Cricket News: కుల్చా జోడీ ఉంటుందా..? విరాటే అత్యుత్తమం!.. స్టేడియాల్లోకి పాములు రావడంపై అశ్విన్‌ ఏమన్నాడంటే..?

వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) కుల్‌దీప్‌ యాదవ్ - చాహల్‌ జోడీ ఉంటుందా..? ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? క్రికెట్‌ మైదానాల్లోకి పాములు ఎందుకు వస్తాయి? వంటి విషయాలపై ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Updated : 16 Aug 2023 14:23 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ 2023 (ODi Worls Cup 2023)  మెగా టోర్నీకి ఇంకా 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. స్వదేశంలో జరగనుండటంతో భారత్‌ (Team India) ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల జాబితాలో కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ (KulCha) ఉంటారా..? అంటే కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ రూపంలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు ఉండటంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప భిన్నంగా స్పందించాడు. ఇద్దరినీ స్క్వాడ్‌లోకి తీసుకోవాలని సూచించాడు. 

మధ్యలోనే ఐపీఎల్‌ భారీ కాంట్రాక్ట్‌ను వదిలేసిన అక్షయ్‌.. ఎందుకో తెలుసా?

‘‘వరల్డ్ కప్‌ కోసం యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌ ఇద్దరినీ తీసుకోవాలి. కుల్‌దీప్‌ ఇటీవల అద్భుతంగా మెరుగయ్యాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అలాగే యుజ్వేంద్ర చాహల్‌ కూడా చాలా డేంజరస్‌ బౌలర్. వరల్డ్‌ కప్‌లో వారిద్దరికి అవకాశం ఇస్తే ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తారు’’ అని రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.


అడవులకు దగ్గరగా ఉండటం వల్లే..: అశ్విన్‌

లంక ప్రీమియర్‌ లీగ్ (LPL 2023) సీజన్‌లో ఓ మ్యాచ్‌ సందర్భంగా మైదానంలోకి పాము వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘‘ఇటీవల శ్రీలంక ఆటగాడు ఉదానకు సమీపంలో పాము రావడం చూశాం. అయితే, అది విషపూరితమో కాదో అనేది నేను చెప్పలేను. కొందరు అది విషపూరితమైన పాము కాదని కామెంట్లు పెట్టారు. అయితే, అంత దగ్గరగా పామును ఒక్కసారిగా చూసినప్పుడు భయం వేస్తుంది. జంతువులు ఉండే చోట మనం స్టేడియాలు కట్టడం వల్ల వచ్చిన సమస్యల్లో ఇదొకటి. శ్రీలంకలోనూ మైదానాలకు చుట్టుపక్కల అడవులు ఉంటాయి. కాబట్టి, అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఆటగాళ్లతోపాటు జంతువులకు మంచిది’’ అని అశ్విన్‌ తెలిపాడు. 


విరాట్ సూపర్ ప్లేయర్: పాక్‌ మాజీ క్రికెటర్

‘‘ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమం. పాక్ బ్యాటర్లు బాబర్ అజామ్, మహమ్మద్‌ రిజ్వాన్ స్వదేశంలో మాత్రమే కోహ్లీ కంటే బాగా ఆడగలుగుతారు. కానీ, కోహ్లీ ప్రపంచంలో ఎక్కడైనా ఉత్తమంగా ఆడతాడు. ఖాళీల్లో బంతిని పంపే విధానం చాలా వేగంగా ఉంటుంది’’ అని పాక్‌ మాజీ క్రికెటర్ నాదిర్ అలీ ప్రశంసించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను ఆడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లతోపాటు టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 2న భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. 


పాక్‌ ఆటగాడు వాహబ్ రియాజ్‌ క్రికెట్‌కు గుడ్‌బై

పాకిస్థాన్‌ పేసర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. చివరిసారిగా 2020 డిసెంబర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన రియాజ్‌ ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ మాత్రమే ఆడతానని వాహబ్ వెల్లడించాడు. తన కెరీర్‌లో 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడిన రియాజ్‌ మొత్తం 237 వికెట్లు పడగొట్టాడు. తన క్రికెట్‌ కెరీర్‌ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు రియాజ్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని