Hyderabad Vs Punjab: వామ్మో.. అతడికి బౌలింగ్‌ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్

హైదరాబాద్‌ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్‌ ప్లేఆఫ్స్‌కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్‌ వేదికగా జరిగిన చివరి లీగ్‌లో పంజాబ్‌పై విజయం సాధించింది.

Updated : 20 May 2024 08:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో హైదరాబాద్‌ రెండో స్థానంతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతాను ఢీకొట్టనుంది. లీగ్‌ స్టేజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తన చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 215 పరుగుల టార్గెట్‌ను 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. అభిషేక్ శర్మ (66: 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ అభిషేక్‌పై ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ సీజన్‌లో అతడు 13 మ్యాచుల్లో 209 స్ట్రైక్‌రేట్‌తో 467 పరుగులు చేశాడు. తనను భయపెట్టిన బ్యాటర్లలో ఇతడొకరని.. ఎప్పుడూ బౌలింగ్‌ చేయాలని కోరుకోనని కమిన్స్ వ్యాఖ్యానించాడు.

‘‘ఉప్పల్‌ వేదికగా గత ఏడు మ్యాచుల్లో మేం ఆరింట్లో విజయం సాధించాం. సొంతమైదానంలో అభిమానులను అలరించామని అనుకుంటున్నాం. జట్టులోకి చాలా మంది యువ క్రికెటర్లు వచ్చి సత్తా చాటారు. నాణ్యమైన క్రికెట్ ఆడటంతోనే ఇది సాధ్యమైంది. కుర్రాళ్లలో గెలవాలనే కసి ఎక్కువుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు. నేనెప్పుడూ అతడికి బౌలింగ్‌ చేయాలని కోరుకోను. స్వేచ్ఛగా ఆడే అతడికి ఎదురుగా బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. కేవలం పేసర్లనే కాకుండా స్పిన్‌నూ అలవోకగా ఆడేస్తాడు. మరో యువ ప్లేయర్ నితీశ్‌ రెడ్డి క్లాస్‌ ఆటగాడు. అతడి వయసు కంటే మానసికంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తి. టాప్‌ ఆర్డర్‌కు సరిగ్గా సరిపోతాడు. మాకు ఈ మ్యాచ్‌ ఎంత ముఖ్యమో తెలుసు. అందుకు తగ్గట్టుగానే ప్రదర్శన చేసి ఫలితం రాబట్టగలిగాం’’ అని కమిన్స్ తెలిపాడు. 

ఓవర్సీస్‌ ప్లేయర్లు ఒక్కరే ఉన్నా..: జితేశ్‌

‘‘మా కుర్రాళ్లు చాలా అద్భుతంగా పోరాడారు. ఆటను ఆస్వాదించగలిగాం. మా జట్టులో విదేశీ ప్లేయర్ల జాబితాలో ఒక్కడే ఉన్నాడు. మిగతా వారు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. అయినా, సన్‌రైజర్స్‌కు గట్టి పోటీనిచ్చాం. ఎన్నిసార్లు చర్చించుకున్నా మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోతే అవన్నీ వృథానే అవుతాయి. పిచ్‌ను బట్టి మేం ఆడేందుకు ప్రయత్నించాం. బ్యాటింగ్‌లో సఫలీకృతులైనప్పటికీ.. బౌలింగ్‌లో కాస్త వెనుకబడ్డాం’’ అని పంజాబ్ కెప్టెన్ జితేశ్‌ శర్మ వ్యాఖ్యానించాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు.. 

  • హైదరాబాద్‌ అత్యధిక లక్ష్య ఛేదనలో ఇది రెండో స్కోరు. గతేడాది (2023) రాజస్థాన్‌పై 215 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. ఇప్పుడు కూడా పంజాబ్‌పై అవే పరుగులను పూర్తి చేసి విజయం సాధించింది.
  • ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో 200+ స్కోర్లను హైదరాబాద్‌ ఆరుసార్లు చేసింది. ఇదే సీజన్‌లో కేకేఆర్‌ 6, బెంగళూరు కూడా ఆరేసి సార్లు సాధించాయి. 200+ స్కోర్లను డిఫెండ్‌ చేయలేక ఓటమి చవిచూడటం పంజాబ్‌కు ఇది నాలుగోసారి. ఆర్సీబీ (5), సీఎస్కే (5), కేకేఆర్ (4) ఈ జాబితాలో ఉన్నాయి.
  • టీ20 లీగుల్లో అత్యధిక సార్లు 200+ స్కోర్లు నమోదైన రెండో టోర్నీ ఐపీఎల్ 2024 సీజన్‌. ఇప్పటి వరకు 41సార్లు నమోదు కాగా.. టీ20 బ్లాస్ట్‌ 2023 ఎడిషన్‌లో 42 సార్లు ఆయా జట్లు 200+ స్కోర్లను చేశాయి.
  • ఒకే సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన ముగ్గురు బ్యాటర్లు అభిషేక్ శర్మ 41, హెన్రిచ్‌ క్లాసెన్ 33, ట్రావిస్ హెడ్ 31 సిక్స్‌లు కొట్టారు. ఒక టీ20 సిరీస్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్‌ (160) నిలిచింది. 
  • ఒకే సీజన్‌లో పంజాబ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్‌ పటేల్ నిలిచాడు. ఈసారి అతడు 24 వికెట్లు తీశాడు. ఆండ్రూ టై (2018) కూడా పంజాబ్‌ తరఫున సరిగ్గా 24 వికెట్లే పడగొట్టాడు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు