Punjab Vs Rajasthan: అతడు మా వైస్ కెప్టెన్‌ కాదు.. సోషల్ మీడియా కామెంట్లపై పంజాబ్ క్లారిటీ

కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పాల్గొనలేదు. దీంతో కరన్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated : 14 Apr 2024 12:00 IST

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌తో ముల్లాన్‌పుర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్‌ (Shikhar Dhawan) స్వల్ప గాయం కారణంగా ఆడలేదు. అతడికి బదులు జట్టును సామ్ కరన్ (Sam Curran) నడిపించాడు. అదేంటి జితేశ్‌ శర్మ (Jitesh Sharma) వైస్‌ కెప్టెన్‌ కదా.. టోర్నీ ప్రారంభ వేడుకలకు అతడే హాజరయ్యాడనే అనుమానం రావడం సహజమే. ఐపీఎల్ కప్‌ను ఆవిష్కరించినప్పుడు ఇతర జట్ల సారథులతో కలిసి ఫొటోషూట్‌లో కూడా పాల్గొన్నాడు. మరి అతడిని కాదని కరన్‌ను రాజస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్‌కు పంపడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. చివరికి పంజాబ్ మేనేజ్‌మెంట్ స్పందించింది.  కోచ్ సంజయ్‌ బంగర్‌ వివరణ ఇచ్చాడు. 

‘‘జితేశ్‌ శర్మ అధికారికంగా వైస్‌ కెప్టెన్ కాదు. అయితే, కెప్టెన్ల సెమినార్‌, టోర్నీ ప్రారంభ సమావేశాలకు అతడు హాజరు కావడంతో అంతా అలా భావించారు. కానీ, సామ్‌ కరన్‌ గతేడాది కూడా జట్టును నడిపించిన సందర్భాలున్నాయి. అతడే ధావన్‌కు డిప్యూటీ. టోర్నీ ప్రారంభ కార్యక్రమం సమయానికి కరన్‌ యూకే నుంచి రావడం ఆలస్యమైంది. కొన్ని ట్రైనింగ్‌ సెషన్స్‌కు హాజరుకావాలని భావించాడు. అందుకే అతడిని చెన్నైకి పంపించలేదు. కార్యక్రమానికి జట్టు నుంచి తప్పకుండా ప్రాతినిధ్యం వహించాలని ఐపీఎల్‌ సభ్యుడి సూచనల మేరకు జితేశ్‌ను పంపించాం. అంతేకానీ, అతడు వైస్‌ కెప్టెన్‌ అని మేం అనుకోలేదు. మా వరకైతే ఆ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. ధావన్‌ గైర్హాజరీలో సామ్ కరన్‌ జట్టును నడిపిస్తాడు. ధావన్‌ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాం. అయితే మరో వారం రోజులపాటు మైదానంలోకి దిగడం కష్టమేనని అనిపిస్తోంది.’’ అని బంగర్ తెలిపాడు. 

పిచ్‌ చాలా మందకొడిగా ఉంది: పంజాబ్ కెప్టెన్ కరన్

‘‘మాకు బ్యాటింగ్‌లో మంచి ఆరంభం లభించలేదు. బౌలింగ్‌లో సరిగ్గా ముగించలేకపోయాం. పిచ్‌ చాలా మందకొడిగా ఉంది. మా లోయర్‌ ఆర్డర్ బ్యాటర్ల కారణంగానే కనీసం పోరాడే స్కోరు చేయగలిగాం. అత్యుత్తమంగానే బౌలింగ్‌ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయాం. స్వల్పతేడాతో ఓటమిపాలయ్యాం. మా ప్రణాళికలకు అనుగుణంగానే గేమ్‌ ఆడాం. తప్పకుండా ఇదే ఆత్మవిశ్వాసంతో వచ్చే మ్యాచ్‌లో పుంజుకుంటాం. కొత్త వేదికపై త్వరగానే పరిస్థితులను అలవాటు చేసుకోగలిగాం. ఈ మ్యాచ్‌తోపాటు గత మ్యాచ్‌ను స్వల్ప తేడాతో కోల్పోయాం. వాటన్నింటినీ పక్కన పెట్టి తీవ్రంగా సాధన చేస్తాం’’ అని కరన్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని