IPL 2024: ఆడమ్‌ జంపా స్థానంలో కొత్త కుర్రాడికి రాజస్థాన్‌ అవకాశం

ఐపీఎల్‌ (IPL) ప్రారంభోత్సవ వేళ ఆటగాళ్లు దూరం కావడంతో పలు ఫ్రాంచైజీలు కొత్త వారిని తమ జట్టులోకి తీసుకుంటున్నాయి.

Published : 22 Mar 2024 17:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత మినీ వేలంలో రూ.1.50 కోట్లకు దక్కించుకున్న ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్ ఆడమ్‌ జంపా (Adam Jampa) సేవలను రాజస్థాన్‌ రాయల్స్ కోల్పోయింది. పనిఒత్తిడి కారణంగా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌కు (IPL 2024) అందుబాటులో ఉండటం లేదని జంపా సమాచారం ఇచ్చాడు. జూన్‌లో టీ20 ప్రపంచ కప్‌ నేపథ్యంలో జంపా ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో భారత యువ ఆటగాడికి రాజస్థాన్‌ జట్టు అవకాశం కల్పించింది. 42వసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా ముంబయి నిలవడంలో కీలకపాత్ర పోషించిన తనుష్‌ కొటియన్‌ను రాజస్థాన్‌ తీసుకుంది. అతడి బేస్‌ ప్రైస్‌ రూ.20 లక్షలకు ఆర్ఆర్‌ దక్కించుకుంది. 

లోయర్‌ ఆర్డర్‌లో పరుగులు చేయడంతోపాటు ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన కొటియన్‌ గతేడాదే ఐపీఎల్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన ప్రదర్శనతో కీలక పాత్ర పోషించినప్పటికీ.. అతడి బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు వచ్చాయి. దీంతో ఆ సీజన్‌లో ఆడేందుకు వీలుకాలేదు. ఇప్పుడు వాటన్నింటినీ తొలగించుకుని ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచాడు. మొత్తం 502 పరుగులు చేయడంతోపాటు 29 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో బరోడాపై 120, సెమీస్‌లో తమిళనాడుపై 89* పరుగులు చేశాడు. ఇవన్నీ జట్టు కష్టాల్లో పడినప్పుడు (రెండో ఇన్నింగ్స్‌లోనే) చేసినవే కావడం గమనార్హం.

రాబిన్‌ మింజ్‌ స్థానంలో బీఆర్‌ శరత్‌

ఇటీవల ద్విచక్రవాహనం నడుపుతూ ప్రమాదానికి గురైన రాబిన్‌ మింజ్‌ స్థానంలో గుజరాత్ టైటాన్స్‌ మరొక ఆటగాడిని తీసుకుంది. కర్ణాటకకు చెందిన వికెట్ కీపర్ - బ్యాటర్ బీఆర్‌ శరత్‌ను ఎంపిక చేసుకుంది. కర్ణాటక తరఫున శరత్‌ 28 టీ20లు, 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 43 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు ఆడాడు. గుజరాత్‌ అతడిని రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌పై సొంతం చేసుకుంది. రాబిన్‌ మింజ్‌ను గత మినీ వేలంలో గుజరాత్‌ రూ.3.60 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన రాబిన్‌ తండ్రి విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని