IPL 2024: డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్‌ ప్లేయర్‌కు చెన్నై అవకాశం

న్యూజిలాండ్ స్టార్‌ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

Published : 18 Apr 2024 15:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ నుంచి చెన్నై ఆటగాడు డేవన్‌ కాన్వే (Devon conway) వైదొలిగాడు. గతేడాది ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో ఈ న్యూజిలాండ్‌ క్రికెటర్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇప్పటివరకు చెన్నై ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో డేవన్ కాన్వే వైదొలగడం చెన్నై అభిమానులను నిరాశపరుస్తోంది. గాయం కారణంగా కాన్వే ఈ సీజన్‌కు దూరమవుతున్నట్లు.. అతడి స్థానంలో మరొక ఓవర్సీస్‌ ప్లేయర్‌ను చెన్నై తీసుకున్నట్లు ఐపీఎల్ ప్రకటించింది. 

‘‘డేవన్ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్‌కు దూరమయ్యాడు. అతడికి బదులు రిచర్డ్‌ గ్లీసన్‌ను తీసుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన 36 ఏళ్ల సీనియర్ ప్లేయర్‌ను మిగతా మ్యాచ్‌ల కోసం తన స్క్వాడ్‌లోకి ఎంపిక చేసుకుంది. అతడు ఇప్పటివరకు జాతీయ జట్టు తరఫున ఆరు టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అతడి బేస్‌ ప్రైస్ రూ.50 లక్షలతో చెన్నై జట్టుతోపాటు చేరతాడు’’ అని ఐపీఎల్ పోస్టు చేసింది. 


అతడు నేర్చుకొనేదేం లేదు.. ఐపీఎల్‌పై బంగ్లా బోర్డు ఛైర్మన్ అక్కసు

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, అతడిని జింబాబ్వేతో టీ20 సిరీస్‌ కోసం వెనక్కి రప్పించేందుకు బంగ్లా క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. మే 3 నుంచి ఐదు టీ20ల సిరీస్‌ జరగనుంది. బీసీబీ నుంచి వచ్చిన నిరభ్యంతర పత్రం ప్రకారం మే 1 నాటికి అతడు తిరిగి స్వదేశానికి రావాలి. అయితే, చెన్నై జట్టు మాత్రం మరొక రోజు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మే 1న పంజాబ్‌తో చెన్నై తలపడనుంది. ఈ క్రమంలో బీసీబీ బోర్డు ఛైర్మన్‌ యూనస్ జలాల్ స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్‌లో ఆడటం వల్ల ముస్తాఫిజుర్ పెద్దగా నేర్చుకొనేదేం లేదు. అతడు నేర్చుకొనే సమయం ఎప్పుడో అయిపోయింది. ఇంకా చాలామంది ఆటగాళ్లు అక్కడ నేర్చుకొనేందుకు ఉన్నారు. ఈ లీగ్‌ వల్ల బంగ్లాకు ఏమీ ప్రయోజనం లేదు. అయినా చెన్నై విజ్ఞప్తి మేరకు మే 1న ఆడేందుకు అనుమతినిస్తున్నాం. అతడు ఆ తర్వాత రోజు స్వదేశానికి వస్తాడు’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని