T20 World Cup 2024: ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్‌కే వరం: వసీమ్‌ అక్రమ్

భారత జట్టు తరఫున టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలనేది క్రికెటర్ల కల. కానీ, కొందరికే అవకాశం దక్కుతోంది.  ఈసారి కూడా 15 మందితో కూడిన జట్టులో అభిమానులు ఆశించినట్లు కొందరికి ఛాన్స్‌ రాలేదు.

Published : 31 May 2024 14:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్‌లో తలపడిన రెండు జట్ల నుంచి.. ఏ ఒక్క ఆటగాడూ వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌కు ఎంపిక కాకపోవడంపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వచ్చాయి. ఛాంపియన్‌ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన రింకు సింగ్‌ మాత్రమే ‘ట్రావెల్ రిజర్వ్’గా ఉన్నాడు. ఇక రన్నరప్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి ఎవరికీ అవకాశం రాలేదు. ఇదే విషయంపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ వసీమ్‌ అక్రమ్‌ స్పందించాడు. బీసీసీఐ ముందుగానే ఆలోచించి భారత ఆటగాళ్లకు విశ్రాంతి దొరికేలా చేసిందని సరదాగా వ్యాఖ్యానించాడు. భారీ టోర్నీ (టీ20 ప్రపంచకప్‌) ముంగిట ఇలాంటి నిర్ణయం ఆ జట్టుకు వరంగా మారుతుందని అక్రమ్ తెలిపాడు.

‘‘ఇప్పుడు పొట్టి కప్‌ కోసం అమెరికాకు వచ్చిన భారత జట్టులో ఎవరూ విశ్రాంతి లేదని చెప్పరు. ముందస్తుగానే ఆలోచించి స్క్వాడ్‌ను ఎంపిక చేసినట్లుంది. ఐపీఎల్‌ ఫైనల్‌కు ఎవరి వచ్చినా రాకపోయినా.. దేశం కోసం ఆడటం చాలా ముఖ్యం. భారత్‌ ఆటగాళ్లకూ తప్పకుండా వరంలా మారుతుందనుకుంటున్నా. రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్‌ వల్ల చాలా మంది క్రికెటర్ల అలసిపోయారు. అమెరికా కూడా వారికి చాలా దూరం. ఇప్పుడు వారికి దొరికిన విరామంతో మళ్లీ శక్తిని అందిపుచ్చుకోవచ్చు. పాకిస్థాన్‌ తొలి మ్యాచ్‌ డల్లాస్‌లో ఉంది. దానికి ముందు ఒకటి లేదా రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఆడనుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆటగాళ్లందరి ఫిట్‌నెస్‌ బాగుంది. త్వరగానే ఆట పరిస్థితులకు అలవాటు పడతారు’’ అని వసీమ్‌ అక్రమ్‌ తెలిపాడు.

ఈసారి వేలానికి ముందు 3+1 రిటెన్షన్‌ విధానం?

వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల రిటెన్షన్‌ అత్యంత కీలకంగా మారనుంది. తాజా వార్తల ప్రకారం.. రిటెన్షన్‌ నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. తమ వద్ద అట్టిపెట్టుకొనే ఆటగాళ్ల సంఖ్యను పెంచేందుకు ఐపీఎల్‌ వర్గాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. నలుగురిని రిటెన్షన్‌ చేసుకోవడం లేదా ముగ్గురి రిటైన్‌ + ఒక ఆటగాడిని రైట్‌ టు మ్యాచ్ రూల్‌తో మార్చుకోవడం చేసేందుకు సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు రిటెన్షన్‌ స్లాట్‌లను పెంచుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు మొగ్గు చూపడం లేదని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా చాలా సమయం ఉన్న క్రమంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు