Riyan Parag: పరాగ్ మా టీమే.. కానీ, నోకియా బౌలింగ్‌లో అలా కొట్టడం బాగోలేదు: రాజస్థాన్‌ బౌలర్

రియాన్‌ ఇన్నింగ్స్‌తో రెండో మ్యాచ్‌లో దిల్లీని రాజస్థాన్‌ ఓడించింది. దూకుడుగా ఆడటంతో రాజస్థాన్‌ మెరుగైన స్కోరు చేసింది.

Published : 31 Mar 2024 15:07 IST

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు రియాన్ పరాగ్ అదరగొట్టేశాడు. గత సీజన్లలో విఫలమైన అతడు ఈసారి మాత్రం సత్తా చాటుతున్నాడు. మరీ ముఖ్యంగా దిల్లీ బౌలర్ నోకియా వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. ఇదే రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే తమ బ్యాటర్ పరాగ్‌ హిట్టింగ్‌ చేయడంపై రాజస్థాన్‌ బౌలర్‌ నాండ్రీ బర్గర్‌కు నచ్చలేదంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం ఏంటంటే..? నోకియా దక్షిణాఫ్రికాకు చెందిన పేసర్. బర్గర్‌ కూడా ఆ జట్టు సభ్యుడే. 

‘‘రియాన్‌ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. అతడి వల్లే మేం మెరుగ్గా బౌలింగ్‌ వేసే అవకాశం వచ్చింది.దక్షిణాఫ్రికాకు చెందిన నోకియా బౌలింగ్‌లో బాదేయడం కాస్త నచ్చలేదు (నవ్వుతూ). కానీ ఇప్పుడు మనమిద్దరం (పరాగ్‌ను ఉద్దేశించి) ఒకే జట్టులో ఉన్నాం. చివరి ఓవర్‌ మాత్రం సంచలనమే’’ అని బర్గర్‌ వ్యాఖ్యానించాడు. 

ఇదే నా బెస్ట్‌ ఐపీఎల్‌ స్కోరు: పరాగ్‌

‘‘నేను 17 ఏళ్ల వయసులో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టా. ఆ తర్వాత రెండేళ్లకు ఐపీఎల్‌లోకి వచ్చా. నా కెరీర్‌లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. చివరి ఓవర్‌లో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టడం ఆనందంగా ఉంది. దాని కోసం పక్కా ప్రణాళికతోనే ఆడా. అనుకున్న విధంగానే పరుగులు సాధించగలిగా’’ అని రియాన్‌ పరాగ్‌ తెలిపాడు. రాజస్థాన్‌ వరుసగా రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. రెండింట్లోనూ పరాగ్‌ కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు