IPL 2024: అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు

ఐపీఎల్‌లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్‌ ఐపీఎల్‌లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం!

Published : 09 Apr 2024 09:56 IST

ఐపీఎల్‌ (IPL)లో ఆ ఆటగాళ్ల గత రికార్డు పేలవం. అభిమానుల ఆదరణనూ చూరగొనలేకపోయారు. వారి మీద ఈ సీజన్ ముంగిట పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ ఐపీఎల్‌లో వాళ్లు రెచ్చిపోయి ఆడేస్తున్నారు. ఒకప్పుడు వేస్ట్ అన్న వాళ్లతోనే బెస్ట్ అనిపించుకుంటున్నారు. కొత్తగా తమకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకుంటున్నారు. ఆ క్రికెటర్లెవరో చూద్దాం పదండి.

రియాన్ పరాగ్ (Riyan Parag)

ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు ఐపీఎల్ అభిమానులకు మంటెత్తిపోయేది. మైదానంలో, బయట అతను చేసే ఓవరాక్షన్‌కి, తన ఆటకు పొంతన ఉండేది కాదు. ఫీల్డింగ్ చేస్తూ ఒక క్యాచ్ పట్టాడంటే చాలు.. తెగ హడావుడి చేసేవాడు. బ్యాటింగ్‌కు వెళ్లినపుడు కూడా బిల్డప్ మామూలుగా ఉండేది కాదు. తీరా చూస్తే కొన్ని బంతులు ఆడి ఔటైపోయేవాడు. పేరున్న ఆటగాళ్లు బెంచ్ మీద కూర్చుంటే అతడికి మాత్రం రాజస్థాన్ రాయల్స్ వరుసగా అవకాశాలిస్తుండేది. తన మాటలు కోటలు దాటేవి. దీనివల్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు ఈ అస్సాం క్రికెటర్. అయితే వయసు పెరిగేకొద్దీ పరిణతి రావడం సహజం. పరాగ్‌లోనూ ఇదే మార్పు కనిపించింది. 

ఈ ఐపీఎల్‌ సీజన్ ముంగిట దేశవాళీల్లో అతను చెలరేగి ఆడాడు. రంజీ ట్రోఫీతో పాటు లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో రాణించాడు. ఆ ఫామ్‌ ఐపీఎల్‌లోనూ కొనసాగింది. ఈ ఐపీఎల్‌కు ముందు ఐదు సీజన్లలో కలిపి 54 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. చేసిన పరుగులు కేవలం 600. సగటు 20 లోపే. కానీ ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌ల్లోనే 92.5 సగటుతో 185 పరుగులు చేశాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 43, 84 నాటౌట్, 54 నాటౌట్ స్కోర్లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎప్పట్లాగే పరాగ్ ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. చూస్తుంటే రాబోయే రోజుల్లో పరాగ్ మంచి స్థాయికి చేరుకునేలా కనిపిస్తున్నాడు.

ట్రిస్టన్‌ స్టబ్స్ (Tristan Stubbs)

ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 5 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయింది. కానీ ఆ జట్టులో పెద్దగా అంచనాలు లేని ఓ కొత్త ఆటగాడు అదరగొడుతున్నాడు. అతనే.. ట్రిస్టియన్ స్టబ్స్. ఈ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్‌.. గత రెండు ఐపీఎల్ సీజన్లలో భాగమైన సంగతే జనాలకు తెలియదు. 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 27 పరుగులే చేశాడు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకపోవడంతో ఇక ఐపీఎల్‌లో మళ్లీ కనిపించడనుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో, అలాగే టీ20 లీగ్స్‌లో సత్తా చాటడంతో ఐపీఎల్‌లో ఇంకో అవకాశం లభించింది. దిల్లీ జట్టు అతణ్ని తుది జట్టులో ఆడించింది. 

తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ.. రాజస్థాన్‌పై 23 బంతుల్లోనే 44 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటుకున్నాడు. తర్వాత కోల్‌కతాపై 34 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. తాజాగా ముంబయిపై మరింతగా చెలరేగిన స్టబ్స్ 25 బంతుల్లో 71 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి ఖాయమనుకున్న దశలో సంచలన బ్యాటింగ్‌తో దిల్లీలో ఆశలు రేపాడు. కానీ చివర్లో సరిపడా బంతులు లేకపోవడంతో అతను మళ్లీ జట్టును గెలిపించలేకపోయాడు. స్టబ్స్ ప్రదర్శన దిల్లీకి ఈ సీజన్లో పెద్ద ప్లస్ పాయింట్.

శివమ్ దూబె (Shivam Dube)

ఈ ముంబయి ఆటగాడు ఆరేళ్ల నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఒకప్పుడు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ అక్కడ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా రెండు రకాలుగా విఫలమయ్యాడు. తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు మారినా అతడి రాత మారలేదు. కానీ 2023లో చెన్నై జట్టుకు మారాక శివమ్ దూబె పేరు గట్టిగా వినిపించడం మొదలైంది. అయితే చెన్నైకి మారాక అతను బౌలర్ పాత్రకు దూరమై హిట్టర్‌గా మారాడు. 

గత సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో సత్తా చాటిన శివమ్.. ఈ సీజన్లో చెలరేగి ఆడుతున్నాడు. చెన్నై అతణ్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకుంటోంది. బెంగళూరుపై 34 పరుగులతో అజేయంగా నిలిచిన దూబె.. గుజరాత్‌పై అర్ధశతకం సాధించాడు. సన్‌రైజర్స్ మీదా 45 పరుగులతో రాణించాడు. దూబె వచ్చాడంటే సిక్సర్ల మోత మోగుతూ స్కోరు బోర్డు పరుగులు పెడుతుండడంతో అభిమానుల్లో జోష్ వస్తోంది.

అభిషేక్ శర్మ (Abhishek Sharma)

మూడేళ్ల కిందట సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ ఆటగాళ్లందరినీ వదులుకుని.. కేవలం అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ అనే ఇద్దరు కుర్రాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఈ ఇద్దరి ఐపీఎల్ ప్రదర్శన అంతంతమాత్రమే. సమద్ సంగతి పక్కన పెడితే.. అభిషేక్‌కు సన్‌రైజర్స్ ఇచ్చిన ప్రాధాన్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక దశలో అతణ్ని జట్టు కెప్టెన్‌ను చేస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఈ సీజన్‌ ముందు వరకు అభిషేక్ 47 మ్యాచ్‌లు ఆడి 893 పరుగులే చేశాడు. పార్ట్‌టైం స్పిన్నర్‌గా కూడా అతను పెద్దగా ప్రభావం చూపింది లేదు. 

వార్నర్, రషీద్ ఖాన్, బెయిర్‌స్టో, ధావన్ లాంటి స్టార్లను వదిలేసి.. అభిషేక్‌ను సన్‌రైజర్స్ నెత్తిన పెట్టుకోవడం ఆ జట్టు అభిమానులకు నచ్చలేదు. కానీ ఈ సీజన్లో అభిషేక్ మెరుపులు చూసి అతడికి అందరూ ఫ్యాన్స్ అయిపోతున్నారు. సన్‌రైజర్స్ ఐపీఎల్ అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌లో ముంబయిపై అతను 23 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. చెన్నైపై 12 బంతుల్లోనే 37 పరుగులు చేసి ముందే మ్యాచ్ ఫలితాన్ని తేల్చేశాడు. ఈ సీజన్ ముందు వరకు జిడ్డు బ్యాట్స్‌మన్‌గా పేరున్న అభిషేక్.. ఈసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆ ముద్రను చెరిపేసి అభిమానుల ఫేవరెట్ అయిపోయాడు.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని