BCCI - Head Coach: కోచ్‌ పదవికి ఏ ఆసీస్ మాజీని సంప్రదించలేదు: జై షా

కొత్త కోచ్‌ అన్వేషణలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఆసీస్‌ మాజీ క్రికెటర్లను సంప్రదించారనే వార్తలను బీసీసీఐ కార్యదర్శి కొట్టిపడేశారు.

Updated : 24 May 2024 12:54 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరితో ముగియనుంది. టీ20 ప్రపంచ కప్‌ ముగిసిన నాటి నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు చేపడతాడు. తాజాగా భారత కోచ్‌గా తీవ్ర స్థాయిలో ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసీస్‌ మాజీ ఆటగాడు జస్టిన్‌ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ పదవి కోసం బీసీసీఐ అతడిని సంప్రదించిందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటిని బోర్డు ప్రధాన కార్యదర్శి జైషా కొట్టిపడేశారు. 

‘‘నేను లేదా బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు ఎవరూ కూడా ఏ ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ను సంప్రదించలేదు. కొన్ని మీడియా సెక్షన్లలో వస్తున్న వార్తలన్నీ తప్పే. భారత జట్టు కోసం ప్రధాన కోచ్‌గా సరైన వ్యక్తినే ఎంపిక చేస్తాం. అదంతా ఓ ప్రక్రియ ప్రకారంగానే జరుగుతుంది. టీమ్‌ఇండియా క్రికెట్‌ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాం. వారి నైపుణ్యంతో జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చేవారినే ఎంపిక చేస్తాం. దేశవాళీ క్రికెట్‌ గురించి సరిగ్గా తెలియకపోతే కొత్త కోచ్‌కు ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి విషయాల్లో చురుకైన వారినే తీసుకొనేందుకు మొగ్గు చూపిస్తాం’’ అని జైషా వెల్లడించారు.

మరో మూడు రోజులే.. 

భారత ప్రధాన కోచ్‌ పదవి కోసం మే 27 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు ఎవరు అప్లై చేశారనేది ఇంకా తెలియలేదు. స్టీఫెన్ ఫ్లెమింగ్‌ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏడాదిలో పది నెలల పాటు జట్టుతో ఉండటమే కఠిన సవాల్‌. ఈ విషయంలో ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ ధోనీపై పెట్టినట్లు వార్తలు వచ్చాయి. రికీ పాంటింగ్‌ ఇప్పటికే ఆసక్తి చూపలేదు. ఈసారి తాను దరఖాస్తు చేయడం లేదని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని