Rishabh Pant: ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్‌ పంత్

భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్‌ను చిత్తు చేసి ఈ సీజన్‌ ఐపీఎల్‌లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది.

Updated : 18 Apr 2024 11:01 IST

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను పంత్‌సేన చిత్తు చేసింది. ఆ జట్టు విసిరిన కేవలం 90 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ తొమ్మిది ఓవర్లలోపే పూర్తి చేసింది. దీంతో రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) జట్టు వ్యూహంపై స్పందించాడు. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే పాయింట్లతోపాటు నెట్‌రన్‌రేట్‌ కీలకమని.. అందుకే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. 

‘‘గుజరాత్‌తో మ్యాచ్‌లో చాలా విషయాల్లో మెరుగ్గా రాణించాం. ఛాంపియన్‌ ఆలోచనా విధానంతో బరిలోకి దిగాం. అలానే ఆడి విజయం సాధించాం. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు బౌలింగ్‌ పరంగా ఇదే అత్యుత్తమం. భారీ విజయం సాధించాలన్న లక్ష్యాన్ని ముందే ఎంచుకొన్నాం. ఛేజింగ్‌లోనూ ఇదే తీరుతో ఉన్నాం. వీలైనంత వేగంగా టార్గెట్‌ను కొట్టేయాలని భావించాం. గతంలో మా రన్‌రేట్‌ బాగా పడిపోయింది. దాని కోసం ఇలాంటి మ్యాచులతో మెరుగయ్యే అవకాశం దక్కుతుంది. వికెట్లు పడినా వేగంగా పరుగులు సాధించడానికే మొగ్గు చూపాం. అహ్మదాబాద్‌ పిచ్‌ చాలా బాగుంది. కీలక సమయంలో విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అని పంత్ వ్యాఖ్యానించాడు. 

మా బ్యాటింగ్‌ తేలిపోయింది: గిల్

‘‘సొంత మైదానంలో ఘోర ఓటమిని తట్టుకోలేకపోతున్నా. మా బ్యాటింగ్ అత్యంత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో కుంగిపోకుండా.. తదుపరి మ్యాచ్‌ల కోసం సిద్ధం కావాలి. పిచ్‌ బాగానే ఉంది. మా తప్పిదాల వల్లే వికెట్లను చేజార్చుకున్నాం. షాట్ల ఎంపిక కూడా దీనికి కారణమే. కేవలం 90 పరుగుల లక్ష్య ఛేదనను ఆపాలంటే ఎవరైనా డబుల్ హ్యాట్రిక్ తీస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. దిల్లీ ఎప్పుడూ మ్యాచ్‌ విన్నింగ్‌ రేసులోనే ఉంటుంది. ఈ సీజన్‌ సగం మాత్రమే ముగిసింది. మేం ఇప్పటి వరకు మూడు విజయాలు సాధించాం. మరో ఐదు గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది’’ అని గుజరాత్ కెప్టెన్ గిల్ తెలిపాడు. 

మ్యాచ్‌ విశేషాలు..

  • రిషభ్‌ పంత్‌కు ఏడోసారి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దిల్లీ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ (10) మాత్రమే అత్యధికంగా దీనిని సొంతం చేసుకున్న క్రికెటర్. 
  • ఐపీఎల్‌లో బంతులపరంగా దిల్లీకిదే భారీ విజయం. గుజరాత్‌పై 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు ముంబయిపై (2022) 57 బంతులు మిగిలి ఉండగా గెలిచింది.
  • ఐపీఎల్‌లో 90+ టార్గెట్‌ను అతి తక్కువ ఓవర్లలో పూర్తి చేయడం ఇది మూడోసారి. ఇప్పుడు గుజరాత్‌పై దిల్లీ 8.5 ఓవర్లలో లక్ష్య ఛేదన చేసింది. అంతకుముందు రాజస్థాన్‌పై కొచ్చి (2011లో 98 పరుగులు) 7.2 ఓవర్లు, రాజస్థాన్‌పై ముంబయి (2021లో 91 పరుగులు) 8.2 ఓవర్లలో పూర్తి చేసి గెలిచాయి.
  • ఐపీఎల్ 2024 పవర్‌ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లను కోల్పోయిన జట్టుగా దిల్లీ నిలిచింది. ఇప్పటి వరకు ఆ జట్టు 13 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత లఖ్‌నవూ (12) ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని