Haris Rauf: పాక్‌కు తప్పని కష్టాలు.. హారిస్‌ రవూఫ్‌పై ‘బాల్ ట్యాంపరింగ్‌’ ఆరోపణలు!

యూఎస్‌ఏ సీనియర్‌ క్రికెటర్ సంచలన పోస్టుతో క్రికెట్‌ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్ రవూఫ్‌పై బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలు చేయడం గమనార్హం.

Published : 07 Jun 2024 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) తమ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్థాన్‌కు షాకింగ్‌ న్యూస్. ఇప్పటికే యూఎస్‌ఏ చేతిలో ఓడిన పాక్‌ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు ఆ జట్టు స్టార్ పేసర్ హారిస్‌ రవూఫ్‌పై ‘బాల్ ట్యాంపరింగ్‌’ ఆరోపణలు రావడం గమనార్హం. ఈ అంశంపై యూఎస్‌ఏ సీనియర్‌ క్రికెటర్ రస్టీ థెరాన్ ఐసీసీ తలుపు తట్టాడు. తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రవూఫ్ బంతి రూపు రేఖలను మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. 

‘‘మ్యాచ్‌ మధ్యలో కొత్తగా తీసుకున్న బంతిని రవూఫ్‌ గీకుతూ కనిపించాడు. కేవలం రెండు ఓవర్ల ముందే మార్చిన బాల్‌తో రివర్స్‌ స్వింగ్‌ రాబట్టడం చేయగలరా? కానీ, రవూఫ్‌ తన బొటనవేలితో బంతిపై రుద్దుతూ పరిగెత్తడాన్ని మీరు చూడొచ్చు’’ అంటూ ఐసీసీని ట్యాగ్‌ చేసి రస్టీ పోస్టు పెట్టాడు. యూఎస్‌ఏ క్రికెటర్ ఇలా పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఐసీసీ దృష్టిసారించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. 

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్

ఓ వైపు పొట్టికప్‌లో తమ జట్టు ఓడినప్పటికీ పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ మాత్రం అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. యూఎస్‌ఏపై 44 పరుగులు చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీని (4,038) అధిగమించి టాప్‌ స్కోరర్‌గా అవతరించాడు. ప్రస్తుతం బాబర్ 4,067 పరుగులతో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో రోహిత్ శర్మ (4,026) కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓటమిపై బాబర్ స్పందించాడు. యూఎస్‌ఏ ఎదుట మేం ఉంచిన 160 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవచ్చని బాబర్ తెలిపాడు. పది ఓవర్లు ముగిసిన తర్వాత మళ్లీ రేసులోకి వచ్చామని అనిపించిందన్నాడు. కానీ, మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు వెళ్లడంతో నిరాశ చెందామని, యూఎస్‌ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని