ODI WC 2023: ప్రపంచకప్‌లో వివాదాలు.. డీఆర్‌ఎస్‌పై ఆసీస్‌ అసంతృప్తి

ఆట పరంగా ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఎంతలా ఆకట్టుకుంటుందో.. ఆటేతర కారణాలతోనూ అంతే వార్తల్లో నిలుస్తోంది. ఈ మెగా టోర్నీలో వివాదాలే అందుకు కారణం. ఓ వైపు డీఆర్‌ఎస్‌ సాంకేతిక విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Published : 19 Oct 2023 18:11 IST

భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) క్రమంగా ఊపందుకుంటోంది. పెద్ద జట్లపై పసికూనల విజయాలతో ఒక్కసారిగా మెగా టోర్నీకి జోష్‌ వచ్చింది. మైదానంలో అన్ని జట్లు ఆటతో అలరించేందుకు పోటీపడుతున్నాయి. వన్డే విశ్వ విజేతగా నిలిచేందుకు శ్రమిస్తున్నాయి. ఆట పరంగా ప్రపంచకప్‌ ఎంతలా ఆకట్టుకుంటుందో.. ఆటేతర కారణాలతోనూ అంతే వార్తల్లో నిలుస్తోంది. ఈ మెగా టోర్నీలో వివాదాలే అందుకు కారణం. ఓ వైపు డీఆర్‌ఎస్‌ సాంకేతిక విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా.. మరోవైపు భారత్‌- పాక్‌ మ్యాచ్‌పై వివాదాల పర్వం కొనసాగుతోంది. 

డీఆర్‌ఎస్‌ గోల.. 

ప్రపంచకప్‌లో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు దీనిపై గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఈ డీఆర్‌ఎస్‌ సరిగ్గా లేకపోవడంతో తామే ఎక్కువ నష్టపోతున్నామన్నది ఆస్ట్రేలియా ఆవేదన. మొదట ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కంగారూ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్, స్టాయినిస్‌ ఔట్‌ విషయంలో డీఆర్‌ఎస్‌ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ముందుగా స్మిత్‌ ఎల్బీడబ్ల్యూతో ఇది మొదలైంది. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌ అయిదో బంతి పిచ్‌ మధ్యలో పడి కుడి వైపుగా వెళ్లింది. బంతిని ఆడేందుకు స్మిత్‌ ప్రయత్నించగా.. అది కుడి ప్యాడ్‌కు తాకింది. అప్పీల్‌ చేయగా మైదానంలోని అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో సఫారీ జట్టు సమీక్ష కోరింది. మరో ఎండ్‌లో ఉన్న లబుషేన్‌ బంతి లెగ్‌సైడ్‌ వెళ్తుందనేలా సైగ చేశాడు. కానీ మూడో అంపైర్‌ బంతి లెగ్‌స్టంప్‌ను తాకుతుందని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో షాక్‌కు గురైన స్మిత్‌ నమ్మలేనట్లుగా మైదానం వీడాడు. 

రబాడ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతిని స్టాయినిస్‌ ఆడే ప్రయత్నం చేశాడు. లెగ్‌సైడ్‌ వెళ్లిన ఆ బంతిని వికెట్‌ కీపర్‌ డికాక్‌ తన ఎడమ వైపు డైవ్‌ చేస్తూ పట్టుకున్నాడు. క్యాచౌట్‌ అని దక్షిణాఫ్రికా అప్పీల్‌ చేస్తే అంపైర్‌ ఇవ్వలేదు. దీంతో సఫారీ సేన మరోసారి డీఆర్‌ఎస్‌ను ఆశ్రయించింది. రీప్లేలో బంతి స్టాయినిస్‌ కింది చేయి (ఎడమ) గ్లవ్స్‌కు తాకినట్లు తేలింది. కానీ ఆ సమయంలో ఆ చేతితో అతను బ్యాట్‌ పట్టుకోలేదు. దీంతో నాటౌట్‌గానే ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ బంతి ఎడమ చేతి గ్లవ్స్‌ను తాకిన సమయంలో.. ఆ చేయి కుడి చేతిని తాకి ఉందనే కారణంతో టీవీ అంపైర్‌ ఔట్‌గా నిర్ణయించాడు. దీనిపై ఆస్ట్రేలియా అభ్యంతరం వ్యక్తం చేసింది. సైడ్‌ యాంగిల్‌ నుంచి చూస్తే అది నాటౌట్‌ అని స్పష్టంగా తెలిసేదని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఓడిన ఆసీస్‌.. ప్రపంచకప్‌ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. 

తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లోనూ డీఆర్‌ఎస్‌పై ఆసీస్‌ ఓపెనర్‌ వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మధుశంక వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ తొలి బంతి వార్నర్‌ ప్యాడ్‌ను తాకింది. వెంటనే అంపైర్‌ ఔటిచ్చాడు. కానీ లెగ్‌సైడ్‌ వెళ్తుందని భావించి వార్నర్‌ డీఆర్‌ఎస్‌ కోరాడు. ఇందులోనేమో బంతి కొద్దిగా స్టంప్స్‌కు తాకుతుంది కాబటి నిర్ణయం ‘అంపైర్‌ కాల్‌’గా ఇవ్వడంతో వార్నర్‌ వెనుదిరగక తప్పలేదు. ఈ నిర్ణయంపై వార్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్‌ చేరాడు. అనంతరం దీనిపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు. డీఆర్‌ఎస్‌ విధానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని వార్నర్‌ అన్నాడు. 

చిరకాల ప్రత్యర్థుల పోరు..

ప్రపంచకప్‌లో అందరూ ఆసక్తితో ఎదురు చూసిన చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఈ నెల 14నే ముగిసింది. కానీ ఈ మ్యాచ్‌ తాలుకూ వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇది ఐసీసీ టోర్నీలాగే కనిపించలేదని, బీసీసీఐ ఈవెంట్‌లా ఉందని పాకిస్థాన్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తమ పాత్రికేయులకు వీసాల జారీలో ఆలస్యం, భారత అభిమానుల తీరుపై ఐసీసీకి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. అయితే ఓ ప్రపంచకప్‌ నిర్వహిస్తున్నామంటే వివాదాలు, విమర్శలు సహజమేనని.. టోర్నీ అత్యుత్తమంగా సాగేలా కృషి చేయడమే తమ పని అని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బాక్‌లే పేర్కొన్నారు.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని