పాకిస్థాన్‌ ఎలిమినేట్ అయినట్లేనా? గ్రూప్ - A ‘సూపర్‌ - 8’ అవకాశాలు ఇలా!

వరల్డ్‌ కప్‌లోని గ్రూప్ - A పరిస్థితి విభిన్నంగా ఉంది. ఫేవరేట్‌ అనుకున్న జట్టేమో వెనుకబడిపోయింది. సంచలన ప్రదర్శనతో పసికూన జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

Updated : 10 Jun 2024 10:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్, పాకిస్థాన్‌, యూఎస్‌ఏ, ఐర్లాండ్, కెనడా.. ఇవీ టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) గ్రూప్‌ - Aలో తలపడుతున్న జట్లు. ఇక్కడ నుంచి టీమ్‌ఇండియాతోపాటు పాక్‌ సునాయాసంగా తదుపరి దశ సూపర్ - 8కు అర్హత సాధిస్తుందని అంతా అంచనా వేశారు. భారత్ వరుసగా రెండు విజయాలు సాధించి మార్గాన్ని సుగమం చేసుకుంది. మరోవైపు సంచలన ప్రదర్శనతో యూఎస్‌ఏ అనూహ్యంగా రెండు మ్యాచుల్లో గెలిచి సూపర్ -8 రేసులో నిలిచింది. మరోవైపు పాక్‌ మాత్రం వరుసగా ఓటములను చవిచూసి తన అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది. ఈ గ్రూప్‌ నుంచి ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 

  • టీమ్‌ఇండియా: వరుసగా రెండు మ్యాచులు గెలిచింది. జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో తలపడనుంది. ఇప్పటికే 4 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో (1.455) అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు సూపర్ - 8కి చేరేందుకు మరొక విజయం చాలు. యూఎస్‌ఏ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. కెనడాతో కష్టమేం  కాదు. చివరి రెండు మ్యాచుల్లోనూ భారత్‌ విజయం సాధిస్తే గ్రూప్‌ స్టేజ్‌ను తొలి స్థానంతో ముగుస్తుంది. 
  • యూఎస్‌ఏ: ఈ వరల్డ్‌ కప్‌లో సంచలన ఆటతీరుతో అందరి మన్ననలను పొందుతోన్న జట్టు యూఎస్‌ఏ. సొంతమైదానంలో తలపడుతున్న ఆ జట్టు హేమాహేమీలు కలిగిన గ్రూప్‌ - ఏ స్టేజ్‌లో ఉండటం గమనార్హం. పాక్‌ను చిత్తు చేసి సూపర్ - 8 అవకాశాలను సృష్టించుకుంది. ప్రస్తుతం రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక భారత్‌తో బుధవారం మ్యాచ్‌ ఆడనుంది. చివరిగా జూన్ 14న ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. రెండు మ్యాచ్‌లు యూఎస్‌ఏకు కష్టమైనవే అయినప్పటికీ ఆ జట్టు ప్రదర్శన చూశాక.. మరొక సంచలనం నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే పాక్‌ ఇంటికే. 
  • కెనడా: యూఎస్‌ఏ చేతిలో చిత్తయిన కెనడా.. ఐర్లాండ్‌పై విజయం సాధించడం మాత్రం అద్భుతమే. చిన్న జట్లలో ఐర్లాండ్‌ కాస్త పెద్ద టీమ్‌ అని చెప్పొచ్చు. కానీ, ఆ జట్టుకే షాక్‌ ఇచ్చింది కెనడా. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కెనడా (2 పాయింట్లు) కొనసాగుతోంది. జూన్ 11న పాకిస్థాన్‌, జూన్‌ 15న భారత్‌తో కెనడా తలపడనుంది. ఆ రెండూ పెద్ద జట్లు కావడంతో కెనడా విజయం సాధిస్తే సంచలనమే అవుతుంది. అదే సమయంలో సూపర్ - 8 రేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. 
  • పాకిస్థాన్‌: టోర్నీకి ముందు సెమీస్‌కు చేరే నాలుగు జట్లలో పాకిస్థాన్‌ పేరు చెప్పని మాజీ క్రికెటర్‌ లేడు. గత ఎడిషన్లలోనూ పాక్‌ సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే. కానీ, ఈసారి మాత్రం వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఇంకా పాయింట్ల ఖాతాను కూడా తెరవలేదు. గతంలోనూ తొలుత ఓడి.. ఆ తర్వాత పుంజుకున్న సందర్భాలు పాక్‌ జట్టులో చూశాం. ఇప్పుడు కూడా మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలు నమోదు చేసి.. యూఎస్‌ఏ, కెనడాలు తమ మ్యాచుల్లో ఓడిపోతేనే పాక్‌కు సూపర్ - 8 అవకాశాలు ఉంటాయి. కెనడాతో (జూన్ 11), ఐర్లాండ్ (16న)తో పాక్‌ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే పాక్ ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. యూఎస్‌ఏ మిగతా రెండింట్లో ఒక్కటి గెలిచినా.. పాక్‌ పని ముగిసినట్లే. కాబట్టి, అమెరికా మిగిలిన మ్యాచుల్లో ఓడాలి.. తమ జట్టు గెలవాలని పాక్‌ ఫ్యాన్స్‌ కోరుకోవాలి.
  • ఐర్లాండ్‌: తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ఐర్లాండ్ కూడా సూపర్ - 8 రేసులో ఉంది. కానీ, అవకాశాలు చాలా తక్కువ. మూడు టీమ్‌ల మీద ఆధార పడి ఉంది. యూఎస్‌ఏ, కెనడా, పాక్‌ను దాటి ఐర్లాండ్‌ రావాలంటే కష్టమే. చివరి రెండు మ్యాచుల్లో యూఎస్‌ఏ (జూన్ 14), పాకిస్థాన్‌తో (జూన్ 16) తలపడనుంది. వీటితో పోరు అంత ఈజీ కాదు. ఒక్కటి ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు