Akshay Kumar - IPL Contract: మధ్యలోనే ఐపీఎల్‌ భారీ కాంట్రాక్ట్‌ను వదిలేసిన అక్షయ్‌.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ (Akshay Kumar) డబ్బు కంటే ఇతర అంశాలకే విలువిస్తాడని సినీ వర్గాలు చెబుతుంటాయి. తాజాగా ఓ మాజీ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్ తన ఆత్మకథ పుస్తకంలోనూ ఇదే విషయం గురించి వెల్లడించాడు.

Updated : 16 Aug 2023 12:20 IST

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ (Akshay kumar) కొత్త చిత్రం ‘ఓ మైగాడ్ 2’ (OMG 2) గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఆరంభంలో నెమ్మదించిన వసూళ్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు అక్షయ్‌ ‘భారత’ పౌరసత్వం కూడా తిరిగి పొందడం విశేషం. ఇలాంటి సమయంలో అతడి గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మాజీ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథుర్ ఆటో బయోగ్రఫీ ‘పిచ్‌సైడ్: మై లైఫ్‌ ఇన్‌ ఇండియన్‌ క్రికెట్’ పుస్తకం అక్షయ్‌ కుమార్‌ గొప్పతనాన్ని తెలియజేసింది. కాంట్రాక్ట్‌ను మధ్యలోనే వదిలేసి భారీ మొత్తం వదిలేసుకున్న అక్షయ్‌ కుమార్ వైనం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని మాథుర్ పేర్కొన్నాడు.

వచ్చేస్తోంది వన్డే సంబరం

ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఎంత సంచలనమో అందరికీ తెలుసు. అయితే, లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీల విలువ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. కానీ, నష్టాలను తట్టుకొని నిలబడటమూ అంత సులువేం కాదు. 2009 సీజన్‌లోనే దిల్లీ డేర్‌డెవిల్స్ (Delhi Daredevils) నష్టాల బాట పట్టడంతో పొదుపు చర్యలకు దిగింది. అందులో భాగంగా అక్షయ్‌ కుమార్‌తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్‌ను మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి నెలకొంది. అక్షయ్‌తో ప్రమోషనల్‌ ఫిల్మ్స్‌, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరుకావడం వంటి బాధ్యతలతో కూడిన కాంట్రాక్ట్‌ను డీడీ చేసుకుంది. ఆర్థికపరమైన చిక్కులు వెంటాడటంతో అనవసర ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అక్షయ్‌ కాంట్రాక్ట్‌ను ముగించాలని డీడీ భావించింది. అయితే, న్యాయపరంగా అదంతా సులువైన విషయం కాదు. భారీ మొత్తం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, కాంట్రాక్ట్‌ ప్రకారం అక్షయ్‌ కుమార్‌ మాత్రం తనకు రావాల్సిన మొత్తాన్ని వదులుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని మాథుర్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘కోట్లా(అరుణ్‌జైట్లీ స్టేడియం) మైదానంలో చేసిన సాహసోపేత విన్యాసాలు మినహా అక్షయ్‌ కుమార్‌ సేవలను ఎలా వినియోగించుకోవాలో కూడా దిల్లీ డేర్‌డెవిల్స్‌కు తెలియలేదు. 2009 సీజన్‌ ముగింపు సమయంలో తీవ్రమైన ఆర్థిక నష్టాలు తలెత్తాయి. దీంతో తర్జనభర్జనలు పడి అక్షయ్‌తో ఒప్పందాన్ని రద్దు చేయడం లేదా అతడితో కాంట్రాక్ట్‌పై మళ్లీ చర్చలు జరపడం చేయాలని డీడీ నిర్ణయానికొచ్చింది. అయితే, కాంట్రాక్ట్‌ నిబంధనల ప్రకారం అక్షయ్‌తో డీల్‌ను రద్దు చేయడం చాలా కష్టం. మూడేళ్ల కాలానికి ఇచ్చిన కాంట్రాక్ట్‌లో గ్యారంటీలు పటిష్ఠంగా ఉన్నాయి. దీంతో అక్షయ్‌ కుమార్‌ సిబ్బందితో డీడీ లాయర్లు భేటీ అయ్యారు. కానీ, రద్దు చేసుకునేందుకు వారు సుముఖంగా లేనట్లు కనిపించారు. న్యాయపరంగా వారి తప్పేమీ లేదు. మధ్యలో కాంట్రాక్ట్‌ను రద్దు చేయకూడదు. అలా చేయాల్సి వస్తే మొత్తం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది డీడీకి సెల్ఫ్‌ గోల్‌ లేదా హిట్‌వికెట్‌ వంటి చర్య అనడంలో సందేహం లేదు. 

రివ్యూ: ‘ఓ మైగాడ్2’.. అక్షయ్‌ శివుడిగా నటించిన మూవీ ఎలా ఉందంటే?

మరోవైపు ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌కు అంత మొత్తం ఇవ్వడం కూడా కష్టమే అవుతుంది. దీంతో నేరుగా అక్షయ్‌తోనే మాట్లాడి దయ చూపాలని దిల్లీ డేర్‌డెవిల్స్‌ కోరేందుకు సిద్ధమైంది. అప్పుడే అక్షయ్‌ ‘చాందినీ చౌక్‌ టు చైనా’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. నాతోపాటు మరికొంతమంది అక్కడికి వెళ్లాం. ఓ షాట్‌ ముగిసిన తర్వాత తన వ్యాన్‌లోకి వెళ్లి అతడిని కలిశాం. మేం ఎందుకు వచ్చామనేది చెప్పాం. డీడీ ఆర్థిక పరిస్థితిపైనా వివరణ ఇచ్చాం. ఆ వెంటనే ‘ఎలాంటి సమస్య ఉండదు. వర్కౌట్ కానప్పుడు వదిలేద్దాం’ అని అక్షయ్ అన్నాడు. నేను సరిగా వినలేదేమోనని కాస్త అయోమయంగా చూశా. మళ్లీ అక్షయే కల్పించుకుని ‘మనం దీనిని ముగిద్దాం’ అని స్పష్టంగా చెప్పాడు. అయితే, న్యాయపరమైన చిక్కులు గురించి కూడా అతడి దృష్టికి తీసుకెళ్లా. ‘ఏం ఫర్వాలేదు, నేను లాయర్‌కు చెప్తా’ అని అన్నాడు. ఆ తర్వాత చాలా ఏళ్లపాటు ఇంత పెద్ద మొత్తం అక్షయ్‌ తృణప్రాయంగా ఎలా వదులుకున్నాడనే విషయం ఆశ్చర్యానికి గురి చేసింది. క్షణాల్లోనే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు’’ అని మాథుర్‌ తన పుస్తకంలో వెల్లడించారు. అయితే, ఎంత మొత్తం అనేది మాథుర్ వెల్లడించలేదు. ఇదే పుస్తకంలో రవిశాస్త్రి రిటైర్‌మెంట్, ఇర్ఫాన్‌ పఠాన్‌ అరంగేట్రం, మన్కడింగ్‌ సంఘటన.. ఇలాంటి అంశాలను కూడా అందులో పొందుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని