Pro Kabaddi League: కూతపెడితే కోట్ల రూపాయలు...

కబడ్డీ (Kabaddi).. ఓ గ్రామీణ క్రీడ! ఒకప్పుడు ఊళ్లలో కుర్రాళ్లు సరదాకి ఆడేవాళ్లు. లేకపోతే సంక్రాంతి, దసరా సంబరాలప్పుడు పోటీలు పెట్టేవాళ్లు. ఒక అడుగు ముందుకేసి రాష్ట్రానికి.. ఆ తర్వాత దేశానికి ఆడినా పేరు వచ్చేది కానీ ఆర్థికంగా పెద్దగా ఏమీ ఒరిగేది కాదు. కబడ్డీ సర్టిఫికెట్‌తో ఒక చిన్న ఉద్యోగం వస్తే అదే పదివేలు అనుకునేవాళ్లు. అలాంటిది ప్రొ కబడ్డీ లీగ్‌ (Pro Kabaddi League) రాకతో గత కొన్నేళ్లలో ఈ ఆట స్వరూపమే మారిపోయింది. 

Updated : 12 Oct 2023 16:55 IST

కబడ్డీ (Kabaddi).. ఓ గ్రామీణ క్రీడ! ఒకప్పుడు ఊళ్లలో కుర్రాళ్లు సరదాకి ఆడేవాళ్లు. లేకపోతే సంక్రాంతి, దసరా సంబరాలప్పుడు పోటీలు పెట్టేవాళ్లు. ఒక అడుగు ముందుకేసి రాష్ట్రానికి.. ఆ తర్వాత దేశానికి ఆడినా పేరు వచ్చేది కానీ ఆర్థికంగా పెద్దగా ఏమీ ఒరిగేది కాదు. కబడ్డీ సర్టిఫికెట్‌తో ఒక చిన్న ఉద్యోగం వస్తే అదే పదివేలు అనుకునేవాళ్లు. అలాంటిది ప్రొ కబడ్డీ లీగ్‌ (Pro Kabaddi League) రాకతో గత కొన్నేళ్లలో ఈ ఆట స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు మ్యాచ్‌లు ఆడి అతి స్వల్ప మ్యాచ్‌ఫీజులు తీసుకున్న ఆటగాళ్లు ఇప్పుడు కోట్లు చూస్తున్నారు. తాజాగా లీగ్‌ వేలంలో ఆటగాళ్లను జట్లు కోట్లు వెచ్చించి కొనుక్కున్నాయి. కొంతమందికి ఇచ్చిన మొత్తం ఈ ఏడాది ఐపీఎల్‌లో చాలామంది క్రికెటర్ల కంటే ఎక్కువే! 

పవన్‌ జాక్‌పాట్‌

పవన్‌ సెహ్రావత్‌ (Pawan Sehrawat) అయితే వేలంలో జాక్‌పాట్‌ కొట్టేశాడు. అతడిని తెలుగు టైటాన్స్‌ జట్టు ఏకంగా రూ.2.60 కోట్లు పెట్టి దక్కించుకుంది. కోట్లు గడించడం ఈ కుర్రాడికిదేం కొత్త కాదు. 2022 సీజన్లో తమిళ్‌ తలైవాస్‌ రూ.2.26 కోట్లతో పవన్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ తెలుగు టైటాన్స్‌ (Telugu Titans) ఈ స్టార్‌ను దక్కించుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఒక ఆటగాడిపై ఇంత మొత్తాన్ని వెచ్చించడం ఇదే తొలిసారి. మహ్మద్‌ రెజాకు (ఇరాన్‌) భారీ రేటు పలికింది. రూ.2.35 కోట్లు పెట్టి పుణెరి పల్టాన్‌ అతడిని సొంతం చేసుకుంది. ఇంత మొత్తం పెట్టిన తొలి విదేశీ ఆటగాడిగా అతడు ఘనత సాధించాడు. మణిందర్‌ సింగ్‌ (రూ.2.12 కోట్లు, బెంగాల్‌ వారియర్స్‌), ఫజల్‌ (రూ.1.60 కోట్లు, గుజరాత్‌ టైటాన్స్‌), సిద్ధార్థ్‌ దేశాయ్‌ (రూ.కోటి, హరియాణా స్టీలర్స్‌) ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాలా పెద్దదే అవుతుంది.

జీవితాలే మారిపోయాయ్‌

ఒకప్పుడు చిన్న ఉద్యోగం దొరికితే చాలు.. ఏదోలా జీవితాన్ని గడిపేయచ్చు అని సర్టిఫికెట్లు పట్టుకుని తిరిగిన ఆటగాళ్లు ఇప్పుడు రాజాల్లా బతుకుతున్నారు. క్రికెటర్ల మాదిరే ఒక్క సీజన్‌ ఆడి కోట్లు ఆర్జిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోయినా.. దేశానికి ఆడకపోయినా కేవలం లీగ్‌లు ఆడి జీవితంలో సెటిల్‌ అయితున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఈ ఆట నుంచి ఏమీ రాకపోయినా ప్రేమతో మాత్రమే ఎక్కువమంది కొనసాగేవాళ్లు. దేశానికి ఆడినా కూడా ఆ తర్వాత కెరీర్‌ కొనసాగించలేక బతుకుదెరువు కోసం ఏదో ఒక వృత్తిలో స్థిరపడిపోయేవాళ్లు. వాళ్ల ఇంట్లో గెలిచిన కప్పులు, ప్రోత్సాహక సర్టిఫికెట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్క సీజన్లో అవకాశం దొరికితే చాలు అన్నట్లు ఆటగాళ్లు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే బాగా స్థిరపడిన ఆటగాళ్లను చూసి కొత్తవాళ్లు కూడా స్ఫూర్తి పొంది కబడ్డీలోకి వస్తున్నారు. ఇదో శుభపరిణామం.  పొలాల్లో పని చేసుకునే కాశీలింగ్‌.. ఇంట్లో ఆర్థిక సమస్యలతో బయట చిన్న చిన్న పనులు చేసిన రిషాంక్‌ దేవడిగ.. ఆర్థిక ఇబ్బందులతో చదువు వదలిపెట్టిన దీపక్‌.. అర్జున అవార్డు దక్కినా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న అనూప్‌ కుమార్‌ ప్రొ కబడ్డీ ద్వారా మళ్లీ కొత్త జీవితాన్ని పొందినవాళ్లే. ఈ లిస్టు ఇంకా పెద్దదే ఉంది. ఫ్రాంఛైజీ క్రికెట్‌ భారత క్రికెట్‌పై ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. మారుమూల గ్రామాల క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత భారత జట్టుకు ఆడారు. ఇప్పుడు కేపీఎల్‌ కూడా అంతటి ప్రభావమే చూపిస్తోంది. కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. కబడ్డీని బతికిస్తోంది. 

 - ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని