Rajasthan Vs Bengaluru: రాయల్స్‌ సమరం

ఐపీఎల్‌లో రసవత్తర సమరానికి వేళెంౖది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు   బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢీకొంటుంది.   సమవుజ్జీలుగా కనిపిస్తోన్న రెండు జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని భావిస్తున్నారు.

Updated : 22 May 2024 06:49 IST

బెంగళూరు × రాజస్థాన్‌ ఎలిమినేటర్‌ నేడు 
రాత్రి 7.30 నుంచి

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో రసవత్తర సమరానికి వేళైంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢీకొంటుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న రెండు జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. టోర్నీలో రాజస్థాన్, బెంగళూరుల ప్రయాణం చాలా భిన్నంగా సాగింది. పరస్పర భిన్న రీతిలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఈ జట్లు.. భిన్నమైన మానసిక స్థితిలో సమరానికి సిద్ధమయ్యాయి.

రాజస్థాన్‌ ఇలా..

మొత్తంగా చూస్తే లీగ్‌ దశలో రాజస్థాన్‌ రికార్డే మెరుగ్గా ఉంది. బలమైన బ్యాటింగ్, ప్రభావవంతమైన బౌలింగ్‌తో చాలా రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు చాలా ముందే ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. రాజస్థాన్‌ టాప్‌-2లో నిలవడం ఖాయమనే అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా లయ తప్పిన ఆ జట్టు పేలవ ఫామ్‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. వర్షం కారణంగా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ రద్దు కావడానికి ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు.. కాస్త సన్నగిల్లిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ప్రత్యర్థితో సమంగా కనిపిస్తున్నప్పటికీ అద్భుత ఫామ్‌లో ఉన్న ఆర్సీబీతో పోరు రాయల్స్‌కు పెద్ద సవాలే. పైగా బట్లర్‌ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. యశస్వి జైస్వాల్‌ (348), సంజు శాంసన్‌ (504), రియాన్‌ పరాగ్‌ (531) ఎలా చెలరేగుతారన్న దానిపైనే ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌల్ట్, సందీప్‌ శర్మ, అశ్విన్, చాహల్‌ వంటి వారితో రాయల్స్‌ బౌలింగ్‌ కూడా బాగానే ఉంది. 

ఆర్సీబీ అలా..

టోర్నీలో  బెంగళూరు పుంజుకున్న తీరు అద్భుతం. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు ఓడిన ఆ జట్టు.. ఆఖరి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాయల్స్‌కు భిన్నంగా.. బ్యాటు, బంతితో అదిరే ఫామ్‌తో పోరుకు సిద్ధమైంది. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే ఆర్సీబీనే మెరుగ్గా కనిపిస్తోంది. కోహ్లి (708) సూపర్‌ ఫామ్‌ ఆ జట్టుకు పెద్ద సానుకూలాంశం. ఇంకా డుప్లెసిస్‌ (421), పటీదార్‌ (361), దినేశ్‌ కార్తీక్‌ (315), గ్రీన్‌ (228), మ్యాక్స్‌వెల్‌లతో ఆ జట్టు బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌ను అందుకుంటే బెంగళూరుకు తిరుగుండదు. సిరాజ్, దయాళ్, గ్రీన్, ఫెర్గూసన్‌ బౌలింగ్‌ భారాన్ని మోయనున్నారు.

ముఖాముఖిలో..

ఐపీఎల్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడగా ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో, రాజస్థాన్‌ 12 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఈ సీజన్‌లో ఈ జట్లు ఒకేసారి తలపడగా.. రాయల్స్‌ పైచేయి సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు