IPL - WPL - PSL: ఐపీఎల్‌.. డబ్ల్యూపీఎల్‌ ప్రైజ్‌మనీతో పోలిస్తే పీఎస్‌ఎల్‌కు ఎంతంటే?

ప్రపంచ క్రికెట్‌లో టీ20లీగులకు భారీ ఆదరణ ఉంది.  అయితే, ప్రైజ్‌మనీ విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు ఉదాహరణ ఐపీఎల్‌, డబ్ల్యూపీఎల్‌తో పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌ను పోలిస్తే అర్థమైపోతుంది.

Updated : 20 Mar 2024 13:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవలే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) ముగిసింది. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌ కూడా పూర్తయింది. మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబ్ల్యూపీఎల్‌ విజేతగా నిలిచింది. పీఎస్‌ఎల్‌ ఛాంపియన్‌గా ఇస్లామాబాద్ యునైటెడ్‌ అవతరించింది. మూడోసారి ఈ టైటిల్‌ను ఆ జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఏ లీగ్‌లో ఏ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందనే దానిని క్రికెట్‌ అభిమానులు నెట్టింట శోధించారు. 

  • ఐపీఎల్‌లో గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. రన్నరప్‌ గుజరాత్ టైటాన్స్‌ కూడా రూ. 13 కోట్లను దక్కించుకుంది. ప్రపంచ లీగ్‌ల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం. మరే ఇతర టోర్నీల్లో ఇంతటి భారీ మొత్తం అందించిన దాఖలాలు లేవు.
  • తాజాగా ముగిసిన డబ్ల్యూపీఎల్‌లోనూ అదిరిపోయే ప్రైజ్‌మనీని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టు సొంతం చేసుకుంది. విజేత రూ. 6 కోట్లు అందుకోగా.. ఫైనల్‌లో ఓడిపోయిన దిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 3 కోట్లు దక్కాయి.  
  • పీఎస్‌ఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు 14 కోట్ల పాకిస్థాన్‌ రూపాయలు ప్రైజ్‌మనీగా దక్కింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 4.15 కోట్లు. రన్నరప్‌గా నిలిచిన ముల్తాన్ సుల్తాన్స్‌కు రూ. 1.65 కోట్లు (5.60 కోట్ల పాకిస్థాన్‌ రూపాయలు) అందాయి.
  • బిగ్‌బాష్‌ లీగ్‌ కంటే పీఎస్‌ఎల్‌లోనే ఎక్కువ ప్రైజ్‌మనీ ఇవ్వడం గమనార్హం. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌లో రూ. 3.66 కోట్లు మాత్రమే విన్నర్‌కు దక్కుతాయి. ఫైనల్‌లో ఓడినవారికి సుమారుగా రూ.1.80 కోట్లు అందుతుంది.
  • ఐపీఎల్‌ తర్వాత అత్యధికంగా సౌతాఫ్రికాటీ20 లీగ్‌లో విజేతకు రూ.15 కోట్లు ఇస్తుండగా, రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు రూ.7.5 కోట్లు ఇస్తారు. వెస్టిండీస్‌లో నిర్వహించే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అయితే విజేతకు రూ.8 కోట్లు అందుతాయి. ఫైనల్‌లో ఓడిపోయిన టీమ్‌కి రూ.5.5 కోట్లు ఇస్తారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని