Ranji Trophy: రంజీ ట్రోఫీలో ‘బిహార్‌’ వివాదం.. బీసీసీఐ ఓ కన్నేయాల్సిందే!

ఈసారి రంజీ ట్రోఫీ (Ranji Trophy) భలే ట్విస్ట్‌తో మొదలైంది. ప్రత్యర్థి జట్టుతో తలపడేందుకు ఒకే రాష్ట్రం నుంచి రెండు టీమ్‌లు వచ్చాయి. దీంతో కాసేపు గందరగోళం నెలకొని క్రికెట్ అభిమానులను తికమకకు గురి చేశాయి.

Published : 07 Jan 2024 02:12 IST

భారత క్రికెట్‌ జట్టులోకి అడుగు పెట్టాలని భావించే ప్రతి దేశవాళీ క్రికెటర్‌ రంజీ ట్రోఫీలో (Ranji Trophy) రాణించాలని శ్రమిస్తుంటాడు. జట్టులో చోటు కోసం శతవిధాలా ప్రయత్నిస్తారు. ఈ కారణంగానే ప్రతి రంజీ ట్రోఫీలో రికార్డులు, అద్భుత ప్రదర్శనలు హైలైట్‌గా నిలుస్తాయి. ఈసారి మాత్రం ఓ వివాదం చోటు చేసుకుంది. అదీనూ టోర్నీ ప్రారంభమైన తొలి రోజే! పట్నా వేదికగా ముంబయితో మ్యాచ్‌ కోసం బిహార్‌ నుంచి రెండు జట్లు మైదానం వద్దకు చేరుకోవడంతో క్రికెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. 

అసలేం జరిగిందంటే? 

రెండు జట్లలో ఒకదానిని బిహార్ క్రికెట్ అసోసియేషన్‌ (BCA) అధ్యక్షుడు రాకేశ్‌తివారీ ఎంపిక చేశారు. రెండో టీమ్‌ కార్యదర్శి అమిత్ కుమార్‌ నేతృత్వంలో సిద్ధమైంది. ఈ రెండు జట్లూ ఒకేసారి పట్నా మైదానం వద్దకు చేరుకున్నాయి. ముంబయితో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సందర్భంగా అధికారులూ వాగ్వాదానికి దిగారు. చివరికి అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టునే రంజీ వర్గాలు అనుమతించాయి. అప్పటికి ఈ సమస్య సమసిపోయింది. ముంబయితో బిహార్‌ మ్యాచ్‌ మొదలైంది. ఆ రాష్ట్ర క్రికెట్‌ బోర్డులో మాత్రం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

అధికారం మాదంటే.. మాది..

దేశవాళీ లీగ్‌లకు రాష్ట్ర క్రికెట్ బోర్డులే జట్లను ప్రకటిస్తుంటాయి. ఇక్కడ రెండు టీమ్‌లు రావడంతోనే గందరగోళం నెలకొంది. బీసీఏ అధ్యక్షుడు రాకేశ్‌ తివారీ మాట్లాడుతూ.. ‘‘మేం ప్రతిభ ఆధారంగా జట్టును ఎంపిక చేశాం. బిహార్‌ నుంచి వచ్చే ఆటగాళ్ల టాలెంట్‌ను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఇటీవల ఐపీఎల్‌ వేలంలో షకిబ్ హుస్సేన్ చోటు దక్కించుకున్నాడు. పన్నెండేళ్ల కుర్రాడు అరంగేట్రం చేశాడు. మరో జట్టును ప్రకటించిన కార్యదర్శి సస్పెన్షన్‌లో ఉన్నాడు. అతడు ప్రకటించిన జట్టు సరైంది కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కార్యదర్శి అమిత్ కుమార్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘నేను ఎన్నికల్లో విజయం సాధించా. అధికారికంగా నేనే బీసీఏ కార్యదర్శిని. మీరు (అధ్యక్షుడిని ఉద్దేశించి) కార్యదర్శిని సస్పెండ్‌ చేయలేరు. అసలు అధ్యక్షుడు ఎక్కడైనా జట్టును ఎంపిక చేస్తాడా? బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్‌ బిన్నీ టీమ్‌ను ఎప్పుడైనా ప్రకటించారా? బీసీసీఐ కార్యదర్శి జై షా సంతకం ఉన్న ప్రకటనే  విడుదలవుతుంది’’ అని తెలిపారు. 

కఠిన చర్యలు తీసుకోవాలి..

బోర్డు ఏదైనా సరే.. అధ్యక్షుడు, కార్యదర్శి సహా ఆఫీస్‌ బేరర్లు ఒకే మాట మీద ఉండాలి. జట్టు ఎంపికతో పాటూ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం తీసుకొనే చర్యలూ చాలా కీలకం. బోర్డులోని సభ్యులకే ఒకరంటే మరొకరికి పడకపోతే సొంతంగా నిర్ణయాలు ఎలా తీసుకోగలదని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) పెద్దలు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో మిగతా బోర్డులకూ ఇలాంటి సంస్కృతి పాకితే.. అంతర్జాతీయంగా క్రికెట్‌ వర్గాల్లో ఉన్న బీసీసీఐ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనేది వారి వాదన. ఇప్పటికే బిహార్‌ క్రికెట్ బోర్డు కీలక ప్రకటననూ జారీ చేసింది. రెండో టీమ్‌ను ఎంపిక చేసిన అమిత్ కుమార్‌తో సహా దానికి సహకరించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. బీసీఏ ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాలం నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని