ODI WC 2023: మళ్లీ అదే సందిగ్ధత... ప్రపంచకప్ ముంగిట టీమ్‌ఇండియా ఫిట్‌నెస్ కష్టాలు

ఈసారి ఎలాగైనా వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) అందుకోవాలనే టీమ్‌ ఇండియా ఆలోచనకు ఫిట్‌నెస్‌ సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. జట్టు (Team India) ఎంపిక విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేకపోతోంది.

Updated : 10 Aug 2023 17:10 IST

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI WC 2023) ఆరంభానికి ఇంకో రెండు నెలల సమయం కూడా లేదు. చాలావరకు జట్లు ప్రపంచకప్‌లో తలపడే ఆటగాళ్లపై ఒక అంచనాకు వచ్చేశాయి. కప్పు దిశగా పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. కానీ సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగనున్న టీమ్ఇండియా (Team India) మాత్రం జట్టు ఎంపిక విషయంలో అయోమయ స్థితిని ఎదుర్కొంటోంది. జట్టుపై ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. ఎప్పట్లాగే పెద్ద టోర్నీ ముందు కొందరు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ (Crickters Fitness)పై సందిగ్ధత నెలకొనడం.. రోహిత్ శర్మ (Rohit Sharma) సేన ప్రపంచకప్ సన్నాహాలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

సొంతగడ్డపై భారత జట్టు ప్రపంచకప్ ఆడుతోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. 2011లో ఆ అంచనాలను నిలబెట్టుకుంటూ ధోని సారథ్యంలోని భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ఆ తర్వాత 2016లో భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా విఫలమైంది. మళ్లీ ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అలవోకగా విజయాలు సాధించే టీమ్‌ఇండియా..  పదేళ్లుగా ఐసీసీ టోర్నీలు వేటిలోనూ టైటిల్ నెగ్గలేదు. ఇప్పుడైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ.. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మన జట్టు కప్పు సాధిస్తుందని మాజీలతో పాటు అభిమానులు కూడా ధీమాగా చెప్పలేని పరిస్థితి. 

కుర్రాడు రేసులోకొచ్చాడు!

విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్ లాంటి కీలక ఆటగాళ్ల ఫామ్‌ మునుపటి స్థాయిలో లేకపోవడమే కాక.. జట్టు కూర్పుపై అంచనా రాకపోవడం ఒక కారణం. 2019 వన్డే ప్రపంచకప్.. ఆ తర్వాత జరిగిన రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో జట్టు ఎంపికలో తప్పిదాలు భారత్‌కు చేటు చేశాయన్నది స్పష్టం. 2019లో అంబటి రాయుడిని పక్కన పెట్టి విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం ప్రతికూలమైంది. 2021, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఇలాంటి తప్పిదాలు కొన్ని జరిగాయి. నిలకడగా ఒక జట్టును ఆడించకుండా.. పదే పదే జట్టును మారుస్తూ చేసిన ప్రయోగాలు దెబ్బ కొట్టాయి. 

2022 ప్రపంచకప్ ముంగిట బుమ్రా (Jasprith Bumrah)పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. చివరికి అతను అందుబాటులో లేకుండా పోయాడు. దీపక్ చాహర్ సైతం గాయంతో వైదొలిగాడు. దీంతో టీ20లకు చాలా కాలంగా దూరంగా ఉన్న షమిని నమ్ముకోవాల్సి వచ్చింది. ఫామ్ దెబ్బ తిన్న భువనేశ్వర్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. వీళ్లు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. ప్రస్తుత వన్డే ప్రపంచకప్ విషయానికి వస్తే.. కొందరు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై అనిశ్చితి గందరగోళానికి కారణమవుతోంది.

ఆ ముగ్గురూ ఫిట్టేనా?

జస్‌ప్రీత్ బుమ్రా కొన్నేళ్ల పాటు వివిధ ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళాల్లో ఒకటిగా బుమ్రా నాయకత్వంలోని బృందం ఎదిగింది. అతను వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టుకు కొన్ని మరపురాని విజయాలందించాడు. కానీ బుమ్రాకు ఫిట్‌నెస్ సమస్యలు ఎదురైనప్పటి నుంచి భారత పేస్ విభాగం బలహీన పడిపోయింది. వెన్ను గాయం అతణ్ని రెండేళ్లుగా ఇబ్బంది పెడుతోంది. గత ఏడాది ఈ గాయం అతడి కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసింది. కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండి.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కోలుకున్న బుమ్రా.. తిరిగి భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. కానీ ఒక్క సిరీస్‌తోనే మళ్లీ గాయం తిరగబెట్టింది. మళ్లీ మైదానానికి దూరమయ్యాడు. 2022 టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. 

ఫిట్‌నెస్ సాధించడానికి బుమ్రా చాలా సమయం తీసుకున్నాడు. అతణ్ని ఎలాగైనా వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలని భారత్ చూస్తోంది. ఇటీవలే ఎన్‌సీఏ వైద్యులు బుమ్రాకు క్లియరెన్స్ ఇవ్వడంతో అతడి ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు త్వరలో ఐర్లాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేయడమే కాక.. కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చారు. కానీ గత ఏడాది కాలంలో చాలా వరకు మైదానానికి దూరంగా ఉన్న బుమ్రా.. ప్రపంచకప్‌నకు నెలన్నర ముందు పునరాగమనం చేసి ఏమాత్రం లయ అందుకుంటాడో అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా మళ్లీ అతడిని ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడవన్న గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి ఐర్లాండ్‌తో సిరీస్‌లో బుమ్రా పరీక్షకు ఏమాత్రం నిలుస్తాడో చూడాలి. 

టీమ్‌ ఇండియాలో ఎంపిక గురించి ఆలోచించడంలేదు: పృథ్వీషా

బుమ్రా మళ్లీ ఇబ్బంది పడ్డాడంటే ప్రపంచకప్‌లో భారత్ అవకాశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడబోతున్నట్లే. మరోవైపు వన్డే జట్టులో కొన్నేళ్లుగా రెగ్యులర్ ఆటగాళ్లుగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్ మీదా సందేహాలు కొనసాగుతున్నాయి. శ్రేయస్ గాయంతో ఐపీఎల్ కూడా ఆడలేదు. అతను పూర్తిగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఎన్‌సీఏ నుంచి ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. అలా అని శ్రేయస్ ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండడని కూడా ఎవరూ ధ్రువీకరించడం లేదు. అతడితో పోలిస్తే కేఎల్ రాహుల్ పరిస్థితి మెరుగైనట్లు వార్తలు వస్తున్నాయి. 

మరి రాహుల్‌ ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా అనే విషయంలో స్పష్టత లేదు. వీళ్లిద్దరూ ప్రపంచకప్ ఆడాలంటే.. ఈ నెలాఖర్లో మొదలయ్యే ఆసియా కప్‌లో, ఆపై ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడాల్సిందే. అప్పుడే ఫిట్‌నెస్, ఫామ్‌పై ఒక అంచనా వస్తుంది. గాయాలతో నెలల తరబడి ఆటకు దూరంగా ఉండి నేరుగా ప్రపంచకప్ ఆడాలంటే కుదరదు. సాధ్యమైనంత త్వరగా వీరి విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరముంది. ఆ స్పష్టత వస్తే ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టి ప్రపంచకప్‌ జట్టు, కూర్పుపై ఒక అంచనాకు రావచ్చు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని