Match Mitchell: నా పారితోషికం విషయంలో చాలా జోకులేశారు: మిచెల్ స్టార్క్

కోల్‌కతా ఛాంపియన్‌గా నిలవడంలో సునీల్‌ నరైన్, మిచెల్ స్టార్క్‌ కీలక పాత్ర పోషించారు. ఒకానొక సమయంలో స్టార్క్‌పై తీవ్ర విమర్శలూ వచ్చిన సంగతి తెలిసిందే.

Updated : 27 May 2024 13:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నాకౌట్ దశలో తన బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని మరోసారి కోల్‌కతా పేసర్ మిచెల్ స్టార్క్‌ నిరూపించాడు. తొలి క్వాలిఫయర్‌లో 3, ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 2 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు. మినీ వేలంలో రూ. 24.75 కోట్లు వెచ్చించడంపై అప్పట్లో కేకేఆర్‌పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్‌ స్టేజ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. 12 మ్యాచుల్లో 12 వికెట్లను మాత్రమే తీసిన అతడు.. నాకౌట్‌లో మాత్రం కేవలం రెండు మ్యాచుల్లోనే 5 వికెట్లు తీశాడు. ఫైనల్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకొన్నాడు. ఈ సందర్భంగా తన పారితోషికంపై చాలా ట్రోల్స్‌ వచ్చాయని స్టార్క్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘కేకేఆర్‌కు ఇదొక అద్భుతమైన సీజన్‌. ఫైనల్‌లో రెండు అత్యుత్తమ జట్లే తలపడ్డాయి. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్‌ చాలా బాగా సాగింది. బెస్ట్ బ్యాటర్లు, బౌలర్లతో కూడిన టీమ్‌ మాది. నిలకడగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అందించారు. ఈ మ్యాచ్‌లో మేం టాస్‌ ఓడిపోయినప్పటికీ బౌలింగ్‌ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. రెండు రోజుల కిందట ఇదే పిచ్‌పై జరిగిన మ్యాచ్‌ను గమనించాం. పిచ్‌ ఎలా స్పందిస్తుందన్న అంశం అర్థం కాలేదు. అయితే, మ్యాచ్‌ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని నిర్ణయించుకున్నాం. మాకు అద్భుతమైన సారథి శ్రేయస్‌ రూపంలో ఉన్నాడు. బౌలర్లను, ఫీల్డర్లను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. టోర్నీ  ప్రారంభానికి ముందు నా పారితోషికం విషయంలో చాలా జోకులు వచ్చాయి. నేను ఐపీఎల్‌లో ఆడి చాలా కాలమైంది. ఇప్పుడు మళ్లీ అనుభవం సంపాదించా. మొదట్లో నాపై భారీగా అంచనాలు ఉండేవి. వాటిని మేనేజ్‌ చేయగలిగా. మా జట్టు విజేతగా నిలవడంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ప్లేయర్లతోపాటు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో ఆడకపోవచ్చు. తప్పకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం పోటీ పడతా’’ అని  స్టార్క్‌ తెలిపాడు. 

2012 సీజన్‌ గుర్తుకొచ్చింది..: నరైన్

‘‘ఫైనల్‌ కోసం చెపాక్‌లో అడుగు పెట్టినప్పుడు ఒక్కసారిగా 2012 సీజన్‌ గుర్తుకొచ్చింది. నాకు ఇంతకంటే మంచి బర్త్‌డే గిఫ్ట్ ఉండదు. ఇప్పుడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ను చాలా ఆస్వాదించా. జట్టు విజయం సాధించడంలో మన పాత్ర ఉంటే ఆ ఆనందం రెట్టింపవుతుంది. గౌతమ్‌ ఇచ్చిన సలహా బాగా పనిచేసింది. ‘క్రీజ్‌లోకి వెళ్లి స్వేచ్ఛగా ఆడు. జట్టు కోసం కొన్ని మ్యాచ్‌లను గెలిపించు చాలు. సీజన్‌ మొత్తం అవసరం లేదు. కొన్నిచాలు.’ ఇదే గౌతీ చెప్పిన మాట. సాల్ట్‌తో కలిసి అద్భుతమైన ఓపెనింగ్‌ లభించింది. ప్లేఆఫ్స్‌లో అతడి స్థానంలో గుర్బాజ్‌ వచ్చాడు. శుభారంభం దక్కితే చివరి వరకూ అదే కొనసాగుతుంది. వరుణ్ ప్రపంచ స్థాయి బౌలర్. తీవ్రంగా కష్టపడతాడు. బౌలింగ్‌ లైనప్‌ కూడా చాలా బలంగా ఉంది. అందుకే, మాపై ఎక్కువ ఒత్తిడి లేదు’’ అని నరైన్‌ వ్యాఖ్యానించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని