PAK vs USA: వరల్డ్‌ కప్‌లో పాక్‌ ఓటమి.. మళ్లీ ‘నెపోటిజం’పై ట్రోలింగ్‌

పాకిస్థాన్‌ ఓటమిపై మళ్లీ ట్రోలింగ్‌ మొదలైంది. ఇందులో ఆజం ఖాన్‌తోపాటు సీనియర్‌ పేసర్ మహమ్మద్ ఆమిర్‌ వల్ల జట్టు ఓడిందనే విమర్శలు వచ్చాయి.

Updated : 07 Jun 2024 10:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) పాకిస్థాన్‌ ఓటమితో ప్రారంభించింది. ఆతిథ్య యూఎస్‌ఏ అద్భుత ప్రదర్శనతో పాక్‌ను చిత్తు చేసింది. సూపర్ ఓవర్‌కు వెళ్లిన ఈ మ్యాచ్‌లో అమెరికా (4) విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే, పాక్‌ ఆటగాడు ఆజం ఖాన్ మరోసారి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ప్రపంచ కప్‌ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ ఆజం ఖాన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు మళ్లీ యూఎస్‌ఏపై గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. పాక్‌పై అమెరికా ‘సూపర్’ విక్టరీ

98 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయిన పాక్‌ను ఆదుకోవాల్సిన ఆజం ఖాన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. యూఎస్‌ఏ బౌలర్ నోస్తుష్‌ బౌలింగ్‌లో (12.5వ ఓవర్) ఎల్బీగా ఆజం పెవిలియన్‌కు చేరాడు. దీంతో నెపోటిజం కారణంగానే అతడిలాంటి ప్లేయర్‌ జట్టులోకి వచ్చాడని పాక్‌ క్రికెట్ అభిమానులు కామెంట్లు పెట్టారు. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ మొయిన్‌ ఖాన్ కుమారుడే ఆజం ఖాన్‌. ఇప్పటి వరకు కేవలం 14 అంతర్జాతీయ టీ20లను మాత్రమే ఆడిన అతడు 88 పరుగులు చేశాడు. అతడిని మెగా టోర్నీకి ఎంపిక చేయడం వెనుక బంధుప్రీతి ఉందని గతంలోనూ విమర్శలు వచ్చాయి. 

ఆమిర్‌ వల్లే ఓటమి..

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్‌ పేసర్ ఆమిర్ తమ జట్టు ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించాడు. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అయితే, పాక్‌ బౌలర్‌ ఆమిర్‌ వేసిన ఈ ఓవర్‌లో యూఎస్‌ఏ 18 పరుగులు సాధించింది. ఏడు పరుగులు వైడ్ల రూపంలోనే రావడం గమనార్హం. ఇదే తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని పాక్ అభిమానులు నిరాశ చెందారు. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 13 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఒకవేళ ఆమిర్‌ ఆ వైడ్లను ఇవ్వకుండా ఉంటే తమ అభిమాన జట్టు గెలిచేందుకు అవకాశం ఉండేదని ఆ జట్టు ఫ్యాన్స్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని