Rajasthan Vs Bengaluru: ఐపీఎల్‌లో ‘ఎలిమినేట్‌’ అయ్యేదెవరు? ‘రాయల్‌’గా ముందుకెళ్లేదెవరు?

వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆర్సీబీని.. ఓటములతో డీలాపడిన రాజస్థాన్‌ కీలక మ్యాచ్‌లో ఏమాత్రం అడ్డుకోగలదో చూడాలి.

Published : 22 May 2024 00:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆఖరి మ్యాచ్‌లో అద్భుతంగా గెలిచి నాకౌట్‌కు చేరిన బెంగళూరు ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ సమరోత్సాహంతో ఉంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించినప్పటికీ గత ఐదింట్లో నాలుగు ఓడిన రాజస్థాన్‌ పరిస్థితి విభిన్నంగా ఉంది. ఐపీఎల్‌ 17వ సీజన్‌ ‘ఎలిమినేటర్’ మ్యాచ్ బుధవారం జరగనుంది. కింగ్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఫామ్‌ను కొనసాగించి బెంగళూరును ముందుకు తీసుకెళ్తాడా? సంజూ నాయకత్వంలోని రాజస్థాన్‌ ‘రాయల్‌’గా వెళ్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

కీలక అంశాలు ఇవే..

  • తొలి 9 మ్యాచుల్లో 8 విజయం సాధించిన రాజస్థాన్‌.. తన చివరి ఐదింట్లో నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.
  • బెంగళూరు గత ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మొదటి 8లో కేవలం రెండు విజయాలనే నమోదు చేసిన ఈ జట్టు.. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే మ్యాజిక్. 
  • రాజస్థాన్ - బెంగళూరు జట్లు ముఖాముఖిగా 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 15 మ్యాచుల్లో గెలవగా.. ఆర్‌ఆర్‌ 13 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. 
  • ఈ సీజన్‌లో అత్యధిక జట్ల స్కోర్లలో బెంగళూరు స్థానం నాలుగోది. లీగ్‌ స్టేజ్‌లో దిల్లీపై  266/7 స్కోరు చేసింది. ఈ ఎడిషన్‌లో కోల్‌కతాపై రాజస్థాన్‌ 224/8 స్కోరును చేసింది. ఇదే ఆ జట్టుకు అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 
  • బెంగళూరు జట్టులో విరాట్, డుప్లెసిస్‌, విల్‌ జాక్స్‌, మ్యాక్స్‌వెల్, డీకే, గ్రీన్ అత్యంత డేంజరస్‌ బ్యాటర్లు. సిరాజ్‌, యశ్‌ దయాళ్, కర్ణ్‌ శర్మ,  గ్రీన్, స్వప్నిల్ సింగ్‌ నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.
  • రాజస్థాన్‌కు కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్‌ పరాగ్, హెట్‌మయెర్, ధ్రువ్‌ జురెల్, రోవ్‌మన్‌ పావెల్ బ్యాటింగ్‌లో అత్యంత కీలకం. బౌల్ట్, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ శర్మతోపాటు టాప్‌ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, అశ్విన్‌ రాణిస్తే ఆర్‌ఆర్‌కు తిరుగుండదు. 
  • ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో విరాట్ కోహ్లీ (708) అందరికంటే ముందున్నాడు. ఈ సీజన్‌లో మరో 267 పరుగులు చేస్తే.. తన అత్యధిక పరుగుల రికార్డును (974) అధిగమించే అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే ఈ మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాలి. 
  • పర్పుల్ క్యాప్‌ అందుకోవాలంటే యుజ్వేంద్ర చాహల్‌కే కొద్దిపాటి అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 17 వికెట్లతో కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ (24) అందరికంటే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే.. ఇంకా మ్యాచ్‌లు ఆడేందుకు ఛాన్స్‌ ఉంది.

రాజస్థాన్‌ జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రోవ్‌మన్‌ పావెల్, రియాన్‌ పరాగ్, షిమ్రోన్ హెట్‌మయెర్, అశ్విన్‌, ధ్రువ్ జురెల్, అవేశ్‌ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్‌ శర్మ, చాహల్

బెంగళూరు జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), కర్ణ్‌ శర్మ, యశ్‌ దయాల్, విజయ్‌ కుమార్, సిరాజ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని