Rahul Dravid: దానికి సమాధానం ఇంగ్లిష్‌లోనే చెబుతా.. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం: ద్రవిడ్

 వరల్డ్ కప్‌లో (ODI World Cup 2023) టీమ్‌ఇండియా ఆడిన నాలుగు మైదానాల్లో రెండింటికి ఐసీసీ కాస్త తక్కువ రేటింగ్‌ ఇచ్చింది. దీనిపై భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.

Updated : 22 Oct 2023 10:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఇప్పటికే అన్ని జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడేశాయి. భారత్‌ మరో కీలక సవాల్‌ ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆస్ట్రేలియా, అఫ్గాన్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోఉంది. నాలుగు వేదికల్లో రెండింటికి ఐసీసీ ‘యావరేజ్’ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. మిగతా రెండు మైదానాలకు మంచి రేటింగ్‌ దక్కింది. అయితే అహ్మదాబాద్‌, చెన్నై మైదానాలకు యావరేజ్‌ రేటింగ్‌ ఇవ్వడంపై భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ స్పందించాడు. ఐసీసీ నిర్ణయం సరైంది కాదంటూనే.. సున్నితంగా విమర్శలు గుప్పించాడు. 

‘‘నాకు ఐసీసీ పట్ల గౌరవం ఉంది. అయితే ఈ రేటింగ్‌ ఇలా ఇవ్వడం మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని హిందీలో మాట్లాడిన రాహుల్‌ ద్రవిడ్‌ వెంటనే ‘‘ఇలాంటి వాటికి ఇంగ్లిష్‌లోనే సమాధానం ఇస్తా. లేకపోతే నేను ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది’’ అని చెప్పడంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చినవారంతా నవ్వేశారు. అనంతరం రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘అహ్మదాబాద్, చెన్నై పిచ్‌లకు యావరేజ్‌ రేటింగ్ ఇవ్వడం సరికాదు. ఆ రెండు మైదానాలు చాలా బాగున్నాయి. 350 పరుగులు చేసే వికెట్‌ అయితేనే మంచి రేటింగ్‌ ఇస్తామనడం కూడా సరైంది కాదు. పిచ్‌ స్పందించిన తీరే కాకుండా ఆటగాళ్ల నైపుణ్యాలనూ పరిశీలించాలి. కేవలం ఫోర్లు, సిక్స్‌లు మాత్రమే చూస్తామంటే కుదరుదు. అలా అనుకుంటే టీ20 వికెట్లను తయారు చేసుకోవచ్చు. దిల్లీ, పుణె వికెట్లు అలాంటివే. అక్కడ 350+ స్కోరు నమోదు చేసుకోవచ్చు. ఇక బౌలర్లు ఎందుకు? స్పిన్నర్లు ఎందుకు? వచ్చీరాగానే బ్యాటర్లు విరుచుకుపడేలా ఉండటమే మంచి వికెట్‌ అనిపించుకోదు.

వన్డే ఫార్మాట్‌ అంటే అన్ని రకాల నైపుణ్యాలను పరీక్షించే వేదిక. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం, స్పిన్‌ను ఎదుర్కోవడం.. ఇలాంటివీ ఆస్వాదించాలి. జడేజా, శాంట్నర్, ఆడమ్‌ జంపా బౌలింగ్‌లోని నాణ్యతతోపాటు కేన్‌ విలియమ్సన్, విరాట్, కేఎల్ రాహుల్‌ వంటి బ్యాటర్ల స్ట్రైక్‌ రొటేషన్ కీలకం. వారంతా ఎంతో నైపుణ్యత ప్రదర్శించారు. ఇలా మిడిలార్డర్‌లో స్ట్రైక్‌ను రొటేట్‌ చేయడం చాలా కష్టం. కేవలం సిక్స్‌లు, ఫోర్లు కొట్టేలా పిచ్‌ ఉంటేనే మంచి రేటింగ్‌ ఇవ్వడమనే దానికి మద్దతుగా నిలవలేను. కాబట్టి, పిచ్‌ రేటింగ్‌పై ఇంకాస్త మెరుగైన విధానం ఉంటే బాగుంటుంది. కొన్నిసార్లు పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. మరికొన్నిసార్లు స్వింగ్‌కు సహకారం లభిస్తుంది. వాటన్నింటిని కాచుకుని ఆడాల్సిన నైపుణ్యం బ్యాటర్లకు ఉండాలి. అంతేకానీ సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ 350+ స్కోరు చేస్తేనే మంచి వికెట్లుగా పరిగణస్తామంటే నేను అంగీకరించను’’ అని రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని