకున్న విధంగా అన్నీ సాగవు. ఇప్పటికీ నేను ముంబయి ఇండియన్స్‌కు అతిపెద్ద ఫ్యాన్‌ను. ఈ జట్టు జెర్సీని ధరించడాన్ని గౌరవంగా భావిస్తా. అది నాకు గర్వకారణం. ఈ సీజన్‌లో మనం ఎక్కడ వెనుకబడ్డామో సమీక్షించుకుందాం. తప్పకుండా భవిష్యత్తులో బలంగా ముందుకొస్తాం. జాతీయ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్‌  బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఆటగాళ్లకు ఆల్‌ ది బెస్ట్. రోహిత్, హార్దిక్‌, సూర్య, బుమ్రా..  మీ ప్రదర్శనతో భారతీయులను సంతోషపరుస్తారని ఆశిస్తున్నా. భారత్‌ టైటిల్‌ను తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని నీతా అంబానీ తెలిపారు. ఈ సీజన్‌లో ముంబయి 14 మ్యాచుల్లో కేవలం నాలుగింట్లోనే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది.

మరో ఐదు రోజుల్లో పయనం..

అమెరికా - విండీస్‌ ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారత్‌ జట్టులోని కొందరు మే 25న పయనం కానున్నారు. ఐపీఎల్ ఫైనల్‌   మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. మిగతావారూ యూఎస్‌ఏకు వెళ్తారు. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. జూన్‌ 9న పాక్‌, జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో భారత్‌ ఆడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని