Team India: ఐపీఎల్ X ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్.. రెండూ ఆడేందుకు ఇబ్బంది లేదు: సౌరభ్‌ గంగూలీ

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) 17వ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.

Published : 03 Mar 2024 17:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ కోసం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ను పక్కన పెడుతున్నారనే వాదన ఇప్పుడు తెరమీదుకొచ్చింది. తాజాగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల విషయంలోనూ దేశవాళీ క్రికెట్‌ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌తోపాటు దేశవాళీ క్రికెట్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవచ్చని.. గతంలోనూ స్టార్‌ క్రికెటర్లు సైతం ఇదే బాట పట్టారని గుర్తు చేశాడు. దానికి ఉదాహరణగా రాహుల్‌ ద్రవిడ్, సచిన్‌ తెందూల్కర్‌ పేర్లను చెప్పాడు. ఈ అంశాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని గంగూలీ స్పష్టం చేశాడు.

‘‘సచిన్‌, ద్రవిడ్‌ ఇద్దరూ తమ కెరీర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌తోపాటు టెస్టులూ ఆడారు. ఓ వైపు ఐపీఎల్‌లో పాల్గొంటూనే సుదీర్ఘ ఫార్మాట్‌లో మెరిశారు. అందుకే, ఐపీఎల్‌తోపాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌నూ కొనసాగించాలి. అసలు ఈ రెండింటికి ఎప్పుడూ క్లాష్‌ రాదు. దేశవాళీ క్రికెట్ ముగిసిన దాదాపు నెలరోజుల తర్వాత ఐపీఎల్‌ ప్రారంభమవుతుంది. గతంలో చాలామంది అత్యుత్తమ ఆటగాళ్లు టెస్టులతోపాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడారు. ఇప్పుడున్నవారిలో కోహ్లీ, రోహిత్, బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, హ్యారీ బ్రూక్ కూడా రెండింట్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మా రోజుల్లో నాతోపాటు సచిన్‌, రాహుల్‌ టెస్టు క్రికెట్‌ ఆడాం. ఐపీఎల్‌, పరిమిత ఓవర్‌ క్రికెట్‌లోనూ బరిలోకి దిగాం. అందుకే, ఒకటే ఆడాలని చెప్పేందుకు సరైన కారణం లేదు.

మేం దిల్లీ క్యాపిటల్స్‌కు ఎక్కువగా సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో ఆడిన వారినే తీసుకున్నాం. ఇటీవల ఇషాంత్ శర్మ కూడా రంజీల్లో ఆడాడు. చాలాకాలం తర్వాత ఖలీల్ అహ్మద్ పూర్తిస్థాయి సీజన్‌లో పాల్గొన్నాడు. రంజీల కోసం అతడి ఫిట్‌నెస్‌ విషయంలో శ్రద్ధ తీసుకున్నాం. అవసరమైన ఒకరిద్దరికి మాత్రమే మినహాయింపు ఇచ్చాం’’ అని గంగూలీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని