T20 World Cup 2024: కోహ్లీని టీమ్‌ఇండియా నుంచి తప్పించలేం: భారత మాజీ చీఫ్‌ సెలెక్టర్

వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు విరాట్ కోహ్లీని ఎంపిక చేస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. అయితే.. భారత జట్టు నుంచి కోహ్లీని తప్పించలేమని, టీ20 ప్రపంచకప్‌లో అతడు టీమ్‌ఇండియాకు కీలకమవుతాడని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నారు.  

Published : 20 Mar 2024 20:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ (T20 Worlcup 2024) జూన్‌లో జరగనుంది. ఈ కీలక టోర్నీకి ఎవరెవరని ఎంపిక చేస్తారనే దానిపై ఇప్పటినుంచే చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌లో రాణించిన ఆటగాళ్లకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశముంది. గత కొంతకాలంగా టీ20లకు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లీ (Virat Kohli)ని జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం విరాట్‌ను పక్కనపెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై మాట్లాడిన టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు. కోహ్లీని భారత జట్టు నుంచి తప్పించలేమని, టీ20 ప్రపంచకప్‌లో అతడు భారత్‌కు కీలకమవుతాడని పేర్కొన్నారు.  

‘‘టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కోహ్లీ కీలకమవుతాడు. అతను ఫామ్‌ని నిరూపించుకోవడానికి ఐపీఎల్‌ వేదిక అని సెలెక్టర్లు భావించలేరు. కోహ్లీ ఇప్పటివరకు ఫామ్‌ లేని కారణంగా జట్టుకు దూరం కాలేదు. కుటుంబ కారణాల వల్ల టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు మిస్‌ అయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ చాలాకాలంగా ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కూడా రాణిస్తాడు’’ అని ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరించారు. ధోనీ ఐపీఎల్‌లో ఆడటం గురించి కూడా మాజీ సెలెక్టర్ మాట్లాడారు. ‘‘42 ఏళ్ల వయసులో ధోనీ ఇప్పటికీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇది జట్టు పట్ల అతని నిబద్ధతను తెలియజేస్తుంది. చాలా సంవత్సరాలు ఒకే ఫ్రాంఛైజీ కోసం ఆడుతూ అతను జట్టుపై, అభిమానులపై ఎంతో ప్రభావాన్ని చూపాడు. గత సీజన్‌లో కాలిన గాయం ఇబ్బంది పెడుతున్నా అలానే ఆడి జట్టుకు టైటిల్‌ అందించాడు’’ అని ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని