Rajasthan vs Lucknow: లఖ్‌నవూతో మ్యాచ్‌.. యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగేనా?

సూపర్ సండేలో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత రాజస్థాన్‌ - లఖ్‌నవూ జట్లు జయపుర వేదికగా తలపడనున్నాయి.

Published : 24 Mar 2024 12:30 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తన తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. లఖ్‌నవూతో జైపుర్‌ వేదికగా తలపడనుంది. రాజస్థాన్‌ టీమ్‌లో స్టార్‌ ప్లేయర్లకు కొదవేం లేదు. ఇటు లఖ్‌నవూలోనూ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఉన్నారు. దీంతో ఈ పోరూ రసవత్తరంగా ఉండటం ఖాయం. 

రాజస్థాన్‌లో వీరే కీలకం..

రాజస్థాన్‌ తన సొంత మైదానంలో మ్యాచ్‌ ఆడనుంది. స్పెషల్‌ అట్రాక్షన్‌ మాత్రం యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురెల్. భారత్‌ తరఫున అరంగేట్రం చేసి అదరగొట్టిన వీరిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. గత సీజన్‌లోనూ 14 మ్యాచుల్లో 625 పరుగులు సాధించాడు. వచ్చే జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ కోసం ఈ టోర్నీలో ప్రదర్శన కీలకమవుతుందని అంతా భావిస్తున్న వేళ.. మెరుగ్గా ఆడితే చోటు దక్కించుకొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉండే రాజస్థాన్‌కు కాస్త లక్ కలిసిరావాలి. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది. ఫైనల్‌ వరకూ వెళ్లినా నిరాశతో వెనుదిరిగింది. బౌలింగ్‌లో అశ్విన్‌, అవేశ్‌ ఖాన్, ట్రెంట్ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్, సందీప్‌ శర్మ కీలకం. వీరే కాకుండా ప్రసిధ్‌ కృష్ణ, తనుష్‌ కొటియన్. నాండ్రీ బర్గర్‌ వంటి ఆటగాళ్లూ ఉన్నారు.

కేఎల్‌పైనే దృష్టి.. 

లఖ్‌నవూ జట్టుకు స్టార్‌ క్యాంపెయినర్ కేఎల్ రాహుల్‌ అనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మధ్యలోనే గాయం కారణంగా వైదొలిగిన అతడు ఇప్పుడు ఈ లీగ్‌లో ఆడేందుకు వస్తున్నాడు. ఇటీవలే బీసీసీఐ ఫిట్‌నెస్‌పై స్పష్టత ఇవ్వడంతో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో రాణించడమూ కేఎల్‌కు ముఖ్యమే. పొట్టి కప్‌లో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. దేవదుత్ పడిక్కల్, క్వింటన్‌ డికాక్, కృనాల్ పాండ్య, నికోలస్‌ పూరన్, స్టొయినిస్‌ బ్యాటింగ్‌లో కీలకం. ఆసీస్‌పై సంచలన స్పెల్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన షామార్‌ జోసెఫ్‌  తొలిసారి భారీ లీగ్‌లో ఆడుతున్నాడు. కేల్‌ మయేర్, ఆయుష్‌ బదోనీ గత సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి ఫామ్‌లోకి రావడం లఖ్‌నవూ విజయాలకు అత్యంత అవసరం. 

తుది జట్లు (అంచనా):

రాజస్థాన్‌: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మయేర్, ధ్రువ్‌ జురెల్, రోవ్‌మన్‌ పావెల్, రియాన్‌ పరాగ్‌, అశ్విన్, ట్రెంట్‌ బౌల్ట్, చాహల్‌, సందీప్ శర్మ, 

లఖ్‌నవూ: దేవదత్ పడిక్కల్‌, డికాక్ (వికెట్ కీపర్), దీపక్‌ హుడా, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), నికోలస్‌ పూరన్, మార్కస్ స్టొయినిస్‌, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్‌ ఖాన్, షామార్‌ జోసెఫ్‌, శివమ్‌ మావి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని