IPL 2024: ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్‌’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ

ఐపీఎల్‌లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్‌ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ.

Published : 11 Apr 2024 12:33 IST

వాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌పై ఇప్పటికే తమదైన ముద్ర వేశారు. లీగ్ క్రికెట్లోనూ మెరిశారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టినీ ఆకర్షించి ఇక్కడా అవకాశం దక్కించుకున్నారు. కానీ, ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్‌లో సత్తా చూపించే అవకాశం మాత్రం రావట్లేదు. తుది జట్టులో ఎప్పుడు ఛాన్స్ దక్కుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వీరు మైదానంలో అడుగు పెడితే సంచలనాలకు కొదవ ఉండదని క్రికెట్‌ విశ్లేషకుల అంచనా.

ఆల్‌రౌండర్‌ విల్ జాక్స్..

ఆల్‌రౌండర్లకు పెట్టింది పేరైన ఇంగ్లాండ్ జట్టుకు దొరికిన మరో ఆణిముత్యం విల్ జాక్స్. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో అతడు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ, ఫ్రాంఛైజీ క్రికెట్లో అతడికి తిరుగులేని రికార్డుంది. ముఖ్యంగా టీ20ల్లో దంచికొట్టాడు. 157 మ్యాచ్‌ల్లో దాదాపు 30 సగటుతో 4 వేలకు పైగా పరుగులు చేశాడు. వీటిల్లో మూడు శతకాలున్నాయి. జాక్స్ ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్నర్ కూడా.

ఐపీఎల్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్‌లో జాక్స్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఓ మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు మెరుపు ఫీల్డర్ కూడా. అతణ్ని వేలంలో రూ.3.2 కోట్లకు కొనుక్కుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ, తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఆడించలేదు. ఇందులో ఒక్కటి మాత్రమే ఆర్సీబీ గెలిచింది. నాలుగు ఓడింది. మెరుపులు కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్‌ల స్థానాలు ఫిక్స్ కాగా.. నాలుగో విదేశీ ఆటగాడిగా ముందు అల్జారి జోసెఫ్‌ను, తర్వాత టాప్లీని ఆడించారు. ఐతే టాప్లీ ప్రదర్శన మెరుగ్గానే ఉంది. ఆల్‌రౌండర్లు గ్రీన్, మ్యాక్స్‌వెల్ మాత్రం విఫలమవుతున్నారు. డుప్లెసిస్ ప్రదర్శన కూడా బాలేకున్నా కెప్టెన్ కాబట్టి తప్పుకోలేడు. గ్రీన్ స్థానంలో జాక్స్‌ను ఆడిస్తే బెంగళూరుకు చాలా ప్రయోజనకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి తర్వాతి మ్యాచ్‌లో అయినా జాక్స్ ఆడతాడా.. ఆర్సీబీ రాత మారుస్తాడా అన్నది చూడాలి.

విండీస్ నయా సంచనలం.. షమర్ జోసెఫ్ 

ఆస్ట్రేలియాను వారి దేశంలోనే టెస్టు మ్యాచ్‌లో ఓడించడం అంటే మాటలు కాదు. అందులోనూ ప్రస్తుత వెస్టిండీస్ జట్టుకు అది అసాధ్యమనే చెప్పాలి. కానీ, కొన్ని నెలల కిందట గబ్బాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు లేని వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాకు భారీ షాకే ఇచ్చింది. 28 ఏళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్‌ను గెలిచింది. అందులో సంచలన ప్రదర్శనతో జట్టును గెలిపించిన యువ బౌలర్.. షమర్ జోసెఫ్. ఓవైపు గాయంతో బాధ పడుతూ కూడా మ్యాచ్ చివరి రోజు 7 వికెట్ల ప్రదర్శనతో విండీస్‌ను గెలిపించాడు. 216 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఈ యువ పేసర్ వేగానికి తట్టుకోలేక 207కే ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో షమర్ వేగం, కచ్చితత్వం చూసి స్టీవ్ వా సహా ఆసీస్‌ వెటరన్లు అతడిపై ప్రశంసలు కురిపించారు. నిజానికి అప్పటికే ఐపీఎల్ వేలం పూర్తి కావడంతో షమర్‌కు అవకాశం పోయిందని అంతా అనుకున్నారు. కానీ, లఖ్‌నవూ ప్రధాన పేసర్లలో ఒకడైన ఇంగ్లాండ్ ఆటగాడు మార్క్ వుడ్.. ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో షమర్‌కు అనుకోకుండా ఐపీఎల్‌లో అవకాశం దక్కింది. అదే జట్టులో మయాంక్ యాదవ్ మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతడికి షమర్ కూడా తోడైతే అగ్నికి వాయువు తోడైనట్లే అని విశ్లేషకుల అంచనా. ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్న నవీనుల్ హక్ స్థానంలో షమర్‌కు ఛాన్సిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విధ్వంసక బ్యాటర్.. జేక్ ఫ్రేజర్‌ మెక్‌గర్క్ 

ఈ ఆస్ట్రేలియా యువ ఆటగాడు విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పటికే బిగ్ బాష్‌ సహా టీ20 లీగ్స్‌పై తనదైన ముద్ర వేశాడు. క్రీజులో అడుగు పెట్టగానే భారీ షాట్లకు దిగి నిమిషాల్లో మ్యాచ్ ఫలితాలు మార్చేసే ఇన్నింగ్స్‌లు ఆడటం జేక్ ఫ్రేజర్ స్టైల్. ఐపీఎల్‌కు ముందు అబుదాబి ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్‌లో మెరుపులు మెరిపించాడు. అక్కడ అతను దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. జేక్‌ను ఆ లీగ్‌లో ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకుంది డీసీ. తన పాత్రకు న్యాయం చేస్తూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ అతడు దిల్లీ జట్టుకే సొంతం అయ్యాడు. కానీ, తుది జట్టులో ఇంకా ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. విదేశీ కోటాలో ఆడిన మిచెల్ మార్ష్, అన్రిచ్ నోకియా, జే రిచర్డ్‌సన్ సత్తా చాటలేకపోయారు. వీరిలో ఎవరో ఒకరికి బదులు మైదానంలోకి దిగే అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న అంచనాలున్నాయి. 

మిడిలార్డర్‌లో దూకుడు.. గ్లెన్ ఫిలిప్స్ 

న్యూజిలాండ్ క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి గ్లెన్ ఫిలిప్స్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ జట్టు తరఫున కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు ఫిలిప్స్. అతను బ్యాటింగ్‌కు దిగాడంటే మెరుపులు మెరవాల్సిందే. అలవోకగా భారీ షాట్లు ఆడగలడు. తన స్పిన్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. ఇక ఫిలిప్స్  ప్రస్తుత ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు. 2021లో తొలిసారి అతను రాజస్థాన్ తరఫున ఐపీఎల్ అవకాశం దక్కించుకున్నాడు. అప్పుడు మూడు మ్యాచ్‌లే ఆడి 26 పరుగులే చేశాడు. గత సీజన్లో సన్‌రైజర్స్ అతణ్ని తీసుకుంది. అప్పట్లో 5 మ్యాచ్‌లు ఆడి 39 పరుగులే చేశాడు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కూడా కొన్ని మ్యాచ్‌ల్లో కలిసి రావు. ఫిలిప్స్ ఇంతకుముందు ఆడిన మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన, ఒత్తిడి మధ్య బరిలోకి దిగి విఫలమయ్యాడు. ఈ ఐపీఎల్ ముంగిట అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టాడు. ఇప్పుడున్న ఫాంలో అతడికి ఛాన్సిస్తే సత్తా చూపిస్తాడనడంలో సందేహం లేదు. సన్‌రైజర్స్ జట్టులో మార్‌క్రమ్ ఓ మోస్తరు ప్రదర్శనే చేస్తున్నాడు. అతడి స్థానంలో ఫిలిప్స్‌ను ఆడిస్తే  ఆల్‌రౌండర్‌గా జట్టకు బాగానే ఉపయోగపడొచ్చు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయినా ఫిలిప్స్‌కు ఛాన్సిచ్చి చూడాలి.

వీళ్లే కాదు.. మరికొందరు విదేశీ స్టార్లు కూడా ఐపీఎల్‌లో ప్రతిభను చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్ లీగ్స్‌లో మెరుపులు మెరిపించిన వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ షెఫానీ రూథర్‌ఫర్డ్ .. ఇంగ్లాండ్‌కు చెందిన టాప్ఆర్డర్ బ్యాటర్ టామ్ కోహ్లెర్‌-మోర్.. గత సీజన్లో దిల్లీకి ఆడి ఈసారి పంజాబ్‌లో అవకాశం దక్కించుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రొసో.. విండీస్‌ బ్యాటర్‌ కైల్ మేయర్స్ సైతం లఖ్‌నవూలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీరికి ఆయా జట్లు అవకాశాలు ఇస్తాయేమో చూడాలి.

-ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని