ODI World Cup 2023: సగం ప్రపంచ కప్‌ పూర్తి... సెమీస్‌ సంగతేంటి?ఎవరొస్తారు?

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) దాదాపు సగం పూర్తయింది. దీంతో సెమీ ఫైనల్స్‌కు వెళ్లే జట్లు (Semi Finals Teams) ఏవి అనే ప్రశ్న మొదలైంది. దానికి సమాధానం ఈ కథనం. 

Updated : 25 Oct 2023 10:15 IST

‘సెమీస్‌కొచ్చే టీమ్‌లు ఏవి?’ క్రికెట్‌ అభిమానుల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ మహా సమరంలో దాదాపు సగం (23) మ్యాచ్‌లు పూర్తయిపోయాయి మరి. పాయింట్ల పట్టికను ఓసారి చూస్తే... క్లియర్‌గా ఆ నాలుగు జట్లు ఏంటో తెలుస్తున్నాయి. కానీ, ఎక్కడో చిన్న డౌట్. అసలు ఆ జట్లేంటి, ఆ డౌట్‌ ఏంటో ఓసారి చూద్దాం!

భారత్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా... ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌-4లో ఉన్న జట్లు ఇవే. మామూలుగా అయితే ఈ నాలుగే సెమీస్‌కు వెళ్లే అవకాశం బలంగా ఉంది. కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్‌ (ODI World Cup 2023) సంచలనాలకు వేదికగా మారింది. ఇప్పటికే మూడు సంచలన విజయాలు నమోదయ్యాయి కూడా. దీంతో టాప్‌ 4 (Top 4 Teams) స్థానాలను అంత ఈజీగా నిర్ణయించే పరిస్థితి కనిపించడం లేదు. 

టాప్‌ 1లో భారత్‌

ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి 10 పాయింట్లు, 1.353 నెట్‌ రన్‌రేట్‌తో భారత్‌ (Team India) తొలి స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం మన జట్టు ఉన్న ఫామ్‌ చూస్తే ఆ మ్యాచ్‌ల్లో విజయం పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా సంచలనం నమోదైతే తప్ప భారత్‌ తొలి స్థానం నుంచి కిందకు వచ్చే పరిస్థితి లేదు. టీమ్‌ ఇండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను (29న) ఢీకొట్టనుంది. ఆ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, ఇక్కడ భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో మ్యాచ్‌ల్లో విజయాలే భారత్‌ స్థానాన్ని నిర్ణయిస్తాయి. 

Photo: BCCI Twitter

రెండూ, మూడు ఎవరంటే...

ఐదింట నాలుగు మ్యాచ్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ మీద భారీ విజయాలు సాధించడంతో రన్‌రేట్‌ (2.370) అందరి కంటే ఎక్కువగా ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే సఫారీలకు సెమీస్‌ బెర్త్‌ ఖాయం. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు (భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌) కఠినమైన జట్లతోనే. వీటిల్లో తేడాపడినా.. నెట్‌రన్‌రేట్‌ సఫారీ జట్టును కాపాడే అవకాశం ఉంది.

ఇన్నే విజయాలు సాధించిన న్యూజిలాండ్‌ మూడో స్థానంలో ఉంది. భారత్‌తో ఓడిన న్యూజిలాండ్‌ టోర్నీలో ఇప్పటి వరకు నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, శ్రీలంకతో తలపడాలి. కివీస్‌ లేటెస్ట్‌ ఫామ్‌ చూస్తే నాలుగు మ్యాచుల్లోనూ విజయావకాశాలు ఎక్కువే అని చెప్పొచ్చు. కానీ, క్రికెట్‌లో ఎప్పుడు సంచలనాలు నమోదవుతాయో ఎవరూ అంచనావేయలేరు.  ఇప్పటికే ఈ టోర్నీలో మూడు పెద్ద జట్లకు షాకులు తగిలాయి.  

నాలుగులో ఎవరు?

ఇక్కడి వరకు పిక్చర్‌ అంతా క్లియర్‌గా ఉంది. నాలుగో స్థానం కోసమే పోటీ కనిపిస్తోంది. నాలుగేసి పాయింట్లతో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ తర్వాతి వరుసలో ఉన్నాయి. అయితే పాక్‌, అఫ్గాన్‌ కంటే ఓ మ్యాచ్‌ తక్కువగా ఆడటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. కంగారూలు తర్వాతి మ్యాచుల్లో నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం మూడింట విజయావకాశాలు ఎక్కువ. ఆ లెక్కన 10 పాయింట్లతో టాప్‌ 4లో కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. 

ఒకవేళ టాప్‌-4లో ఉన్న జట్లు సిరీస్‌ సెకండాఫ్‌లో తడబడితే ఆ అవకాశాన్ని పాకిస్థాన్‌ సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ, వరుస ఓటములతో ఆ జట్టు డీలాపడిపోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ మూడు భారీ పరాజయాలతో రన్‌ రేట్‌ పరంగా చాలా వెనుకబడింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇది పైకి వచ్చే పరిస్థితి లేదు. 

ఆఖరిగా... మూడు సంచలనాలు నమోదైన ఈ ప్రపంచకప్‌లో మరికొన్ని నమోదైతే మాత్రం టాప్‌-4లో భారీ కుదుపులు తప్పవు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని