Rahul Dravid : ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఘనం.. ఐసీసీ టోర్నీల్లో పేలవం : కోచ్‌గా ద్రవిడ్‌ రిపోర్ట్‌ కార్డిదే

వన్డే ప్రపంచకప్‌ అనంతరం హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) పదవీకాలం ముగియనుంది. మరి ఈ రెండేళ్లలో టీమ్‌ఇండియాను అతడు ఎలా నడిపించాడో పరిశీలిస్తే..

Updated : 15 Aug 2023 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఏ జట్టులోనైనా కోచ్‌ పాత్ర చాలా కీలకం. టీమ్‌ విజయపథాన నడిచినా.. ఓటమిబాట పట్టినా అందులో అతడి బాధ్యత తప్పక ఉంటుంది. జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ.. తనదైన వ్యూహాలతో ముందుండి నడిపించడమే కోచ్‌ ప్రధాన కర్తవ్యం. టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. రవిశాస్త్రి అనంతరం ఈ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. చాలా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌ను విజయవంతంగా నడిపించినప్పటికీ.. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ(ICC) ట్రోఫీ కలను మాత్రం నెరవేర్చలేకపోయాడు. ద్రవిడ్‌ నేతృత్వంలో.. టీమ్‌ఇండియా రెండు ఐసీసీ ఈవెంట్లలో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌ 2022, WTC Final 2023లో ఘోర ఓటమిని చవిచూసింది.

మరికొన్ని రోజుల్లో ఆసియాకప్‌(Asia Cup 2023 ), ఆ తర్వాత స్వదేశం వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్‌ మెగా టోర్నీ(ODI world cup 2023) జరగనుండటంతో.. టీమ్‌ఇండియా సుదీర్ణ నిరీక్షణకు ద్రవిడ్‌ తెరదించుతాడో చూడాలి. ఇక ప్రపంచకప్‌ కోసం పటిష్టమైన టీమ్‌ను సిద్ధం చేసే కమ్రంలో జట్టులో ఇటీవల ద్రవిడ్‌ ప్రయోగాలు చేపట్టినా.. అవి మిశ్రమ ఫలితాలనే అందించాయి. మరి మెగా టోర్నీ కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకువెళ్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఆసియా కప్‌ కోసం భారత జట్టు.. ‘ఈ నాలుగే’ కీలకం!

నవంబర్‌ 2021 తర్వాత రవిశాస్త్రి నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ద్రవిడ్‌ టీమ్‌ఇండియాను ఎలా నడిపించాడో పరిశీలిస్తే..

  • ద్రవిడ్‌ కోచ్‌గా ప్రయాణాన్ని ఘనంగానే ప్రారంభించాడు. డిసెంబర్‌ 2021లో న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయగా.. ఒక టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది.
  • ఆ తర్వాత టీమ్‌ఇండియాకు దక్షిణాఫ్రికా షాక్‌ ఇచ్చింది. జనవరి 2022లో భారత్‌ వన్డే సిరీస్‌, టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.
  • టీమ్‌ఇండియా విజయాల పరంపర ఆ తర్వాత కొనసాగింది. 2022 ఫిబ్రవరి, మార్చిలో వెస్టిండీస్‌, శ్రీలంకలపై సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసింది.
  • అదే ఏడాది జూన్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఐర్లాండ్‌పై టీ20 సిరీస్‌ను నెగ్గింది.
  • ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌ నెగ్గగా.. రీషెడ్యూల్‌ చేసిన ఐదో టెస్టు మ్యాచ్‌ను కోల్పోయింది. 2022 జులై-ఆగస్టులో విండీస్‌పై టీ20, వన్డే సిరీస్‌లను నెగ్గింది.
  • ఇక 2022 ఆగస్టు-సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో సూపర్‌ 4 దశ నుంచి నిష్క్రమించింది.
  • ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై విజయాలు కొనసాగించింది
  • ఇక అక్టోబర్‌ 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఇండియా ఓడిపోయింది.
  • 2022 చివరి నెలలో బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్‌ను కోల్పోగా.. టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
  • ఇక ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకపై.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంది.
  • ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను కోల్పోగా.. టెస్టు సిరీస్‌ను చేజక్కించుకుంది.
  • జూన్‌లో జరిగిన WTC Finalలో ఘోర ఓటమిపాలైంది.
  • ఆ తర్వాత వెస్టిండీస్‌ పర్యటన చేపట్టగా.. టెస్టు, వన్డే సిరీస్‌లను చేజిక్కించుకోగా.. పొట్టి ఫార్మాట్‌లో ఓటమిపాలైంది.

ఆ తర్వాత కొనసాగేనా..?

ఇక ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ అనంతరం ద్రవిడ్‌(Rahul Dravid) రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. మరి ఆ తర్వాత అతడు కొనసాగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే.. మెగాటోర్నీ ఫలితంపైనే అతడి కొనసాగింపు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు