Compound Archery: కాంపౌండ్‌ ఆర్చర్లకు నిరాశ... ఒలింపిక్స్‌లో ఈ ఆట ఆడేదెన్నడో!

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలు రావడంలో కాంపౌండ్‌ ఆర్చరీది ప్రముఖ స్థానం. ఒలింపిక్స్‌లో ఈ క్రీడకు స్థానం దక్కుతుంది అనుకుంటే నిరాశే ఎదురైంది. 

Updated : 18 Jul 2024 14:17 IST

2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్, స్క్వాష్‌ చేర్చడంతో భారత అభిమానులు చాలా సంబరపడ్డారు. మన స్టార్లను ఒలింపిక్స్‌లో చూస్తామన్న ఆనందమే ఇందుకు కారణం. అంతేకాదు పతకాలు వస్తాయన్న ఆశ. అయితే ఈ రెండు క్రీడలను చేర్చినందుకు ఎంతగా ఆనందపడుతున్నామో.. లాస్‌ ఏంజెల్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీ లేనందుకు అంతగా బాధపడాల్సి వస్తోంది. ఎందుకంటే తాజాగా హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్‌ ఈ ఒక్క విభాగంలోనే 7 పతకాలు సాధించింది. తెలుగు తేజం జ్యోతి సురేఖ లాంటి వాళ్లు ఈ ఈవెంట్లో అగ్రశ్రేణి ఆర్చర్లుగా ఉన్నారు. కానీ మరోసారి ఒలింపిక్‌ గడప ఎక్కడంలో కాంపౌండ్‌ విభాగం విఫలమైంది. 

ఆసియా క్రీడల్లో జోరు చూపినా

ఏ క్రీడాకారుడికైనా ఒలింపిక్స్‌లో పోటీపడడం అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అథ్లెట్లు నిరంతరం శ్రమిస్తారు. కానీ, చాలా ఏళ్లుగా కాంపౌండ్‌ ఆర్చరీలో మన వాళ్లు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నా ఒలింపిక్స్‌లో ఈ ఆట లేకపోయేసరికి అది వేరే స్థాయికి వెళ్లలేకపోతోంది. ముఖ్యంగా తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గత కొన్నేళ్లుగా స్థిరంగా రాణిస్తూ పతకాల పంట పండిస్తోంది. అదితి రూపంలో మరో టీనేజ్‌ సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇటీవల హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో కాంపౌండ్‌ ఆర్చరీ.. ఆసియా క్రీడల్లో దాదాపు అన్ని విభాగాల్లోనూ పతకాలు నెగ్గి స్వీప్‌ చేసేసింది భారత్‌. 

బలమైన దక్షిణ కొరియాను సైతం వెనక్కి నెట్టి స్వర్ణ పతకాలతో మెరిసింది. అయితే ఇంతటి ఘనతలు సాధించినా ఈ ఈవెంట్‌ మాత్రం ఒలింపిక్స్‌లో లేదు. ఎన్ని రికార్డులు సాధించినా ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే ఆ రేంజే వేరు. ఇప్పుడు 2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్, స్క్వాష్‌లను చేర్చడంతో కాంపౌండ్‌ ఆర్చరీకి కూడా అవకాశం వస్తుందేమోనని క్రీడాకారులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పటికే ఆర్చరీలో రికర్వ్‌ రూపంలో ఒక ఈవెంట్‌ ఉండడంతో లాస్‌ఏంజిల్స్‌ నిర్వాహకులు కాంపౌండ్‌ ఆర్చరీని చేర్చాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు.   

అందుకే అవకాశం ఇవ్వలేదా!

1960లో కాంపౌండ్‌ విల్లుని కనిపెట్టారు. కానీ దీని ఉపయోగమంతా సాంకేతికంగానే ఉంటుంది. సాధారణ విల్లుకి దీనికి తేడా ఇదే. రికర్వ్‌లో 70 మీటర్ల దూరం నుంచి లక్ష్యాన్ని గురి పెడితే.. కాంపౌండ్‌లో 50 మీటర్ల దూరం నుంచే టార్గెట్‌ను అందుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కారణాలే రికర్వ్‌కు, కాంపౌండ్‌కు మధ్య దూరాన్ని పెంచాయి. కాంపౌండ్‌కు టెక్నికల్‌ అండ ఉందన్న ఒకే ఒక్క కారణంతో చాలా ఏళ్లుగా ఒలింపిక్స్‌కు పరిగణించట్లేదు. 

అయితే 2028 ఒలింపిక్స్‌ అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో జరగబోతుండడంతో కాంపౌండ్‌లో ఆ దేశానికి మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఈసారి ఈ క్రీడ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ అవకాశం దక్కలేదు. 1972 ఒలింపిక్స్‌లోనే ఆర్చరీ అరంగేట్రం చేసింది. సంప్రదాయ విల్లుతో ఈ పోటీలు జరుగుతున్నాయి. అయితే కాంపౌండ్‌ విల్లు కనిపెట్టి చాలా సంవత్సరాలు అయినా 1995 నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ప్రపంచకప్‌లు జరుగుతున్నా.. అసలైన ఒలింపిక్‌ మెట్టు దగ్గరే ఈ విభాగం నిలిచిపోతోంది. మరి కాంపౌండ్‌కు ఎప్పుడు మోక్షం వస్తుందో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు