IND vs ENG: క్రికెట్‌ కంటే ఏ ఆటగాడు ఎక్కువ కాదు : రోహిత్‌ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్‌ స్పందన

ఆకలితో ఉన్న వాడికే అవకాశమంటూ రోహిత్‌ శర్మ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆటగాళ్లు, పలు రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల సభ్యులు స్పందిస్తున్నారు. 

Published : 29 Feb 2024 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆకలితో ఉన్న వాడికే అవకాశం అంటూ రాంచీ టెస్టు తర్వాత రోహిత్‌ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు, రాష్ట క్రికెట్‌ సంఘాల సభ్యులు స్పందిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్, ధ్రువ్‌ జురెల్‌, ఆకాశ్‌దీప్‌ మెరుగైన ప్రదర్శనతో అవకాశాలు సద్వినియోగం చేసుకోగా రంజీ ట్రోఫీలో తమ రాష్ట్రాల తరఫున ఆడమని బీసీసీఐ ఆదేశించినా ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ చేయడంతో రోహిత్‌ ఆ వ్యాఖ్యలు చేశాడు. 

‘‘నేను భారత కెప్టెన్‌తో ఏకీభవిస్తున్నాను. యువ క్రికెటర్లలో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో ఆడాలనే కోరిక ఉండాలి. రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌కు వెన్నముక. దేశవాళీ టోర్నీలో ఇది అత్యంత ముఖ్యమైంది. ఇందులో తప్పనిసరిగా ఆడాలని ఆటగాళ్లను ఆదేశించిన బీసీసీఐని నేను అభినందిస్తున్నాను’’అని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అభిలాష్‌ ఖండేకర్‌ అన్నారు. 

భారత మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ (Dilip Vengsarkar) మట్లాడుతూ ‘‘రంజీల్లో ఆడటం చాలా ముఖ్యం. దీనివల్ల భారత్‌లోని స్పిన్‌ పిచ్‌లపై సులభంగా ఆడటం అలవాటౌతుంది. నైపుణ్యాలు మెరుగుపరుచుకుని విదేశాలతో ఆడినపుడు మంచి ప్రదర్శన చేయవచ్చు. భారత్‌లో అనేకమంది ఆటగాళ్లున్నారు. ఎవరైనా రంజీల్లో ఆడను అంటే వేరే వారికి అవకాశం ఇవ్వాలి. క్రికెట్‌ కంటే పెద్ద వాళ్లు ఎవరు లేరు’’ అన్నారు.  

‘‘కచ్చితంగా రంజీట్రోఫీ ఆడాలనే నియమం తీసుకురాకుంటే రానున్న రోజుల్లో రంజీ ట్రోఫీ అంతరించిపోయే ప్రమాదముంది. ఇది భారత క్రికెట్‌కు మంచిది కాదు’’అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో సభ్యుడు అన్నారు. కేంద్ర కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లు రంజీలకు అందుబాటులో ఉండాలని ఫిబ్రవరిలో బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇతర టోర్నీలపై కొందరు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సరైన వ్యవస్థ, కచ్చితమైన నియమాలు అవసరం. సీనియర్‌ ఆటగాళ్లు తరచూ రంజీల్లో పాల్గొంటే యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుంది. రంజీల్లో ఆడని వారిని నిషేధించే అధికారం రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు ఇస్తే అలాంటి ధైర్యం చేయరు అని పలు రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల సభ్యులు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని