Virat Kohli: విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై ట్రోలింగ్‌.. సెహ్వాగ్‌ అదిరే కౌంటర్

విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించినప్పటికీ రాజస్థాన్‌ చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. అయితే, నెమ్మదిగా శతకం బాదడంపై కోహ్లీపై నెట్టింట ట్రోలింగ్‌ మొదలైంది.

Published : 07 Apr 2024 10:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 బంతుల్లో 113 పరుగులు (స్ట్రైక్‌రేట్‌ 156.94) చేశాడు. 67 బంతుల్లో శతకం మార్క్‌ను తాకాడు. ఐపీఎల్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో ఇదొకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే కూడా 67 బంతుల్లోనే శతకం చేశాడు. దీంతో సోషల్‌ మీడియాలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ఈ క్రమంలో కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు.

‘‘రాజస్థాన్‌పై బెంగళూరు కనీసం 20 పరుగులు వెనుకబడింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ బాగుంది. అయితే, జట్టులోని మిగతావారిలో డుప్లెసిస్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడలేకపోయారు. దినేశ్‌ కార్తిక్, లామ్రోర్ బ్యాటింగ్‌కే రాలేదు. దీంతో విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ పడిపోయింది. ఇతర బ్యాటర్లు చేతులెత్తిసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ భారం విరాట్‌ కోహ్లీపైనే పడింది. అతడి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. ఇన్నింగ్స్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారీ మొత్తం వెచ్చించి తీసుకున్న కొందరు ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచారు. మ్యాక్సీ మరీ దారుణంగా విఫలమయ్యాడు’’ అని ట్రోలర్స్‌కు సెహ్వాగ్‌ కౌంటర్ ఇచ్చాడు. 

సెంచరీపై కోహ్లీ ఏమన్నాడంటే? 

‘‘నన్ను షాట్లు కొట్టేలా ప్రత్యర్థి బౌలర్లు టెంప్ట్‌ చేస్తుంటారు. కానీ, పరిస్థితికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. జైపుర్‌ పిచ్‌ విభిన్నంగా ఉంది. చూడటానికి ఫ్లాట్‌గా అనిపించినా.. బంతి బ్యాట్‌ మీదకు రావడం లేదు. పేస్‌ను ఛేంజ్‌ చేయడం వల్ల బ్యాటింగ్‌ ఇంకా కష్టంగా మారింది. అందుకే, మా ఇద్దరిలో (డుప్లెసిస్‌) ఒకరు చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మేం చేసిన పరుగులు (183) సరిపోతాయని భావించాం. ఈ మ్యాచ్‌లో నేను మరీ దూకుడుగా ఆడలేదని తెలుసు. రాజస్థాన్‌ బౌలర్ల వ్యూహాలను అడ్డుకోవడానికి.. పిచ్‌ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. అశ్విన్‌, చాహల్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తేలికేం కాదు. అశ్విన్‌ క్యారమ్‌ బంతులు చాలా క్లిష్టంగా ఉంటాయి’’ అని కోహ్లీ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని