Team India: విమర్శించడం చాలా తేలిక.. వారిద్దరూ మళ్లీ ఫామ్‌లోకి వస్తారు: శార్దూల్ ఠాకూర్

ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారిపై విమర్శలు చేయడం తగదని టీమ్‌ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యానించాడు.  

Published : 11 Mar 2024 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విదర్భతో జరుగుతున్న రంజీ మ్యాచ్ ఫైనల్‌ (Ranji Trophy) తొలి ఇన్నింగ్స్‌లో భారత సీనియర్లు అజింక్య రహానె, శ్రేయస్ విఫలమయ్యారు. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన వారిద్దరి ఫామ్‌పై మళ్లీ విమర్శలు వచ్చాయి. ఇలాగైతే జాతీయజట్టులోకి స్థానం దక్కడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కామెంట్లను టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కొట్టిపడేశాడు. ఫామ్‌ కోల్పోవడం తాత్కాలికమేనని.. మళ్లీ పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ 69 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 

‘‘అజింక్య రహానె ఈ సీజన్‌లో ఎక్కువగా పరుగులు చేయలేదు. మంచి ఫామ్‌లోనూ లేడు. దానికోసం అతడిని నిందించాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్క క్రికెటర్‌ జీవితంలో ఇలాంటి దశ ఎదురవుతుంది. అలాగే శ్రేయస్‌ అయ్యర్ కూడా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. ఇప్పుడు వారిద్దరికీ గడ్డు పరిస్థితులే. అలాగని వారిని తక్కువ చేయడం సరైంది కాదు. ముంబయి, భారత్‌ తరఫున వారు మ్యాచ్‌ విన్నర్లే అనడంలో సందేహమే లేదు. కాకపోతే, ఇప్పుడు శ్రేయస్-రహానెకు కఠిన సమయం. ప్రతిఒక్కరూ వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. విమర్శించడం ఏముంది ఎవరైనా చేయగలరు. చాలా తేలికగా మాటలు అనేయవచ్చు. 

బ్యాటర్‌గా రహానె విఫలం కావచ్చేమో కానీ.. ముంబయి జట్టు కెప్టెన్‌గా మైదానంలో అతడి యాటిట్యూడ్ అద్భుతం. అండర్-19, అండర్-23 జట్ల నుంచి చాలామంది యువ క్రికెటర్లు రంజీల్లో ఆడుతున్నారు. అతడిలా మాత్రం ఎవరూ చురుగ్గా లేరు. స్లిప్‌లో అతడిని చూస్తే మీకే అర్థమవుతుంది. 80 ఓవర్లపాటు ఓపిగ్గా ఫీల్డింగ్‌ చేసినా.. అదే ఉత్సాహంతో బౌండరీని ఆపేందుకు ప్రయత్నించాడు. ఇక శ్రేయస్‌ కూడా మైదానంలో పులిలా ఉంటాడు. చురుకైన ఫీల్డింగ్‌తో జట్టు విజయం కోసం శ్రమిస్తాడు. వారిద్దరూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండటం యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంది. రంజీ ట్రోఫీ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకాస్త పరుగులు చేస్తే బాగుండేది. అయినా, మా బౌలర్లు రాణించి విదర్భ టీంను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయగలిగారు’’ అని శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు. 

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ముంబయిదే

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబయి తన తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. విదర్భ జట్టు మాత్రం ముంబయి బౌలర్ల దెబ్బకు 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబయికి 119 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని