Virat Kohli: ఆరెంజ్‌ క్యాప్‌ ఐపీఎల్‌ను అందించలేదు: విరాట్‌పై అంబటి వ్యాఖ్యలు..!

విరాట్‌, ఆర్సీబీ జట్టుపై మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమష్టిగా ఆడితేనే కప్పులు సాధ్యమని పేర్కొన్నాడు.

Published : 27 May 2024 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో తరచూ బెంగళూరు జట్టును విమర్శిస్తున్న మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం చెపాక్‌లో హైదరాబాద్‌పై కోల్‌కతా విజయం సాధించిన అనంతరం రాయుడు మాట్లాడుతూ ‘‘నరైన్‌, రస్సెల్‌, స్టార్క్‌ వంటి బలమైన ఆటగాళ్లకు అండగా నిలిచినందుకు కేకేఆర్‌కు అభినందనలు. వారు కూడా జట్టు విజయం కోసం తమ పాత్ర పోషించారు. ఆ విధంగానే ఏ టీమ్‌ అయినా ఐపీఎల్‌ గెలుస్తుంది. ఈ విషయాన్ని మనం కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఆరెంజ్‌ క్యాప్‌ ఐపీఎల్‌ను గెలిపించలేదు. ఎక్కువ మంది ఆటగాళ్లు సగటున 300 చొప్పున పరుగులు చేస్తే కప్పు సాధించవచ్చు’’ అని రాయుడు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

అతడి అత్యుత్తమ ప్రమాణాలను అందుకోలేకే ఒత్తిడి..

ఇక కోహ్లీని చూసి ఆ జట్టులోని మిగిలిన ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నారన్న కోణంలో రాయుడు విశ్లేషించాడు. ‘‘వారి జట్టు(ఆర్సీబీ)లో విరాట్‌ అత్యంత శక్తిమంతమైన ఆటగాడు. అతడు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. అవి యువ ఆటగాళ్లను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. అందుకే.. విరాట్‌ అవసరమైతే తన ప్రమాణాల స్థాయిని కొంచెం తగ్గించుకొంటే.. యువకులు కూడా డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి మైండ్‌ సెట్‌తో ఉంటారు’’ అని ఈ మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. 

ఇప్పటికే కొన్ని రోజుల క్రితం రాయుడు ఆర్సీబీ జట్టు మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.  ‘‘బెంగళూరు జట్టును కొన్నేళ్లుగా ఆరాధించే ప్రతి ఫ్యాన్‌ను నేను అభినందిస్తా. ఆ జట్టు యాజమాన్యం, సారథులు వ్యక్తిగత రాణింపు కంటే.. జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తే చాలా టైటిళ్లను గెలిచుండేది. ఎంత మంది అద్భుతమైన ఆటగాళ్లను వదులుకున్నారో గుర్తుకు తెచ్చుకోండి. జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ఆటగాళ్లను తీసుకోండి. అప్పుడే మెగా వేలం నుంచే జట్టు కొత్త శకం మొదలవుతుంది’’ అని పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఏకంగా 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్‌ క్యాప్‌ అతడి సొంతమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు