Nitish Reddy: ఏపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఎస్‌ఆర్‌హెచ్‌ హీరో

ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. ఏపీఎల్‌లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం.

Updated : 17 May 2024 13:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త ఆల్‌రౌండర్‌ దొరికిన సంగతి తెలిసిందే. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nithish Kumar Reddy).. పేస్‌ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ మంచి ఇన్నింగ్స్‌లతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్ (APL) టీ20 టోర్నీ కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గురువారం నిర్వహించిన బిడ్డింగ్‌లో నితీశ్‌ను గోదావరి టైటాన్స్‌ రూ.15.60 లక్షలకు దక్కించుకుంది. గుజరాత్‌తో హైదరాబాద్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆ బిడ్డింగ్‌ను లైవ్‌లో చూసిన నితీశ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోను ఏపీఎల్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. గత సీజన్‌లో హనుమ విహారి రూ.6.60 లక్షలు దక్కించుకున్నాడు. ఇప్పుడు దానిని నితీశ్‌ అధిగమించాడు.

20 ఏళ్ల నితీశ్‌ ఈసారి ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 239 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. దూకుడుగా ఆడటంతోపాటు క్లిష్టపరిస్థితుల్లో జట్టును ముందుకు నడిపిస్తున్నాడనే ప్రశంసలు అందుకొన్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్లు తక్కువగా ఉండే టీమ్‌ఇండియాకు భవిష్యత్తులో నితీశ్ తప్పకుండా ఆడతాడని మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు.

ఏపీఎల్‌ అంటే..

ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ20 లీగ్‌ ‘ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌’. రెండేళ్ల కిందట దీనిని ప్రారంభించారు. ఇందులో ఆరు జట్లు..  బెజవాడ టైగర్స్, కోస్టల్‌ రైడర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లైయన్స్‌, వైజాగ్‌ వారియర్స్‌ పోటీపడతాయి. ఈ లీగ్‌లో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు శ్రీకర్ భరత్, హనుమ విహారి తదితరులు ఆడిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని